మాలేగావ్ కేసులో పురోహిత్, సాధ్విపై చార్జిషీట్

మహారాష్ట్రలోని మాలేగావ్ లో 2008 సెప్టెంబర్ 29న జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు మంగళవారం (అక్టోబర్ 30) చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్, సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తో సహా మరో అయిదుగురిపై చార్జిషీట్లు ఖరారు చేసింది.

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఎ.) ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వినోద్ పదాల్కర్ నాయకత్వంలోని బెంచి ఈ చార్జిషీట్లకు తుది రూపు ఇచ్చింది. ఏడుగురు నిందితులు తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారని, కుట్ర చేశారని, హత్యలకు పాల్పడ్డారని ఈ చార్జిషీట్ లో పేర్కొన్నారు. చార్జి షీటు దాఖలైంది కనక ఇక మాలేగావ్ పేలుళ్ల కేసులో విచారణ ప్రారంభం అవుతుంది.

పురోహిత్, సాధ్వి తో పాటు ఉద్యోగ విరమణ చేసిన మేజర్ రమేశ్ ఉపాధ్యాయ, అజయ్ రహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణి మీద కూడా చార్జిషీట్లు దాఖలైనాయి. ఈ చార్జిషీటు ఖరారు చేసినప్పుడు నిందితులందరూ కోర్టులోనే ఉన్నారు. మాలేగావ్ బాంబు పేలుళ్లలో ఆరుగురు మరణించారు. వందమందికి పైగా గాయపడ్డారు. మోటార్ సైకిల్ కు బిగించిన బాంబు ఓ మసీదు దగ్గర పేలింది.