Telugu Global
NEWS

ఈ దేశంలో ఆ వెసులుబాటు ఉన్న ఏకైక వ్యక్తి చంద్రబాబే

ఇంతకాలం బీజేపీ చంద్రబాబును వెనుకేసుకొచ్చిందని…. ఇప్పుడు చంద్రబాబును కాంగ్రెస్‌ వేనుకేసుకొస్తుందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్. పొత్తుల విషయంలో చారిత్రక అవసరం అంటూ చంద్రబాబు చెబుతున్నవన్నీ కథలేనన్నారు. గతంలో కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు వెళ్లి ఎన్నికలు అవగానే బీజేపీతో కలిసి వాజ్‌పేయిని ప్రధానిగా ఒప్పుకున్న వ్యక్తి దేశంలో చంద్రబాబు మాత్రమేనన్నారు. 2019లో కూడా కాంగ్రెస్‌తో ఎన్నికలకు వెళ్లినా ఎన్నికల తర్వాత మోడీ తిరిగి ప్రధాని అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటే మారిన మోడీకి రాష్ట్ర ప్రయోజనాల […]

ఈ దేశంలో ఆ వెసులుబాటు ఉన్న ఏకైక వ్యక్తి చంద్రబాబే
X

ఇంతకాలం బీజేపీ చంద్రబాబును వెనుకేసుకొచ్చిందని…. ఇప్పుడు చంద్రబాబును కాంగ్రెస్‌ వేనుకేసుకొస్తుందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్. పొత్తుల విషయంలో చారిత్రక అవసరం అంటూ చంద్రబాబు చెబుతున్నవన్నీ కథలేనన్నారు. గతంలో కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు వెళ్లి ఎన్నికలు అవగానే బీజేపీతో కలిసి వాజ్‌పేయిని ప్రధానిగా ఒప్పుకున్న వ్యక్తి దేశంలో చంద్రబాబు మాత్రమేనన్నారు.

2019లో కూడా కాంగ్రెస్‌తో ఎన్నికలకు వెళ్లినా ఎన్నికల తర్వాత మోడీ తిరిగి ప్రధాని అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటే మారిన మోడీకి రాష్ట్ర ప్రయోజనాల కోసం మద్దతు ఇస్తున్నానని చంద్రబాబు చెప్పినా ఆశ్చర్యం లేదన్నారు. చంద్రబాబు దృష్టిలో దేశం, రాష్ట్రం అంటే ఆయన మాత్రమేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసినా ఆశ్చర్యం లేదని కాబట్టి మరీ ఎక్కువగా కాంగ్రెస్‌ను తిట్టవద్దని గతంలోనే తాను టీడీపీ నేతలకు చెప్పానన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్‌.

రాష్ట్రంలో ఇసుక, మట్టి, రెవెన్యూ భూములు, దేవుడి భూములు మొత్తం తుక్కుతుక్కు చేసి పారేశారన్నారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్తులపై స్థానిక ఎమ్మెల్యే అంతిమ నిర్ణయం తీసుకుంటారని కేబినెట్‌ తీర్మానం చేసినా అడ్డుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. పోలవరం నిధులు మొత్తం కేంద్రమే ఇవ్వాలని కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ పిటిషన్ వేస్తే…. దాన్ని సమర్దిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే కోర్టుకు సమాధానం కూడా ఇవ్వలేదన్నారు.

కాంగ్రెస్‌తో కలవడానికి ముందే కలిసి వెళ్దామని టీఆర్‌ఎస్‌ను కోరినట్టు చంద్రబాబే స్వయంగా చెప్పారని ఉండవల్లి గుర్తుచేశారు. ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఈ దేశంలో ఎవరితోనైనా, ఎప్పుడైనా కలిసే వెసులుబాటు ఉందని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ నుంచి పార్టీ లాక్కున్నప్పటినుంచి ఇప్పటి వరకు చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం నడుపుతున్నది రాజకీయమో… వ్యాపారమో అర్థం కావడం లేదన్నారు.

ఐటీ దాడులు అన్నది సహజంగా జరుగుంటాయని.. వాటి వల్ల ప్రజలకు ఏంటి ఇబ్బంది అని ప్రశ్నించారు. ఐటీ దాడుల వల్ల తలకిందులైపోయిన వారు ఇప్పటి వరకు ఒక్కరు కూడా లేరన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఎందుకో ఐటీ రైడ్స్‌ అనగానే షేక్ అయిపోయి.. వెంటనే వెళ్లి కాంగ్రెస్‌తో కలిసిపోవడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు కూడా అవసరమైనప్పుడు నిజాయితీగా నిలబడుతారన్న ఒక మెసేజ్‌ను ప్రజల్లోకి పంపాలని అప్పుడే లోకేష్‌ రాజకీయ జీవితం కూడా బాగుంటుందని సలహా ఇచ్చారు ఉండవల్లి.

అందులోభాగంగా నాలుగేళ్లలో జరిగిన ప్రభుత్వ ప్రతి లావాదేవీని ప్రజల ముందు ఉంచాలన్నారు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది అని చంద్రబాబు అనడం అంటే ఇప్పటి వరకు జరిగిన అవినీతి మొత్తం లెక్కలోకి వద్దు అనడమేనన్నారు. చంద్రబాబు ఇంతకాలం తన సొంత మనుషులను కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇప్పటికైనా ప్రజల కోసం ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

పోలవరం ప్రాజెక్టులో చేసిన జెట్‌ గ్రౌటింగ్‌ మొత్తం సాధారణ వరదకే కొట్టుకుపోయిందని ఉండవల్లి అందుకు సంబంధించిన ఫొటోలను మీడియాకు చూపించారు. సాధారణ వరదకే ఇలా కొట్టుకుపోతే ఇక భారీగా వరద వస్తే పరిస్థితి ఏమిటని ఉండవల్లి ప్రశ్నించారు. పోలవరం పనుల్లో నాణ్యత లేని విషయాన్ని అక్కడ పనిచేసే వారే తనకు వివరిస్తున్నారని చెప్పారు. వారు పంపిన ఫొటోలను చూస్తే తనకే భయమేసిందన్నారు. దయచేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రమాదకరంగా మార్చవద్దని సూచించారు.

First Published:  2 Nov 2018 11:25 AM GMT
Next Story