ఛత్తీస్‌ఘడ్‌ అసెంబ్లీ ఎన్నికలకు మావోల దెబ్బ..!

ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం కాల్పుల మోతతో అట్టుడుకుతోంది. అటు మావోయిస్టులు, ఇటు పోలీసుల మధ్య కాల్పులతో రాష్ట్రం అట్టుడుకుతోంది. సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ఎమ్మెల్యే కిడారి హత్య తరువాత మావోయిస్టుల దాడి కొనసాగుతోంది.

అంతకు ముందు భారీ నష్టానికి పాల్పడిన ఈ పార్టీ అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంటోంది. త్వరలో చత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇలా వరుసగా ఎన్‌కౌంటర్లు జరగడంపై దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి.

తాజాగా మావోయిస్టులు దంతేవాడ జిల్లాలో బస్సుపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒకరు సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఉన్నారు. అయితే ఇటీవల మావోయిస్టుల కవరేజ్‌కు వెళ్లిన దూరదర్శన్‌ సిబ్బందిపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో కెమెరామెన్‌ అచ్యుతానంద్‌ మరణించడంపై అంతటా సానుభూతి వ్యక్తమైంది. చివరి నిమిషంలో ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియో దేశవ్యాప్తంగా కన్నీరు పెట్టించింది. అలాగే ఆయనతో వెళ్లిన ముగ్గురు ప్రాణాలు విడిచారు. ఇప్పుడు మావోయిస్టులు మరోసారి బస్సుపై దాడికి దిగడంతో అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్‌ చేసుకున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా ఛత్తీస్‌ఘడ్‌లో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆయా పార్టీల నాయకులు. అయితే అంతకంటే ముందే ఇలా దాడులకు పాల్పడుతుండడంతో వారి భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టులు పరోక్షంగా వీరిని టార్గెట్ చేయొచ్చనే అనుమానాలు నెలకొన్నాయి. ఇలా వరుస దాడులకు పాల్పడడంతో మావోయిస్టుల లక్ష్యమేంటో తెలుసుకునేందుకు ఇంటలిజెన్స్‌ వర్గాల వారు మరింతగా పరిశోధిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో విశాఖ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యతో దేశంలో కలకలం సృష్టించారు. దీంతో పోలీసులు అప్రమత్తమై కూంబింగ్‌ను విస్తృతం చేశారు. ఆ తరువాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో దాదాపు 30 మంది మావోయిస్టులు మరణించారు. అలాగే భారీగా మందుపాతరలను కనుగొన్నారు. అప్పటినుంచే నిఘాను తీవ్రతరం చేసినా పోలీసుల కన్నుగప్పి ఇలా దాడులకు పాల్పడడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.