వున్నదే ఇవ్వాలి

ఒక జ్ఞాని తన శిష్యులతో కలిసి ఒక గ్రామానికి వచ్చాడు. ఒక దగ్గర విడిది చేశాడు. మొదట గ్రామస్థులు అతని గురించి పట్టించుకోలేదు. గురువు ప్రతిరోజు తన శిష్యులకు బోధలు చేసేవాడు. ఆ గ్రామస్థులు ఎవరిపట్లా గౌరవాభిమానాలు ప్రదర్శించనివాళ్ళు. గురువు గారు కూడా ఆ విషయం పట్ల పట్టింపు వున్నట్లు కనిపించలేదు. ప్రతిరోజూ శిష్యులకు బోధ చేయ్యడం నిత్యవిధిగా భావించాడు. రోజూ సాయంత్రం శిష్యులతో కలిసి వ్యాహ్యాళికి వెళ్ళేవాడు. ఎదురుగా వచ్చిన ఎవరయినా సరే వాళ్ళని చూసి చిరునవ్వు నవ్వేవాడు. కానీ ఆ గ్రామస్థులు అతన్ని చూసి మొహం చిట్లించుకునే వాళ్ళు. క్రమంగా గ్రామస్థుల మౌనం కాస్తా ద్వేషంగా పరివర్తన చెందింది. ఆ గురువు పట్ల వాళ్ళలో అకారణ శత్రుత్వం ఏర్పడింది. గురువు నివాసం వైపు ఎవరూ వచ్చేవాళ్ళు కారు. గురువు శిష్యులతో వ్యాహ్యాళికి వెళ్ళేపుడు, వచ్చేప్పుడు గురువుని దుర్భాషలాడడం మొదలు పెట్టారు. ‘ఒరే! ఆ కాషాయబట్టలు చూడండి. పనీపాటా లేకుండా జనాన్ని వెంటేసుకుని నీతి బోధలు చెబుతూవున్నాడు.’ అని ఒకడంటే, ‘యిదేదో దొంగల గుంపులా వుంది. మన గ్రామాన్ని దోచుకోవడానికి వచ్చినట్లున్నారు’ అని కొందరంటే యింకొందరు మనసును గుచ్చుకునే మాటలనేవాళ్ళు. గురువు గారు అన్నీ నిర్మలంగా, సహనంగా స్వీకరించేవాడు. పైగా తనని తిట్టిన వాళ్ళ దగ్గరికెళ్ళి ‘మీరు హాయిగా వుండాలి. దేవుడు చల్లగా చూడాలి, మీకు మేలు జరగాలి’ అనేవాడు. శిష్యులు ఆశ్చర్యంతో ‘గురువు గారూ! వాళ్ళు అంతగా తిడుతూవుంటే మీరేమో వాళ్ళ బాగుకోరుతున్నారు. మంచిమాటలు మాట్లాడుతున్నారు’ అన్నారు. గురువు శిష్యులతో ‘మనం ఎదుటి వాళ్ళకి మనదగ్గరున్నదేదో అది యివ్వాలి’ అన్నాడు.

-సౌభాగ్య‌