Telugu Global
NEWS

ఒడిషాను చూసి బాబుపై భగ్గుమంటున్న బాధితులు

తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాపై దాడి చేసి 12 రోజులు అవుతోంది. చంద్రబాబు, మంత్రులు పర్యటనలు చేస్తున్నారు. కానీ అక్కడ పరిస్థితిని సరిచేయడంలో మాత్రం ప్రభుత్వం విఫలమైనట్టుగానే కనిపిస్తోంది. తిత్లీ తుపాను శ్రీకాకుళంతో పాటు పక్కనే ఉన్న ఒడిషా రాష్ట్రంలోని గజపతి జిల్లాపైనా తీవ్ర ప్రభావం చూపింది. రెండూ పక్కపక్క జిల్లాలే కావడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును పోల్చిచూసుకుని స్థానికులు ఏపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తుపాను వెళ్లిపోయిన మరుసటి రోజే ఒడిషా ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి […]

ఒడిషాను చూసి బాబుపై భగ్గుమంటున్న బాధితులు
X

తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాపై దాడి చేసి 12 రోజులు అవుతోంది. చంద్రబాబు, మంత్రులు పర్యటనలు చేస్తున్నారు. కానీ అక్కడ పరిస్థితిని సరిచేయడంలో మాత్రం ప్రభుత్వం విఫలమైనట్టుగానే కనిపిస్తోంది. తిత్లీ తుపాను శ్రీకాకుళంతో పాటు పక్కనే ఉన్న ఒడిషా రాష్ట్రంలోని గజపతి జిల్లాపైనా తీవ్ర ప్రభావం చూపింది. రెండూ పక్కపక్క జిల్లాలే కావడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును పోల్చిచూసుకుని స్థానికులు ఏపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

తుపాను వెళ్లిపోయిన మరుసటి రోజే ఒడిషా ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేసింది. నిత్యావసరాల కోసం ఒక్కో కుటుంబానికి వెయ్యి రూపాయల నగదు అందజేసింది. ఆ రోజు నుంచే వారికి నీటిని సరఫరా చేస్తోంది. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఇల్లు కూలిపోయిన వారికి టార్చిలైట్లు అందజేసింది. అటుకులు, బెల్లం, బిస్కెట్లను వరుసగా అందజేస్తూనే ఉంది. ఆ వెంటనే ఇల్లుపోయిన వారికి తాత్కాలికంగా తలదాచుకునేందుకు టార్పాలిన్లు , సోలార్ లాంతర్లు, కొవ్వొత్తులు అందజేసింది ఒడిషా ప్రభుత్వం.

ఒడిషా ప్రభుత్వం 50కిలోల బియ్యం అందజేస్తే…. ఏపీ ప్రభుత్వం మాత్రం 25 కిలోల చొప్పున పంపిణి చేసింది. అరకిలో చక్కర, లీటర్‌ నీళ్లు ఇచ్చింది. ఇంటికి రెండు కొవ్వొత్తులతో సరిపెట్టింది. టార్పాలిన్ల పంపిణీ జరగలేదు. అన్నింటికి మించి తుపాను సాయంలో జన్మభూమి కమిటీల ప్రమేయం కూడా బాధితులకు శాపంగా మారింది. సహాయక సామాగ్రిని తొలుత ఆయా గ్రామాల్లోని జన్మభూమి కమిటీల వద్దకు చేరుస్తున్నారు. దాంతో సరుకు పక్కదారిపడుతోందన్న ఆరోపణ ఉంది. పంపిణీలో వివక్షకు అవకాశం ఏర్పడింది.

తెలుగు దిన పత్రిక ఒకటి ఒడిషా, ఏపీ ప్రభుత్వాలు చేస్తున్న సహాయకచర్యలను పోలుస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది. ఏపీ కంటే తుపాను సహాయక చర్యల్లో, బాధితులను ఆదుకోవడంలో ఒడిషా ప్రభుత్వం చాలా మెరుగ్గా ఉందని బాధితులు పత్రిక వద్ద వాపోయారు.

రట్టిణి అనే గ్రామంలో ఒక వార్డు ఒడిషా పరిధిలో ఉంది. దాంతో ఒడిషా పరిధిలోని వార్డుతో పోలిస్తే ఏపీ ఆధీనంలో ఉన్న తమకు సాయం సరిగా అందలేదని లింగరాజు అనే వ్యక్తి వివరించారు. మొత్తం మీద పక్కపక్కనే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న సహాయక చర్యలను పోల్చిచూసేందుకు అవకాశం ఏర్పడింది. ఒడిషా ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తుండడం చంద్రబాబు ప్రభుత్వంలో నెమ్మదితనాన్ని ఎత్తిచూపుతోంది.

First Published:  22 Oct 2018 1:32 AM GMT
Next Story