సేద్యాన్ని కుంగదీస్తున్న చిన్న కమతాలు 

వ్యవసాయ కమతాలు రాను రాను చిన్నవైపోతున్నాయి. భూముల పంపిణీ అస్తవ్యస్తంగా తయారవుతోందని 2015-16 నాటి వ్యవసాయ రంగంలోని వారి జనాభా గణాంకాలో తేటతెల్లమైంది. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే కమతం ఓ మోస్తరుగానైనా ఉండాలి. వ్యవసాయ గణాంకాలనుబట్టి గ్రామీణ ప్రాంతాలలో సంక్షోభం పెరగడానికి కమతాలు చిన్నవి కావడం కూడా ప్రధాన కారణం అని రుజువైంది.

2010-11లో 159.59 మిలియన్ హెక్టార్లలో సేద్యం సాగితే 2015-16 నాటికి అది 157.14 మిలియన్ హెక్టార్లకు పడిపోయిందని తాజా గణాంకలవల్ల తేలింది. అదే సమయంలో వ్యవసాయం చేసే కమతాలు 5.33 శాతం పెరిగాయి. 2010-11లో ఇవి 138 మిలియన్ హెక్టార్లు ఉంటే 2015-16 నాటికి 146 మిలియన్ హెక్టార్లకు పెరిగాయి. అంటే ఒక్కో రైతు సేద్యం చేసే కమతం ఇదివరకు సగటున 1.15 హెక్టార్లు ఉంటే ఇప్పుడది 1.08 హెక్టార్లకు తగ్గింది. అంటే వ్యవసాయ దార్ల సంఖ్య పెరిగింది కాని కమతాలు కుంచించుకు పోయాయి. కమతం చిన్నదైన కొద్దీ ఉత్పత్తి తగ్గుతుంది.

2011 నాటి పరిస్థితినిబట్టి చూస్తే కమతాలు ముక్కలు ముక్కలు అవుతున్నాయి. పంపిణీ అస్తవ్యస్తంగా తయారవుతోంది. చిన్న, సన్నకారు రైతులు పెరుగుతున్నారు. 2015-16 నాటికి చిన్న, సన్నకారు రైతులు 86.21 శాతం ఉన్నారు. వీరికి రెండు హెక్టార్ల భూమి ఉండడమే గగనమైపోతోంది. అందులోనూ వీరు సేద్యం చేయగలిగిన భూమి 47.34 శాతం మాత్రమే. చిన్న, సన్నకారు రైతులు సేద్యం చేసే భూ విస్తీర్ణం 0.6 హెక్టార్లు మాత్రమే. ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి పేదరికంతో కొట్టుమిట్టాడే రాష్ట్రాలలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.

2 నుంచి 4 హెక్టార్ల భూకమతం ఉన్న వారు మొత్తం సేద్య భూమిలో 9.45 శాతమే. ఇందులో వ్యవసాయ పనులు జరుగుతున్నది 23.65 శాతం కమతాల్లో మాత్రమే. 4 నుంచి 10 హెక్టార్ల భూమి ఉన్న రైతులు 3.76 శాతం అయితే అందులోనూ వ్యవసాయ పనులు కొనసాగుతున్నది 19.96 శాతం భూము కమతాల్లో మాత్రమే. పెద్ద కమతాలున్న వారి చేతిలో ఉన్న భూమి కేవలం 0.57 శాతం అయితే అందులో వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగేది 9.04 శాతమే. షెడ్యూల్డు కులాల వారి చేతిలో 9 శాతం భూమే ఉంది. సగటున వారికి ఉన్న కమతం 0.78 హెక్టార్లు. ఎస్.సి. ల చేతిలో ఉన్న భూమిలో 92 శాతం సన్న, చిన్నకారు రైతులే. దీన్నిబట్టి ఒక సామాజిక వర్గానికి భూమి చాలా తక్కువ అందుబాటులో ఉంది. చాలా రాష్ట్రాలలో ఈ విషయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు.

వ్యవసాయ కమతాలు చిన్నవైనకొద్దీ వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుందా? కమతాలు చిన్నవైన కొద్దీ ఉత్పాదకత తగ్గిపోతోందని 1960లు, 1970లలో విపరీతమైన చర్చ జరిగింది. 2011 నాటి నేషనల్ సాంపుల్ సర్వే గణాంకాలనుబట్టి చూస్తే పెద్ద కమతాలకన్నా చిన్న కమతాలలోనే ఉత్పాదకత ఎక్కువ ఉన్నట్టు రుజువైంది. అయితే తలసరి ఉత్పాదకత తగ్గుతుంది. అందువల్ల పేదరికం తాండవిస్తుంది. చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకు రుణాలు చాలా తక్కువగా అందుబాటులో ఉంటాయి. వారు పెట్టుబడి కోసం మధ్య దళారుల మీద ఆధారపడవలసి వస్తుంది.

అదీగాక ఒక హెక్టారు కన్న ఎక్కువ సేద్యపు భూమి ఉన్న రైతులకే నెలసరి ఆదాయం ఉంటుంది. అంటే వారికే ఇతర వనరుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఒక హెక్టారు కన్నా తక్కువ భూమి ఉంటే తగినంత ఆదాయం ఉండదు. ఆదాయం తక్కువైతేనే వ్యవసాయ సంక్షోభం పెరుగుతుంది. కమతాలు చిన్నవైనకొద్దీ ఈ సమస్య ఇనుమడిస్తుంది. 2015-16 వ్యవసాయ గణాంకాల ప్రకారం 68.52 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. కానీ వీరిలో ఎస్.సి.లు 78.06 శాతం. వ్యవసాయం మీద ఆధారపడ్డ వారిలో ఈ వర్గాలవారే పేదరికంలో మగ్గి పోతున్నారు. కులాల వారీగా సేకరించిన గణాంకాల ప్రకారం చూస్తే కుల వివక్షకు ఎక్కువగా గురి అవుతున్నది ఎస్.సి.లే. వారికి వనరులు అందుబాటులో ఉండవు. అందువల్ల ఉత్పాదకతా తగ్గుతుంది.

వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు తక్కువ అయినందువల్ల కమతాలు చిన్నవైపోవడంవల్ల వారికి దుర్గతీ ఎక్కువే. వారికి ఇతర పనులు చేసే అవకాశమూ ఉండదు. వారి కష్టాలు తీర్చడానికి సేద్య యోగ్యమైన భూములను సంఘటితం చేయవలసిన అగత్యం ఉంది. కౌలుదార్లకు రక్షణ కల్పించడానికి చట్టాలు, కౌలుకు తీసుకునే పద్ధతులను సరళీకృతం చేయడం, భూమి బ్యాంకులు ఏర్పాటు చేయడంలాంటి వాటి గురించి చర్చ జరిగినా కమతాలను సంఘటితం చేయడం సులభం కాదు.

చిన్న కమతాలవల్ల ఉండే ఇబ్బందిని అధిగమించడానికి సహకార సేద్యాన్ని; చిన్న, సన్నకారు రైతులు ఉత్పత్తిదార్ల కంపెనీలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించవచ్చు. అయితే కమతాలను సంఘటితం చేయడంలో రాజ్య వ్యవస్థ కీలక పాత్ర పోషించాలి. ముఖ్యంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలవారిని ఆదుకునే ఏర్పాటు చేయాలి. అనేక రాష్ట్రాలు భూ సంస్కరణలు, వ్యవసాయ సంస్కరణలు అమలు చేయడంలో విఫలమైనాయన్న వాస్తవాన్ని గమనించాలి.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)