బన్నీ సినిమా ప్రకటన మళ్లీ వాయిదా

ఈ దీపావళి కోసం మెగా ఫ్యాన్స్ అందరూ ఆత్రుతగా ఎదురుచూశారు. ఆల్రెడీ రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైనప్పటికీ ఈ ఎదురుచూపులు ఆగలేదు. ఎందుకంటే అటు బన్నీ ఉన్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఆ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటిస్తారని ఫ్యాన్స్ ఆశ. కానీ అభిమానుల ఆశలపై మరోసారి నీళ్లుజల్లాడు బన్నీ.

ప్రేక్షకులకు, అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూనే, తన కొత్త సినిమా అధికారిక ప్రకటన కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయాలంటూ ట్విట్టర్ లో కోరాడు బన్నీ. అభిమానుల్ని బన్నీ ఇలా నిరాశపరచడం ఇది రెండోసారి. గతంలో కూడా ఓసారి ఇలానే ట్వీట్ చేశాడు. తన సినిమా రావడం మరింత ఆలస్యం అవుతుందని, వెయిట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అనీ ట్వీటాడు. తాజా ట్వీట్ ఈ క్రమంలో రెండోది.

బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో స్టోరీలైన్ ఇంకా సెట్ కాలేదు. దీనికంటే ముఖ్యంగా నిర్మాత ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. అందుకే ఎందుకొచ్చిన గొడవని అధికారిక ప్రకటనను వాయిదావేశారు. మరోవైపు త్రివిక్రమ్ తో సినిమా మాత్రం పక్కా అంటూ అనధికారికంగా, ఎప్పట్లానే లీకులు వదిలారు.