Telugu Global
NEWS

దేవతల స్వర్గంలో ఆఖరాట

తిరువనంతపురంలో ఆఖరి వన్డే షో ధోనీని ఊరిస్తున్న 10వేల రికార్డు టీమిండియా- విండీస్ జట్ల పాంచ్ పటాకా వన్డే సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి నాలుగు వన్డేలు ముగిసే సమయానికి టీమిండియా 2-1 ఆధిక్యంతో పైచేయి సాధించడంతో….తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ క్రికెట్ స్టేడియం వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఆఖరి, ఐదోవన్డే నిర్ణయాత్మకంగా మారింది. ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా ముగిసిన నాలుగో వన్డేలో 224 పరుగుల భారీ విజయం […]

దేవతల స్వర్గంలో ఆఖరాట
X
  • తిరువనంతపురంలో ఆఖరి వన్డే షో
  • ధోనీని ఊరిస్తున్న 10వేల రికార్డు

టీమిండియా- విండీస్ జట్ల పాంచ్ పటాకా వన్డే సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి నాలుగు వన్డేలు ముగిసే సమయానికి టీమిండియా 2-1 ఆధిక్యంతో పైచేయి సాధించడంతో….తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ క్రికెట్ స్టేడియం వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఆఖరి, ఐదోవన్డే నిర్ణయాత్మకంగా మారింది.

ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా ముగిసిన నాలుగో వన్డేలో 224 పరుగుల భారీ విజయం సాధించిన టీమిండియా సిరీస్ సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంటే….విండీస్ మాత్రం ఆఖరివన్డేలో నెగ్గి 2-2తో సిరీస్ ను డ్రాగా ముగించాలన్న కసితో ఉంది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ పోటీ ప్రారంభమవుతుంది.

30 ఏళ్ల తర్వాత వన్డే…

వన్డే క్రికెట్ రెండో ర్యాంకర్ టీమిండియా, 8వ ర్యాంకర్ విండీస్ జట్ల పాంచ్ పటాకా సిరీస్ ఆఖరి వన్డేకి… ఆతిథ్యమిస్తున్న తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం సకలహంగులతో ముస్తాబయ్యింది.

కేరళ రాజధాని గడ్డపై మూడుదశాబ్దాల విరామం తర్వాత జరుగుతున్న ఈ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కోసం…బ్యాటింగ్ కు అనువుగా వికెట్ ను సిద్ధం చేశారు.

300కు పైగా స్కోరు సాధించడం ఏమంత కష్టం కాదని…రోహిత్ శర్మ, అంబటి రాయుడు, విరాట్ కొహ్లీ, శిఖర్ ధావన్, షియా హోప్, ఇవిన్ లూయిస్ లాంటి స్ట్రోక్ మేకర్లకు …గ్రీన్ ఫీల్డ్ పిచ్ ఎంతో అనువుగా ఉంటుందని…కేరళ క్రికెట్ సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.

అయితే…మ్యాచ్ ప్రారంభసమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరికలు చేసింది.

భారీగా వర్షం కురిసినా… మ్యాచ్ ను సజావుగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లతో తాము సిద్ధమని మ్యాచ్ కన్వీనర్ జయేశ్ జార్జి ప్రకటించారు.

ధోనీని ఊరిస్తున్న రికార్డు….

టీమిండియా ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ…వన్డే క్రికెట్లో 10వేల పరుగుల రికార్డుకు కేవలం ఒక్క పరుగు దూరంలో మాత్రమే ఉన్నాడు.

తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 280 ఇన్నింగ్స్ లో 9వేల 999 పరుగులు సాధించిన ధోనీ….తిరువనంతపురం వేదికగా విండీస్ తో జరిగే ఆఖరి వన్డేలో 10వేల పరుగుల మైలురాయిని చేరాలన్న పట్టుదలతో ఉన్నాడు. వన్డే క్రికెట్లో ధోనీకి ఓవరాల్ గా 10వేల 173 పరుగులు సాధించిన రికార్డు ఉంది. అయితే …టీమిండియా జట్టులో సభ్యుడిగా మాత్రం 9వేల 999 పరుగులు మాత్రమే సాధించగలిగాడు.

2004లో చిట్టగాంగ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేసిన ధోనీ…ప్రస్తుత సిరీస్ లోని ముంబై వన్డే వరకూ… 331 మ్యాచ్ లు ఆడి..10 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలతో సహా…మొత్తం 10వేల 173 పరుగులు సాధించాడు.

ఇందులో ఆసియా లెవెన్ జట్టులో సభ్యుడిగా ఆడిన 173 పరుగులు సైతం ఉన్నాయి. టీమిండియా తరపున ధోనీ మరొక్క పరుగు సాధించగలిగితే….10వేల పరుగుల రికార్డు సాధించిన భారత ఐదో ఆటగాడిగా, ప్రపంచ క్రికెట్లో 13వ క్రికెటర్ గా మిగిలిపోతాడు.

ఎనిమిదో సిరీస్ కు గురి….

వన్డే క్రికెట్ రెండోర్యాంకర్ టీమిండియా…వరుసగా ఎనిమిదో ద్వైపాక్షిక సిరీస్ విజయానికి ఉరకలేస్తోంది.

విండీస్ తో జరిగే ఆఖరి వన్డే లో టీమిండియా విజయం సాధించినా…లేక మ్యాచ్ వర్షంతో…రద్దయినా…3-1తో లేదా 2-1తో సిరీస్ సొంతం చేసుకోగలుగుతుంది.

మరోవైపు.. ప్రస్తుత సిరీస్ లోని మొదటి నాలుగు వన్డేల్లో మూడు సెంచరీలతో సహా 420 పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ…ఆఖరి వన్డేలో సైతం సెంచరీ సాధించడం ద్వారా… పాకిస్థాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ 515 పరుగుల రికార్డును అధిగమించాలని భావిస్తున్నాడు. వరుణుడు కరుణిస్తేనే ఈ రికార్డు సాధ్యమయ్యే అవకాశం ఉంది.

First Published:  31 Oct 2018 11:01 AM GMT
Next Story