Telugu Global
Family

ఈర్ష్యకు ఫలితం

ఎప్పటిలా ఆకాశయానం చేస్తూ విష్ణువు, లక్ష్మి భూలోకంలో మనుషులు ఎట్లా ఉన్నారో చూసి వద్దామనుకున్నారు. చుట్టూ కొండలు, పచ్చనిపొలాలు. పెద్ద పెద్ద చెట్లు ఉన్న గ్రామానికి వచ్చారు. ఇద్దరూ ముసలివాళ్లలా మారిపోయారు. విపరీతమైన వర్షం పడుతోంది. గాలి వీస్తోంది. ముసలి దంపతులు వణికిపోతూ గ్రామంలో ఎవరి ఇంటికి వెళ్లాలా అని ఆలోచించారు. ఎదురుగా ఒక పెద్ద భవనం కనిపించింది. అది ఒక వ్యాపారస్థుడిది. ఆ వ్యాపారి గొప్ప లోభి. అతని భార్య అతనికి తగిన ఇల్లాలు. కాకికి […]

ఎప్పటిలా ఆకాశయానం చేస్తూ విష్ణువు, లక్ష్మి భూలోకంలో మనుషులు ఎట్లా ఉన్నారో చూసి వద్దామనుకున్నారు.

చుట్టూ కొండలు, పచ్చనిపొలాలు. పెద్ద పెద్ద చెట్లు ఉన్న గ్రామానికి వచ్చారు. ఇద్దరూ ముసలివాళ్లలా మారిపోయారు. విపరీతమైన వర్షం పడుతోంది. గాలి వీస్తోంది.

ముసలి దంపతులు వణికిపోతూ గ్రామంలో ఎవరి ఇంటికి వెళ్లాలా అని ఆలోచించారు. ఎదురుగా ఒక పెద్ద భవనం కనిపించింది. అది ఒక వ్యాపారస్థుడిది. ఆ వ్యాపారి గొప్ప లోభి. అతని భార్య అతనికి తగిన ఇల్లాలు. కాకికి కూడా చేయి విదిలించని వాళ్లు. ఇతర్లని పీడించి డబ్బు సంపాదించడం తప్ప వాళ్లకు మరో పని లేదు. గ్రామంలో అందరూ వాళ్లని అసహ్యించుకునే వాళ్లు.

ముసలి దంపతులు ఆ వర్షంలో తడుచుకుంటూ వెళ్లి వ్యాపారి ఇంటి తలుపు తట్టారు. వ్యాపారి తలుపు తీశాడు. ‘అయ్యా! దూర ప్రాంతం నుంచి వస్తున్నాం. విపరీతంగా వర్షం కురుస్తోంది. ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండి ఉదయాన్నే వెళ్లిపోతాం. దయచేసి అంత చోటివ్వండి’ అని ముసలివాడు వేడుకున్నాడు.

వ్యాపారి ‘అడ్డమైన వాళ్లకూ ఆశ్రయమిచ్చే ధర్మసత్రం కాదు మా ఇల్లు. వెళ్లండి’ అని కసురుకుని తలుపు ధబీమని వేసుకున్నాడు.

వృద్ధ దంపతులు ఇటూ అటూ చూశారు. దగ్గర్లో ఒక గుడిసె కనిపించింది. అక్కడికి వెళ్లి తలుపు తట్టారు. ఒక పేద స్త్రీ తలుపు తీసి వాళ్లను చూస్తూనే సంతోషంతో వాళ్లని లోపలికి ఆహ్వానించింది. తలలు తుడుచుకోవడానికి తువ్వాలు ఇచ్చింది. వాళ్ల తడి బట్టలు విప్పమని తన దగ్గర శుభ్రంగా ఉన్న పాత బట్టలు ఇచ్చింది. వాళ్లు బట్టలు మార్చుకున్నారు. విశ్రాంతి తీసుకున్నారు.

ఈలోగా ఆమె తన దగ్గరున్న జొన్న పిండి కలిపి వేడివేడిగా రొట్టెలు చేసింది. వాటితోపాటు తినడానికి కారం, ఉల్లిపాయ పెట్టింది. అంతకు మించి ఈ పేద వాళ్ల దగ్గర ఏమీ లేవు. మన్నించమని కోరింది.

‘అంతమాట ఎందుకమ్మా నీ మనసు పెద్దదని’ వాళ్లు ఆ రొట్టెలు తిన్నారు.

తింటూ ఉండగానే ఆమె భర్త వచ్చాడు. నెత్తిమీది కట్టెల మోపును దించి గోడకానించి తలుపు తట్టాడు. భార్య తీసింది. ఇంట్లో అతిథుల్ని చూసి అతను ఎంతో ఆనందించాడు. వాళ్లతో కాసేపు పిచ్చాపాటీ ముచ్చటించాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు. ఎక్కడికి పోతున్నారు. ఇంత వర్షంలో ఎంత కష్టపడ్డారో అని సానునయ వాక్యాలు పలికాడు.

ముసలి దంపతులు రొట్టెలు తిన్నాకే పేద దంపతులు రొట్టెలు తిన్నారు. తమకు తృప్తిగా పెట్టి వాళ్లు చాలీచాలనిది తినడం వృద్ధ దంపతులు గమనించారు.

భోజన కార్యక్రమం ముగిశాక పేదవాడు ముసలి దంపతులకు పడకలు సిద్ధం చేశాడు. వాళ్లింట్లో రెండే మంచాలున్నాయి. వాటిపై మెత్తటి బట్టలు వేసి వృద్ధ దంపతుల్ని విశ్రమించమన్నాడు.

పేదవాడు, అతని భార్య నేల మీద పడుకున్నారు.

లక్ష్మీ మహావిష్ణువు ఆ నిరాడంబర జీవుల అతిథి మర్యాదలకు ఉప్పొంగిపోయారు. ఉదయాన్నే నిద్ర లేచేసరికి పేదవాడి భార్య వేడివేడిగా మళ్లీ జొన్న రొట్టెలు చేసి మూటగట్టి ఇచ్చింది. వృద్ధ దంపతులు వాళ్లని ఆశీర్వదించి ‘మీరు చల్లగా ఉండాలి’ అని వీడ్కోలు పలికి వెళ్లిపోయారు.

అతిథుల్ని ఆనందపరిచినందుకు తృప్తిగా నిట్టూర్చి పేదవాడు, అతని భార్య ఆ వృద్ధ దంపతుల గురించి మాట్లాడుకుంటూ కాసేపు గడిపారు.

తర్వాత పేదవాడి భార్య పాత్రలు కడగడానికి వెళ్లి పిండి కలిపిన గిన్నెను చూసి నివ్వెరపోయింది. దాన్నిండుగా బంగారు నాణేలు ఉన్నాయి. ఆశ్చర్యంతో భర్తను పిలిచి చూపింది. ఆ బంగారు నాణేల్ని కింద పోశారు. కానీ వెంటనే మళ్లీ ఆ గిన్నె బంగారు నాణేలతో నిండింది.

ఇదంతా దైవలీల అనుకుని పేదవాడు ఆ ధనంతో ఒక పెద్ద భవనాన్ని ఊరి మధ్యలో కట్టి బట్టల కొట్టు తెరిచాడు. నిత్యం ఆ వృద్ధ దంపతుల స్మరణ చేసుకుంటూ పుణ్యకార్యాలు చేస్తూ కాలం గడిపారు.

ఉన్నట్లుండి వీళ్లకు ఇంత ఐశ్వర్యం ఎలా వచ్చిందో వ్యాపారికి అంతుబట్టలేదు. ఏదైనా నిధి దొరికి ఉండాలని సందేహించాడు.

వ్యాపారి భార్య ఒక రోజు పేద దంపతుల్ని ఇంటికి ఆహ్వానించింది. వాళ్ల ఐశ్వర్యానికి ఆశ్చర్యపోతూ ‘ఉన్నట్లుండి మీ జీవితాల్లో ఇంత మార్పు ఎలా వచ్చింది? కారణమేమిటి?’ అని అడిగింది. అప్పుడు వ్యాపారి కూడా అక్కడే ఉన్నాడు.

పేదవాడు అమాయకుడు. కల్లా కపటం ఎరుగనివాడు. జరిగినదంతా దాచుకోకుండా వ్యాపారితో చెప్పాడు.

వాళ్లు వెళ్లిపోయాక వ్యాపారస్థుడు అప్పుడు తాము చేసిన పొరపాటు గుర్తు తెచ్చుకున్నారు. చేజేతులా ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నానే అని బాధ పడిపోయాడు. ఎప్పుడైనా ఆ వృద్ధ దంపతులు రాకపోరు. అప్పుడు వాళ్లని సంతృప్తి పరచి తన కోరిక తీర్చుకోలేకపోతానా అనుకున్నాడు.

ఆకాశం నుంచీ విష్ణువు, లక్ష్మి ఈ వ్యవహారాన్ని గమనించారు. తమాషా చూద్దామని మళ్లీ వృద్ధ దంపతులుగా మారు వేషంలో ఆ గ్రామానికి వచ్చారు.

ఎప్పటిలా వర్షం పడుతోంది. వర్షంలో తడిచారు. వ్యాపారి ఇంటి తలుపు తట్టారు. వ్యాపారి తలుపు తీసి తన్మయం చెందాడు. ఇన్నాళ్లకి తన కోరిక నెరవేరబోతున్నందుకు పులకరించిపోయాడు.

వ్యాపారి భార్య వాళ్లకు తుడుచుకోవడానికి తువ్వాలు ఇచ్చింది. కట్టుకోవడానికి ‘పాత’ బట్టలు ఇచ్చింది. రకరకాల కూరగాయలు, సన్న బియ్యం ఉన్నా వాళ్లకు జొన్న పిండి కలిపి రొట్టెలు చేసి ఇచ్చింది.

వాళ్లు తిన్నాక మంచాల మీద వాళ్లను పడుకోమన్నారు. వేరే మంచాలు ఉన్నా వ్యాపారి, అతని భార్య నేల మీద పడుకున్నారు. పడుకున్నారు కానీ నిద్రపోలేదు. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూశారు.

తెల్లవారాక వ్యాపారి భార్య జొన్న రొట్టెలు చేసి మూట గట్టి వాళ్లకు ఇచ్చింది. వృద్ధ దంపతులు వెళుతూ ఉంటే కొంత దూరం వెళ్లి సాగనంపారు. వృద్ధ దంపతులు వాళ్లని ఆశీర్వదించి ‘మీరు అనుకున్నది జరుగుతుంది. పొద్దున్నే మీరు ఏది మొదలుపెడతారో సాయంత్రం దాకా అది సాగుతూనే ఉంటుంది’ అని చెప్పి వెళ్లిపోయారు.

వ్యాపారి, అతని భార్య మనసులు జొన్నపిండి కలిపిన గిన్నె మీదే ఉన్నాయి. అప్పటికే వ్యాపారి భార్య ఆ పాత్రలో కావాల్సినంత చెత్తా చెదారం నింపి ఉంచింది.

అంతులేని సంపద వస్తే ‘ఏం చెయ్యాలి!’ అని గొడవపడుతూ భార్యాభర్త ఇంటికి చేరారు.

భార్య పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వెళ్లింది. పాత్ర నిండుగా బంగారు నాణేలు ఉంటాయన్న ఆశతో చూసింది.

కానీ పాత్ర నిండుగా చెత్త కనిపించింది. ఆ చెత్త పడేస్తే కింద బంగారు నాణేలుంటాయని చెత్త కుమ్మరించింది. మళ్లీ పాత్ర నిండుగా చెత్త ప్రత్యక్షమైంది. చెత్తను ఊడ్చే కొద్దీ ఇల్లంతా చెత్త నిండిపోతూ వచ్చింది.

ఆ విధంగా దురాశ దు:ఖానికి కారణమైంది.

– సౌభాగ్య

First Published:  8 Nov 2018 9:00 AM GMT
Next Story