‘అదుగో’ పంది.. పారిపో


ఈమధ్య కాలంలో కాస్త క్రేజ్ ఉన్న సినిమాపై ఈ రేంజ్ లో నెగెటివ్ కామెంట్స్ ఎప్పుడూ పడలేదు. ఆ క్రెడిట్ మొత్తం మన పంది సినిమాకే దక్కుతుంది. అదేనండి ‘అదుగో’ సినిమా. దీపావళి కానుకగా ఈరోజు రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల బుర్రలపై టపాసులు పేల్చింది. థియేటర్లలోనే చుక్కలు చూపించింది. అమ్మో పంది అంటూ ప్రేక్షకుల పరుగు ఒక్కటే తక్కువ.

తనే నిర్మాతగా మారి, తనే డైరక్ట్ చేసి పందిని హీరోగా పెట్టి రవిబాబు తీసిన అదుగో సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. బంటీ పేరుతో సినిమాలో పంది చేసిన విన్యాసాలు ఈకాలం చిన్న పిల్లలకు కూడా నచ్చవని పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోగో ఛానెల్ కు సినిమాను అమ్మేయాలని మరికొందరు సెటైర్లు కూడా వేస్తున్నారంటే, ‘అదుగో’ అంటూ ఈ పంది ఎంత టార్చర్ చేసిందో అర్థంచేసుకోవచ్చు.
రవిబాబు, అభిషేక్ వర్మ, నభా నటేష్ నటించిన ఈ సినిమాలో 2-3 కామెడీ ఎపిసోడ్లు తప్ప ఇంకేమీ లేదు. ఈ ఏడాది వచ్చిన అతిచెత్త చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోతుంది అదుగో సినిమా. ఈ దెబ్బతో రవిబాబు కొన్నేళ్ల పాటు మెగాఫోన్ కు దూరమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.