Telugu Global
NEWS

టీమిండియా నంబర్ ఫోర్ గా రాయుడు జోరు

ప్రపంచకప్ కు అంబటి రాయుడు పక్కా తెలుగు రాష్ట్రాలకే గర్వకారణం రాయుడు వన్డే క్రికెట్ రెండోర్యాంకర్ టీమిండియా….టాపార్డర్ కే కీలకమైన నంబర్ ఫోర్ సమస్య ఎట్టకేలకు తీరింది. తెలుగుతేజం అంబటి రాయుడు రూపంలో సమస్యకు పరిష్కారం దొరికింది. విండీస్ తో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ లోని మొదటి నాలుగు వన్డేల్లో నిలకడగా రాణించడం ద్వారా….2019 ప్రపంచకప్ లో పాల్గొనే భారత వన్డే జట్టులో చోటు ఖాయం చేసుకొన్నాడు. మేడిన్ హైదరాబాద్ క్రికెటర్… అంబటి రాయుడు…. […]

టీమిండియా నంబర్ ఫోర్ గా రాయుడు జోరు
X
  • ప్రపంచకప్ కు అంబటి రాయుడు పక్కా
  • తెలుగు రాష్ట్రాలకే గర్వకారణం రాయుడు

వన్డే క్రికెట్ రెండోర్యాంకర్ టీమిండియా….టాపార్డర్ కే కీలకమైన నంబర్ ఫోర్ సమస్య ఎట్టకేలకు తీరింది. తెలుగుతేజం అంబటి రాయుడు రూపంలో సమస్యకు పరిష్కారం దొరికింది. విండీస్ తో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ లోని మొదటి నాలుగు వన్డేల్లో నిలకడగా రాణించడం ద్వారా….2019 ప్రపంచకప్ లో పాల్గొనే భారత వన్డే జట్టులో చోటు ఖాయం చేసుకొన్నాడు.

మేడిన్ హైదరాబాద్ క్రికెటర్...

అంబటి రాయుడు…. ప్రస్తుత భారత క్రికెట్లో తరచుగా వినిపించే ఏకైక తెలుగు పేరు. ఏటా…ఏడువారాలపాటు సాగే ఐపీఎల్ లో మాత్రమే కాదు…. దేశవాళీ రంజీట్రోఫీ, వన్డే క్రికెట్లోనూ నిలకడగా రాణిస్తున్న తెలుగు తేజం రాయుడు మాత్రమే.

హైదరాబాద్ లో పుట్టి, పెరిగి…క్రికెటర్ గా ఎదిగిన రాయుడు…జూనియర్ స్థాయి నుంచే అసాధారణ ప్రతిభతో రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు…జూనియర్ ప్రపంచకప్ లో రన్నరప్ గా నిలిచిన భారతజట్టుకు నాయకత్వం వహించాడు.

అంతేకాదు…దేశవాళీ రంజీ ట్రోఫీ క్రికెట్లో నిలకడగా రాణించినా….కెరియర్ లో తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొని…చివరకు ఐపీఎల్ ద్వారా పుంజుకోగలిగాడు.

ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా నాలుగు సీజన్ల పాటు రాణించిన రాయుడు…ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు.

ఐదేళ్లుగా పోరాటం….

జింబాబ్వేతో 2013 వన్డే సిరీస్ ద్వారా…హరారే వేదికగా…వన్డే అరంగేట్రం చేసిన రాయుడు…భారత జట్టులో చోటు కోసం గత ఐదేళ్లుగా పోరాడుతూనే వస్తున్నాడు.

స్పిన్ , పేస్ బౌలింగ్ లను అలవోకగా ఎదుర్కొంటూ పరుగుల మోత మోగించడంలో రాయుడికి రాయుడు మాత్రమే సాటి. 2018 ఐపీఎల్ సీజన్లో …చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ గా.. రాయుడు…చెలరేగిపోయాడు. సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఇద్దరు ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు.

నాలుగో నంబర్…రాయుడు డన్….

ఇదే సమయంలో…ఇంగ్లండ్ వేదికగా జరిగే 2019 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో…కీలక నాలుగో నంబర్ స్థానం లో ఆడే మొనగాడి కోసం…సెలెక్షన్ కమిటీతో పాటు…కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రంగా అన్వేషిస్తున్న తరుణంలో…నేనున్నానంటూ రాయుడు ముందుకు వచ్చాడు.

విండీస్ తో పాంచ్ పటాకా వన్డే సిరీస్ ద్వారా…అందివచ్చిన అవకాశాన్ని రాయుడు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొన్నాడు. గౌహతీ వేదికగా ముగిసిన తొలివన్డేలో 22 పరుగులు, విశాఖ వన్డేలో 73 పరుగులు, పూణే వన్డేలో 22 పరుగులు సాధించిన రాయుడు…ముంబై వేదికగా జరిగిన కీలక నాలుగో వన్డేలో చెలరేగిపోయాడు.

వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి మూడో వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడంలో ప్రధానపాత్ర వహించాడు. కేవలం 80 బాల్స్ లోనే 4 సిక్సర్లు, 8 బౌండ్రీలతో రాయుడు మెరుపు శతకం బాదాడు.

2017 తర్వాత భారత వన్డే జట్టులోని …నాలుగో నంబర్ స్థానంలో సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడిగా రాయుడు నిలిచాడు.

43 వన్డేల్లో మూడు సెంచరీలు…

హరారే వేదికగా 2013లో జింబాబ్వే పై తొలివన్డే ఆడిన రాయుడు…ఇప్పటి వరకూ ఆడిన 43 వన్డే మ్యాచ్ ల్లో 3 శతకాలు….9 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. తనకు లభించిన పరిమిత అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకొని… ప్రపంచకప్ జట్టులో స్థానం ఖాయం చేసుకోగలిగాడు.

రాయుడు నిలకడగా రాణించడంతో…వన్డే జట్టులోని నంబర్ ఫోర్ స్థానం సమస్య తీరిపోయిందని… కెప్టెన్ విరాట్ కొహ్లీ పొంగిపోతున్నాడు.

రాయుడు చాలా తెలివైన ఆటగాడని…నాలుగో నంబర్ స్థానానికి అతికినట్లు సరిపోతాడని కొహ్లీ కితాబిచ్చాడు. ముంబై వన్డేలో రాయుడు సెంచరీ సాధించిన తీరు… తనకు ఎంతగానో నచ్చిందని తెలిపాడు.

కెప్టెన్ కొహ్లి మాత్రమే కాదు…వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం…రాయుడుపై ప్రశంసల వర్షం కురిపించాడు. బౌలర్ ఎవరైనా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ…దూకుడుగా పరుగులు సాధించడంలో…. రాయుడికి రాయుడు మాత్రమే సాటని ప్రశంసించాడు.

ప్రస్తుత…భారత వన్డే క్రికెట్లో…ప్రపంచకప్ లో పాల్గొనే జాతీయజట్టులో చోటు ఖాయం చేసుకొన్న ఏకైక తెలుగు ఆటగాడు అంబటి రాయుడు మాత్రమే.

ఐపీఎల్ లో ఇప్పటికే మూడుసార్లు ముంబైకి ట్రోఫీ అందించిన జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న రాయుడు….2019 ప్రపంచకప్ ను సైతం…భారత్ కు సాధించిపెట్టాలని కోరుకొందాం.

First Published:  31 Oct 2018 8:30 PM GMT
Next Story