వైఎస్సార్సీపీ, జనసేన…. మధ్య దూరం తగ్గుతోందా?

ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. జనసేనలు పొత్తు పెట్టుకోవచ్చనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. వైసీపీలోని కొంతమంది కాపు నేతలు, జనసేనలోని పవన్ సన్నిహితులు ఈ ప్రయత్నాల్లో ఉన్నారని.. కొన్నిసీట్లతో ఇరు పార్టీల మధ్యన డీల్ కుదరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. జనవరి సమయానికి ఈ వ్యవహారం ఒక కొలిక్కి రావొచ్చని అంచనా.

ప్రజారాజ్యం పార్టీ గతంలో గెలిచిన సీట్లను ఇప్పుడు జనసేనకు కేటాయించమని జగన్ ను కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని వల్ల వైసీపీకి కూడా పెద్దగా నష్టం ఉండదు కాబట్టి.. జగన్ కూడా పొత్తుకు ఒప్పుకునే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతూ ఉంది.

ఆ ప్రచారం సంగతలా ఉంటే.. తాజాగా పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ మీద స్పందించిన తీరుతో.. వైసీపీ, టీడీపీల మధ్యన దూరం మరింత తగ్గిందా? అనే చర్చ మొదలైంది.

జగన్ మీద హత్యాయత్నం విషయంలో టీడీపీ తీరును తీవ్రంగా తప్పు పట్టాడు పవన్ కల్యాణ్.

జగన్ మీద ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలే దాడి చేయించి ఉంటారని టీడీపీ నేతలు వ్యాఖ్యానించడాన్ని పవన్ కల్యాణ్ తీవ్రంగా తప్పు పట్టాడు. అలాగే జగన్ పై హత్యాయత్నం విషయంలో చంద్రబాబు నాయుడు తీరును పవన్ తప్పు పట్టాడు.

ఇక టీడీపీ పై ఇతర విమర్శలూ కొనసాగాయి. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ, జనసేనల మధ్యన ఇది దూరాన్ని తగ్గించే అంశమే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే వైసీపీ, జనసేన రాజకీయాలను దగ్గరనుంచి పరిశీలిస్తున్న వాళ్ళు మాత్రం పవన్‌ ఇప్పటికీ చంద్రబాబు మనిషేనని నమ్ముతున్నారు. ఎన్నికలయ్యాక అధికారంలోకి రావడానికి అటు వైసీపీకి గానీ, ఇటు టీడీపీకి గానీ పవన్‌ ఎమ్మెల్యేలు అవసరమైతే…. పవన్‌ మాత్రం తప్పకుండా చంద్రబాబు పక్షాన నిలుస్తాడని చాలామంది అభిప్రాయ పడుతున్నారు.