శీల పరీక్షకు చేతులు కాల్చిన అత్త

కాలం ఎంత ముందుకు వెళ్తున్నా, సమాజంలో మూఢ నమ్మకాలు ఇంకా వేళ్ళూనుకునే ఉన్నాయి. చాలా మందిలో మార్పు వస్తున్నా, మంత్రగాళ్లను అక్షరాస్యులూ విశ్వసిస్తున్నారు. వివాహేతర సంబంధం ఉందన్న సాకుతో కోడలు చేతులు కాల్చిందో అత్త. సంచలనం సృష్టించిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. చివరకు పోలీస్ స్టేషన్ పంచాయతీకి దారి తీసింది.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సుమానీ అనే యువతికి మధురకు చెందిన జైవీర్ అనే యువకుడితో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది రోజులు బాగానే ఉన్నా జైవీర్ కు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇంకొకరితో వివాహేతర సంబంధం ఉన్నట్లు వేధించడం మొదలుపెట్టాడు. ఇతనికి తోడు తల్లి కూడా అతనికి సహకరించడం మొదలుపెట్టింది. చివరికి ఓ మంత్రగాడిని ఆశ్రయించారు.

సదరు మంత్రగాడి సలహా మేరకు సుమానీకి శీల పరీక్షపెట్టారు. చేతులు కాల్చుకోవాలని బలవంతం చేశారు. చేసేది లేక ఆమె అందుకు సిద్ధపడి రెండు చేతులు కాల్చుకుంది. ఆమె బాధతో విలవిల్లాడుతుంటే…. భర్త, అత్త రాక్షసానందం పొందారు. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తనను కట్నం కోసం వేధించుకుతింటున్నారంటూ వాపోయింది. గతంలో కూడా ఇలాగే చేశారని చెప్పింది. తన చెల్లెలు కూడా ఆ ఇంటి కోడలు కావడంతో బాధలు భరిస్తూ వచ్చానని చెప్పుకొని వాపోయింది.