Telugu Global
National

అయోధ్యగా పేరు మార్చినా.... మందిర నిర్మాణంపై లేని స్పష్టత

మళ్ళీ అయోధ్య హాట్ టాపిగ్గా మారింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ నేతల ప్రసంగాలు రామ మందిర నిర్మాణం చుట్టూ తిరుగుతున్నాయి. యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ అయోధ్యలో పర్యటించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫైజాబాద్ పేరును అయోధ్యగా మారుస్తామని చెప్పిన ఆయన, దీపావళి కానుకగా ఆ పని చేస్తున్నట్లు తెలిపారు. కాగా, రామ మందిర నిర్మాణంపై యోగి ఎటువంటి హామీ ఇవ్వలేదు. అయోధ్య భారతీయ సంస్కృతిలో ముఖ్య భాగంగా ఉందని అన్నారు. శ్రీరాముడిపై నమ్మకం ఉందన్న […]

అయోధ్యగా పేరు మార్చినా.... మందిర నిర్మాణంపై లేని స్పష్టత
X

మళ్ళీ అయోధ్య హాట్ టాపిగ్గా మారింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ నేతల ప్రసంగాలు రామ మందిర నిర్మాణం చుట్టూ తిరుగుతున్నాయి. యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ అయోధ్యలో పర్యటించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫైజాబాద్ పేరును అయోధ్యగా మారుస్తామని చెప్పిన ఆయన, దీపావళి కానుకగా ఆ పని చేస్తున్నట్లు తెలిపారు.

కాగా, రామ మందిర నిర్మాణంపై యోగి ఎటువంటి హామీ ఇవ్వలేదు. అయోధ్య భారతీయ సంస్కృతిలో ముఖ్య భాగంగా ఉందని అన్నారు. శ్రీరాముడిపై నమ్మకం ఉందన్న ఆయన, అంతా మంచే జరుగుతుందని చెప్పారు. అయోధ్యకు ఎవరూ అన్యాయం చేయలేరని చెబుతున్న ఆయన మాటలను అందరూ ఆసక్తిగా గమనించారు. రామ మందిర ప్రకటన కూడా చేస్తారేమోనని భావించారు. అటువంటిదేమీ లేకపోవడంతో రామ భక్తులు అసహనానికి గురయ్యారు.

ఇటీవల అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మారుస్తూ సీఎం యోగి ప్రకటించారు. లక్నోలోని అంతర్జాతీయ క్రికెట్ మైదానానికి అటల్ బిహారీ వాజ్ పేయి పేరును పెడుతున్నట్లు తెలిపారు. యోగీ నిర్ణయాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. తాజాగా, అయోధ్య పేరును స్వాగతిస్తున్నట్లు రామ మందిర ప్రధాన అర్చకుడు మహంత్ సత్యేంద్రదాస్ చెప్పినా, మందిర నిర్మాణంపై స్పష్టత ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.

ఒక అడుగు ముందుకేసిన మహంత్…. కేంద్రం బాధ్యత తీసుకుని రామ మందిర నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే డిసెంబరు 6న అగ్నికి ఆహుతై పోతానని వెల్లడించారు. అయోధ్యకు మెడికల్ కళాశాల, విమానాశ్రయం వస్తుండటం మంచిదే అయినా, మందిర నిర్మాణంపై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు సంత్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహంత్ గౌరీ శంకర్.

కాగా, అయోధ్యలో దీపావళి వేడులు అంబరాన్నంటాయి. ప్రత్యేక అతిథిగా సౌత్ కొరియా ప్రథమ మహిళ కిమ్ జుంగ్ సూక్ పాల్ హాజరయ్యారు. రాణి సూరిరత్న స్మారకాన్ని దర్శించుకున్న అనంతరం అధికార పర్యటనను ఆమె ప్రారంభించారు. ఆమెకు అయోధ్యతో అనుబంధం ఉన్నట్లు పలువురు చెబుతున్నారు. రెండు వేల సంత్సరాల క్రితం రాణి సూరిరత్నదక్షిణ కొరియాకు వెళ్లి అక్కడి రాజు కిమ్ సురోను పెళ్లి చేసుకొని, తన పేరును హియో హ్వాంగ్ గా మార్చుకున్నట్లు చెబుతున్నారు. అందుకోసమే ఆమె అయోధ్య దీపావళి వేడుకల్లో పాల్గొన్నారని చెబుతున్నారు.

First Published:  7 Nov 2018 10:35 AM GMT
Next Story