హంగులు, బొంగులు లేవ్‌…. వార్‌ వన్‌సైడే…. డిసెంబర్‌లో పురాణం విడుదల

జగన్‌పై హత్యాయత్నం చేసి ఇది మా పరిధిలో లేదు… ఎయిర్‌పోర్టులోజరిగింది కాబట్టి కేంద్రం పరిధిలో ఉందని టీడీపీ ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు సినీ నటుడు, వైసీపీ నేత పృథ్వీ. ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే నవ్వడం, హేళన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ప్రెస్‌మీట్‌లో ఎందుకంత ఆనందం అని ప్రశ్నించారు. అదే టీడీపీ నేతలకు జరిగి ఉంటే రోడ్లపై పడి పొర్లి మరీ గోలగోల చేసి… ధర్మపోరాటం తరహాలో మరో టైటిల్‌ పెట్టి కొంగజపం వేస్తూ పడుకుని గోలగోల చేసేవారని మండిపడ్డారు.

దాడి జరిగిన రోజు ప్రెస్‌మీట్ పెట్టిన చంద్రబాబు… ఏమాత్రం గౌరవం లేకుండా జగన్‌ను ”వాడు ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి వెళ్లిపోయాడు” అని అనడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షనేతను చంద్రబాబు లాంటి వయసులో పెద్దవ్యక్తి ”వాడు” అనడం ఎంత నీచంగా ఉందన్నారు. సింపథీ కోసం జగన్‌ చేయించుకుని ఉంటే అక్కడే పడిపోయి సినిమా తరహాలో డ్రామా చేసేవారని అభిప్రాయపడ్డారు. కానీ దాడి జరిగినా జగన్ సింహంలా ధైర్యంగా వచ్చేశారన్నారు.

జగన్‌పై దాడి జరిగితే ఆనందపడడమేనా టీడీపీ నేతల సంస్కారం అని ప్రశ్నించారు. దమ్ముంటే పరుగు పందంలో పరిగెత్తి మగాడు అనిపించుకోండి అని హితవు పలికారు. నటుడు శివాజీ ఏమైనా వీర బ్రహ్మేంద్రస్వామా అని ప్రశ్నించారు. బీజేపీ ఆడిస్తే ఆడే నీచమైన స్థితిలో జగన్‌ గానీ, పవన్‌ గానీ లేరన్నారు. వారిద్దరూ సొంతంగా పార్టీలు పెట్టుకున్నారన్నారు. చంద్రబాబులా వాళ్లది దొంగలించిన సైకిల్ కాదన్నారు.

మొన్నటి వరకు తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్ అన్న వాళ్లు ఇప్పుడు అదే తల్లి కాంగ్రెస్‌ను వైభవంగా పెళ్లి చేసుకున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశానికి ఇబ్బంది వచ్చినప్పుడు చంద్రబాబు దేశానికి ఇబ్బంది వచ్చిందంటారు… కూర్చుని గరుడ పురాణాలు రాస్తుంటారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో హంగ్‌లు, బొంగులు ఏమీ ఉండవని గెలిచేది వైసీపీయే అని చెప్పారు.

తీర్పు ఏకపక్షంగా వైసీపీ వైపు ఉంటుందని జోస్యం చెప్పారు. ఈసారి టీడీపీ గెలిస్తే మనకు తెలియకుండానే మనల్ని కూడా అమ్మేస్తారని పృథ్వీ అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ గవ్వల పురాణాన్ని డిసెంబర్‌లో విడుదల చేస్తామని చెప్పారు. ప్రతి టీడీపీ నాయకుడి బాగోతాలను గవ్వల పురాణంలో వివరిస్తామన్నారు.