తెలంగాణలో మందు బాబులకు కష్టకాలం….

అవును.. తెలంగాణలో పోలీసులు ‘బెల్ట్’ తీస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం వ్యాపారులు విచ్చలవిడిగా గ్రామాలు, పట్టణాల్లో స్థాపించుకున్న విశృంఖల బెల్ట్ షాపులు పల్లెల్లో ప్రజల రక్తాన్ని, ధనాన్ని తాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు అధికారం ఎన్నికల కమిషన్ చేతుల్లోకి వెళ్లింది. ఎన్నికల కమిషన్ తాజాగా పోలీస్ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేసింది. గ్రామాల్లో శాంతియుత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో పోలీసులు రెచ్చిపోతున్నారు. బెల్ట్ షాపులను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న దాదాపు 2 లక్షల బెల్ట్ షాపులను పోలీసులు మూసివేయించారు.

తాజాగా హుజూరాబాద్ సమీప గ్రామంలో మద్యం అమ్మిన బెల్ట్ షాపు నిర్వాహకుడికి లక్ష రూపాయల జరిమానా విధించారు. ఇప్పుడు పల్లెల్లో మద్యం దొరకడం లేదట.. మండలాల్లోని వైన్ షాపులకు వెళ్లి తెచ్చుకునే ఓపిక ప్రజలకు లేకపోవడంతో మద్యం తాగడం మానేశారట. మందుబాబులు మాత్రం పట్టణాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. 5 బాటిళ్లకు మించి తెచ్చుకుంటే పోలీసులు పట్టుకుంటున్నారు. దీంతో మద్యం బాబులకు కష్టకాలం వచ్చిందంట.

పోలీసులు బెల్ట్ తీయడంతో గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొంది. అల్లర్లు, గొడవలు తగ్గిపోయాయి. పోలీసుల భయానికి ఈ రెండు నెలలు మద్యం అమ్మకుండా బెల్ట్ షాపుల నిర్వాహకులు మిన్నకుండిపోతున్నారు.

ఎన్నికల వేళ ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా మద్యం కొరత తీవ్రంగా వేధిస్తోంది. మద్యం అమ్మకాలు 50శాతం మించి పెరగకూడదని ఈసీ ఆదేశాలు జారీచేయడంతో మద్యం దొరకడం గగనమైంది. దీంతో కార్యకర్తలు, నాయకులకు మద్యం పంచడానికి ఎమ్మెల్యే అభ్యర్థులకు తలకుమించిన భారమవుతోంది. పోలీసులు తీస్తున్న ‘బెల్ట్’ అంతిమంగా పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.