బీసీల‌కు 34 టికెట్లు ! కాంగ్రెస్ కొత్త ఆలోచ‌న‌

ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్‌లో సామాజిక న్యాయ‌ సూత్రం తెర‌పైకి వ‌చ్చింది. అభ్య‌ర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించాల‌ని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. భక్త చరణ్ దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ సామాజిక వర్గాల వారీగా అభిప్రాయలు తీసుకుంటుంది. ఇప్ప‌టికే ఢిల్లీలో ఇందుకు సంబంధించిన కీల‌క చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

తెలంగాణ‌లో 119 స్థానాలు ఉన్నాయి. వీటిలో 34 బీసీల‌కు, మాదిగ‌ల‌కు 12, మాల‌ల‌కు 7, లంబాడీల‌కు 6. ఆదివాసీల‌కు 6 టిక్కెట్లు ఇవ్వాల‌ని అనుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వ్‌డ్ సీట్లు 31. వారికి ఆ సీట్లే ఇవ్వ‌బోతున్నారు. అయితే బీసీల‌కు 34 సీట్లు ఇస్తే …ఇక మిగిలేది 54 సీట్లు. ఈ స్థానాల‌ను జ‌న‌ర‌ల్‌కు కేటాయించ‌బోతున్నారు.

అయితే మ‌హాకూట‌మికి ఇచ్చే సీట్ల‌లో కూడా ఇదే రిజ‌ర్వేష‌న్ వ‌ర్తించేలా చూడ‌బోతున్నారు. మొత్తానికి ఓ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో రెండు సీట్లు బీసీల‌కు ఇవ్వాల‌ని సూత్ర‌ప్రాయంగా నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఒక సీటు ప‌రిధిలో ఇవ్వ‌డం కుద‌ర‌క‌పోతే వేరే ద‌గ్గ‌ర స‌ర్దుబాటు చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేయ‌నున్నారు.

మ‌రోవైపు 19 ఎస్సీ స్థానాల్లో అభ్యర్థుల గురించి, బలమైన నేతలకు అవకాశాలపై చర్చించారు. ఎస్సీ అభ్యర్థులపై అభిప్రాయాలను సేకరించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల ఎంపికపై ఆ సామాజిక వర్గాల వారితో విడిగా భేటీ నిర్వహించడం ఇదే మొదటి సారి. సమర్థులైన ఎస్సీ అభ్యర్ధులకు జనరల్ స్థానాల్లో అవకాశం కల్పించే విషయంపై కూడా చర్చ జరిగిందని, మేనిఫెస్టోలో కూడా ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసే అంశాలు ఉంటాయని టీపీసీసీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ మీడియాకు తెలిపారు.