Telugu Global
National

టు-ఇన్-వన్ ఓపెనర్ రోహిత్ శర్మ

2018 సీజన్లో రోహిత్ 1000 పరుగులు 5 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో జోరు… విండీస్ తో సిరీస్ లో టీ-20 కెప్టెన్ గా రోహిత్ టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…2018 వన్డే క్రికెట్ సీజన్ ను…వెయ్యి పరుగుల రికార్డుతో ముగించాడు. విండీస్ తో ముగిసిన పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో రోహిత్ రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో అత్యంత విజయవంతమైన ఓపెనర్ గా నిలిచాడు. తీన్మార్ టీ-20 సిరీస్ లో సైతం టీమిండియా […]

టు-ఇన్-వన్ ఓపెనర్ రోహిత్ శర్మ
X
  • 2018 సీజన్లో రోహిత్ 1000 పరుగులు
  • 5 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో జోరు…
  • విండీస్ తో సిరీస్ లో టీ-20 కెప్టెన్ గా రోహిత్

టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…2018 వన్డే క్రికెట్ సీజన్ ను…వెయ్యి పరుగుల రికార్డుతో ముగించాడు. విండీస్ తో ముగిసిన పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో రోహిత్ రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో అత్యంత విజయవంతమైన ఓపెనర్ గా నిలిచాడు. తీన్మార్ టీ-20 సిరీస్ లో సైతం టీమిండియా పగ్గాలు రోహిత్ చేపట్టాడు.

ఆసియాకప్ గెలుపుతో టాప్ గేర్….

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఇటీవలే ముగిసిన… 2018 ఆసియాకప్ క్రికెట్ టోర్నీ ఫైనల్లో బంగ్లాదేశ్ ను చిత్తు చేయడం ద్వారా టీమిండియా ఏడోసారి టైటిల్ అందుకోడంలో… కెప్టెన్ కమ్ ఓపెనర్ గా రోహిత్ శర్మ ప్రధానపాత్ర వహించాడు.

కెప్టెన్ విరాట్ కొహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో స్టాప్ గ్యాప్ కెప్టెన్ గా జట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ….మూడుజట్ల గ్రూప్ లీగ్, నాలుగుజట్ల సూపర్ ఫోర్ రౌండ్లో..స్థాయికి తగ్గట్టుగా ఆడి.. రెండు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో చెలరేగిపోయాడు.

విండీస్ పైనా అదే జోరు…

అంతేకాదు…వెస్టిండీస్ తో ముగిసిన పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో సైతం రోహిత్ తన మార్క్ బ్యాటింగ్ తో పరుగుల మోత మోగించాడు. రెండుసార్లు 150కి పైగా పరుగుల స్కోర్లతో… చెలరేగిపోయాడు.

హోంగ్రౌండ్ ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా విండీస్ తో ముగిసిన నాలుగో వన్డేలో రోహిత్ 162 పరుగులతో విశ్వరూపం ప్రదర్శించాడు. అంతేకాదు..తిరువనంతపురం వేదికగా ముగిసిన ఆఖరి వన్డేలో సైతం మెరుపు హాఫ్ సెంచరీతో…2018 సీజన్ ను అత్యంత విజయవంతంగా ముగించగలిగాడు.

కొహ్లీ తర్వాతి స్థానంలో రోహిత్…

ప్రస్తుత సీజన్లో ఆడిన వన్డేలలో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ 1202 పరుగులతో టాప్ రన్ గెటర్ గా నిలిచాడు. 133.55 సగటు నమోదు చేశాడు. అయితే …ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం… 2018 సీజన్లో ఆడిన 19 మ్యాచ్ ల్లో 73.57 సగటుతో…1030 పరుగులు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

సిక్సర్ల మొనగాడు రోహిత్ శర్మ…

వన్డే క్రికెట్లో ..సిక్సర్లు బాదుడులో సైతం రోహిత్ తనకు తానే సాటిగా నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత…సిక్సర్ల బాదుడులో డబుల్ సెంచరీ సాధించిన భారత రెండో క్రికెటర్ గా, తొలి ఓపెనర్ గా రికార్డుల్లో చేరాడు.

విండీస్ తో ముగిసిన ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ ద్వారా తన సిక్సర్ల సంఖ్యను 202కు పెంచుకొన్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే సిక్సర్ల ఆల్ టైమ్ గ్రేట్ వీరుల జాబితాలో ఆరోస్థానం సంపాదించాడు.

2007 టు 2018…

పదకొండు సంవత్సరాల క్రితం…2007 సిరీస్ లో భాగంగా బెల్ ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేసిన రోహిత్… ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు.

ప్రస్తుత విండీస్ సిరీస్ వరకూ …రోహిత్ మొత్తం 193మ్యాచ్ ల్లో 21 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలతో 7వేల 454 పరుగులు సాధించాడు. అత్యంత విజయవంతమైన ఓపెనర్ గా నిలిచాడు. 7వేల 17 పరుగులతో 47.78 సగటు నమోదు చేశాడు.

గత ఆరు సీజన్లుగా టాప్ స్కోరర్….

2013 నుంచి 2018 సీజన్ వరకూ….వన్డే క్రికెట్లో ప్రతి ఏడాది టాప్ స్కోర్ సాధిస్తున్న భారత క్రికెటర్ రోహిత్ శర్మ మాత్రమే.

2013లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ 209 పరుగుల భారీ స్కోరు సాధించాడు.

2014 సీజన్లో కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో ముగిసిన మ్యాచ్ లో…264 పరుగుల అత్యధిక స్కోరుతో ఏకంగా ప్రపంచరికార్డే నెలకొల్పాడు.

2015 సీజన్లో కాన్పూర్ గ్రీన్ పార్క్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ 150 పరుగుల అత్యధిక స్కోరు నమోదు చేశాడు.

2016 సీజన్లో పెర్త్ లోని వాకా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన మ్యాచ్ లో 171 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు.

2017 సీజన్లో మొహాలీ లోని పంజాబ్ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 208 నాటౌట్ స్కోరుతో నిలిచాడు.

2018 సీజన్లో సైతం రోహిత్ శర్మే 162 పరుగుల టాప్ స్కోరు సాధించాడు.

ఏడుసార్లు 150కి పైగా స్కోర్లు….

వన్డే క్రికెట్లో రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు సాధించాడు. 150కి పైగా స్కోర్లు ఏడుసార్లు సాధించిన భారత ఒకే ఒక్క క్రికెటర్ గా నిలిచాడు.

అంతేకాదు…వన్డే క్రికెట్ చరిత్రలోనే మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఒకే ఒక్కడుగా కూడా రోహిత్ కు గుర్తింపు ఉంది.

2013 లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన మ్యాచ్ లో రోహిత్ తొలి డబుల్ సెంచరీ బాదాడు.

ఆ తర్వాతి ఏడాది .. శ్రీలంకపై 264 పరుగుల స్కోరుతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

గత ఏడాది శ్రీలంకపై 208 నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా… రోహిత్ శర్మ తన కెరియర్ లో మూడో డబుల్ సెంచరీ సాధించాడు.

టీ-20ల్లో సైతం….

టీ-20ల్లో సైతం.. మూడు సెంచరీలు, వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారత క్రికెటర్ రోహిత్ శర్మ మాత్రమే.

టీమిండియా టు ఇన్ వన్ ఓపెనర్ గా…ఇన్ని అరుదైన రికార్డులు సాధించిన రోహిత్ శర్మ లాంటి ఆటగాడు భారత క్రికెట్ కు దొరకడం నిజంగా అదృష్టమే మరి.

First Published:  3 Nov 2018 11:25 PM GMT
Next Story