శబరిమల తీర్పును వ్యతిరేకించడం అనైతికం 

శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలోకి అన్ని వయసుల ఆడవాళ్లు ప్రవేశించవచ్చునని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించినవారూ ఉన్నట్టే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారూ ఉన్నారు. వ్యతిరేకిస్తున్న వారిలో రెండు రకాల ధోరణులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

ఒక వేపున కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం అనుసరిస్తున్న వైఖరికి, కేరళలో ఆ పార్టీ విభాగం అనుసరిస్తున్న పంథాకు పోలిక లేదు. మరో వేపున భారతీయ జనతా పార్టీ వంటి హిందుత్వ వాదులు మత వ్యవస్థలకు ఉన్న అధికారాన్ని సమర్థిస్తున్నాయి. హిందుత్వవాదుల వైఖరిలో భిన్నాభిప్రాయాలు ఏమీ లేవు. వారి వాదన నిలకడగా ఉంది.

కాని స్త్రీ పురుష సమానత్వాన్ని వ్యతిరేకించే వారు సుప్రీంకోర్టును కాదనడం నైతికంగా తప్పు మాత్రమే కాకుండా రాజ్యాంగపరంగా చూస్తే వినాశకరమైంది. బీజేపీ అధ్యక్షుడు ఇటీవల అమలు చేయడానికి వీలు లేని తీర్పులు సుప్రీంకోర్టు ఇవ్వకూడదు అని ప్రకటించడం అనైతికమైంది కావడమే కాక రాజ్యాంగపరంగా వినాశనకరమైంది. దీనివల్ల మూడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మొదటిది బీజేపీ నాయకుడు అనుమానం ఎందుకు వ్యక్తం చేశారు? రెండవది స్త్రీ పురుష సమానత్వం సాధించడంలో కేరళలో కాంగ్రెస్ పార్టీలాంటి పక్షాల నిబద్ధత ఏమిటి? మూడవది శబరిమల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసే రాజకీయ శక్తులు ఏవి? సుప్రీంకోర్టు తీర్పుపై బీజేపీ అధ్యక్షుడి ప్రకటన మోసపూరితమైన సంశయవాదం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత బీజేపీ అధ్యక్షుడు “జనం వ్యతిరేకతను” రెండు ప్రయోజనాలకోసం వినియోగించుకుంటున్నట్టున్నారు.

మొదటిది ఆయన తీర్పును వ్యతిరేకిస్తున్న కేరళవాసుల మద్దతు కూడగట్టాలనుకుంటున్నారు. కేరళలో అధికారం హస్తగతం చేసుకోవాలన్న ఆత్రుతలో ఉన్నారు. అందుకే తీర్పును వ్యతిరేకించే వారి మద్దతు కూడగట్టడానికి తొందరపడుతున్నారు. దానివల్ల తమకు ప్రయోజనం ఉంటుందనుకుంటున్నారు. రెండవది జనం ఎలా వ్యవహరించాలన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. సమానత్వం అన్న అంశాన్ని ఖాతరు చేయలేదు.

నిజానికి ఇలాంటి పరిణామాత్మక అంశాన్ని బీజేపీ, సంఘ్ పరివార్ లోని ఇతర విభాగాలు ఖాతరు చేయడం లేదు. బీజేపీ అధ్యక్షుడు కావాలనే అనుసరించే వైఖరిలో “గతం” మీదే దృష్టి కనిపిస్తుంది తప్ప భవిష్యత్తు మీద కాదు. “అయి ఉంటే” అన్న ఈ ప్రశ్నను గమనిస్తే బీజేపీ మనుషులందరినీ సమానంగా భావించవలసి ఉంటుంది. ఈ భావాన్ని పవిత్ర స్థలాల్లో వ్యక్తం చేయడానికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర మతాల పవిత్ర స్థలాల్లాగే శబరిమల సైతం సమానత్వాన్ని ప్రబోధించే క్షేత్రం అయి ఉండాలి.

ఆధునిక భారతంలో అత్యంత గొప్ప ఆలోచనా పరుడైన జ్యోతీ రావు ఫూలే దేవుడికన్నా “నిర్మిక్” అన్న మాట సమానత్వాన్ని ఎక్కువగా ప్రతిబింబిస్తుంది అన్నారు. దీన్ని అనుసరించవలసిన అగత్యం ఉంది. ఫూలే దృష్టిలో సమానత్వం పురుషులకు, స్త్రీలకు కూడా ఒకే విధంగా వర్తించాలి. “నిర్మిక్” అన్న సమానత్వ భావనను సాకారం చేయడానికి సామాజిక, నైతిక బాధ్యత ఉండాలి.

ఈ సమానత్వం, న్యాయం అన్న భావన తీర్పు ఇవ్వక ముందూ ఉండవలసిందే. మరో రకంగా చెప్పాలంటే పౌర సమాజం, ముఖ్యంగా రాజకీయ పార్టీలు మంకుపట్టుపట్టిన ప్రజల భావనలను సమానత్వం వేపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించాలి. సభ్యత పాటించాలనుకునే ఏ సమాజమైనా చిత్త శుద్ధితో, ఆలోచనా పూర్వకంగా సమానత్వ భావనలను ప్రోత్సహించాలి.

స్త్రీ, పురుష సమానత్వం సమాజ శ్రేయస్సుకు ఉపకరిస్తుందని, దాని ఫలాలు అందరికీ అందాలని రాజకీయ పార్టీలు భావించాలి. ఇందులో జాతి, లింగ, కుల భేదాలకు తావు ఉండకూడదు. ప్రశ్నార్థకమైన రీతిలో వ్యవహరిస్తున్న రాజకీయ పక్షాలు సమాజంలో పాతుకుపోయిన పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా జనాభిప్రాయాన్ని మలచడానికి కృషి చేయాలి.

ఆలయ ప్రవేశ హక్కు పురుషులకు యుగ యుగాలుగా ఉంది. మహిళలకు ఆ హక్కు నిరోధించకూడదు అన్న భావాన్ని కలగజేయాలి. అందువల్ల మహిళలకు ఆలయ ప్రవేశ హక్కును నైతిక దృష్టితో చూడాలి. ఈ అంశం న్యాయవ్యవస్థ పరిశీలనకు వెళ్లకముందే ఈ పని జరిగి ఉండవలసింది.

బీజపీ అధ్యక్షుడి ప్రయత్నం మన సమాజంలో పాతుకుపోయిన పితృస్వామిక భావజాలాన్ని పరిరక్షించడానికే ఉపకరిస్తుంది. ప్రజాభిప్రాయాన్ని ప్రతికూల దిశలో మలచడం అంటే పాతుకుపోయిన పితృస్వామిక భావజాలాన్ని మరింత పదిలం చేయడమే అవుతుంది. ఈ భావజాలాన్ని ఆలయ వ్యవస్థలు కొనసాగించడానికే ఉపకరిస్తుంది. ఇది స్త్రీ పురుష సమానత్వానికి దోహదం చేయదు. ఇది మహిళల, కింది కులాల వారి సమానత్వ ఆకాంక్షలను పరిమితం చేయడానికే తోడ్పడుతుంది.

రాజకీయ పార్టీలు, జనం రాజ్యాంగం విఫలం కావడానికి దోహదం చేస్తే మహిళల తరఫున న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవలసి వస్తుంది. స్త్రీ పురుష సమానత్వం సాధించడంలో రాజకీయ పక్షాలు విఫలమైనందువల్లే, సామాజంలో ఏకాభిప్రాయం సాధించనందువల్లే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవలసి వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష ఫ్రంట్ ప్రభుత్వం చూపుతున్న నిర్ణయాత్మక వైఖరిని అభినందించాలి.

అదే రకంగా వామపక్ష ఫ్రంట్, ఇతర నిమ్నకులాలూ తీర్పు అమలుకు జనాభిప్రాయం కూడగట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులోని సారాంశం ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తే. సుప్రీంకోర్టు తీర్పును పరిణామాత్మకతకు తోడ్పడే క్రియాశీల న్యాయవ్యవస్థకు ప్రతీకగానే చూడాలి.

న్యాయమూర్తులు రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగానే తీర్పు ఇచ్చారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది కాంగ్రెస్ కేరళ విభాగం రాజ్యాంగ నైతికతకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఏ మాత్రం కట్టుబడి ఉంటుందనడానికి కొలమానం అవుతుంది. కేరళ కాంగ్రెస్ నాయకులు ఈ తీర్పును వ్యక్తి హక్కులను పరిరక్షించే దృష్టితోనే కాకుండా సమానత్వానికి ప్రాతిపదకగా చూడాలి.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)