మళ్ళీ తమిళనాడులో వేడెక్కిన రాజకీయం

చెన్నైలో రాజకీయం మళ్లీ వేడెక్కింది. రిసార్ట్ రాజకీయాలు మళ్లీ మొదలయ్యాయి. అధికార పార్టీ ప్రలోభ పెడుతుందేమోనన్న అనుమానంతో దినకరన్ వర్గం 18 మంది తిరుగుబాటు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తిరునేల్వేలి జిల్లా కోర్టాలంలోని రిసార్ట్ కు తరలిస్తున్నారు. తామరభరణి నదిలో పవిత్ర స్నాన మాచరించి వారంతా బస్సెక్కి బయలు దేరి వెళ్లే వీడియోలు ఇప్పుడు తమిళనాట మరోసారి రాజకీయ వేడిని రగిల్చాయి.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదు మీద 18 మంది అన్నాడీఎంకే (శశికళ వర్గం) ఎమ్మెల్యేలను స్పీకర్ ధనపాల్ గతేడాది సెప్టెంబరులో అనర్హత వేటు వేశారు. దీంతో వీరంతా కలిసి సీఎం పళని స్వామిని మార్చాలంటూ గవర్నర్ కు లేఖ రాశారు. తామంతా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలమని పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా, 18 ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం అన్నాడీఎంకే కు 116 మంది ఎమ్మెల్యేలు బలం ఉంది. ఇది మెజార్టీ 109 కంటే కొంచమే ఎక్కువ.

అయితే, అనర్హత అంశంపై ఈ వారంలోనే కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇది కీలకంగా మారడంతో అనర్హత వేటు పడ్డ తన 18 మంది ఎమ్మెల్యేలను దినకరన్ రిసార్ట్ కు తరలించారు. సీఎం వర్గం ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉన్నట్లు ఆయన చెబుతున్నారు. కోర్టు ఈ 18 మందిని అనర్హులు కాదని కొట్టివేస్తే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుగానే కొనసాగి ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉందని అన్నాడీఎంకే ప్రభుత్వం భయపడుతోంది.

చైన్నైలో రిసార్ట్ రాజకీయాలు కొత్తేమీ కాదు. జయలలిత మరణించాక పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. శశికళ నేతృత్వంలోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను అప్పుడు కూవతూరు రిసార్ట్ కు తరలించారు. అనంతరం పన్నీర్ సెల్వం తన వర్గ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం పళని స్వామికి మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలో దినకరన్ కూడా తన 18 మంది ఎమ్మెల్యేలను పాండిచ్చేరి, కూర్గ్ లకు తీసుకెళ్లారు.

ప్రస్తుతం అనర్హత అంశంపై కోర్టు తీర్పు వెలువరిస్తుందన్న నేపథ్యంలో ఏం జరగబోతుందోనని ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒక వేళ కోర్టు అనర్హత రద్దు చేస్తే చెన్నైలో రాజకీయం మరింత వేడెక్కుతుందనడంలో సందేహం లేదు. ప్రభుత్వాన్ని ఈ 18మంది ఎమ్మెల్యేలతో కూల్చేందుకు దినకరన్‌ రంగం సిద్ధం చేసినట్టు వార్తలొస్తున్నాయి.