పవన్ కల్యాణ్…. లోకేష్‌నే అంటావా? నీ కథేంటి!

తెలుగుదేశం పార్టీకి పవన్ కల్యాణ్ పై తీవ్రమైన కోపం వచ్చింది. పవన్ కల్యాణ్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు టీడీపీ నేతలు. పిఠాపురం ఎమ్మెల్యే వర్మ పవన్ కల్యాణ్ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు.

తమ పార్టీని, తమ పార్టీ నేతలను అవమానించేలా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడని వర్మ విరుచుకుపడ్డాడు. తమను పవన్ కల్యాణ్ బ్రోకర్లు అని అంటున్నాడని.. పవన్ తన తీరును మార్చుకోవాలని వర్మ వ్యాఖ్యానించాడు.

అలాగే జనసేన అధినేత తరచూ తమ పార్టీ నేత లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతూ ఉన్నాడని, అది కూడా పద్దతి కాదు అని వర్మ అన్నాడు. లోకేష్ కనీసం పంచాయితీ ప్రెసిడెంట్ గా నెగ్గకపోయినా.. మంత్రి అయ్యాడని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్నే వర్మ ప్రస్తావించాడు.

లోకేష్ గెలవలేదు సరే.. నువ్వేమైనా ఎక్కడ నుంచి అయినా పోటీచేసి గెలిచావా? అని వర్మ పవన్ కల్యాణ్ ను ప్రశ్నించాడు. పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి అయినా గెలిచి ఆ తర్వాత లోకేష్ ను అనాలని వర్మ అన్నాడు.

ఇక పవన్ కల్యాణ్ ను రకరకాలుగా ఎద్దేవా చేశాడు ఈ ఎమ్మెల్యే. పవన్ కల్యాణ్ గొప్పదనం ఏమిటి? పార్టీలను పెట్టి విలీనం చేయడం లోనా? అని వర్మ ప్రశ్నించాడు.

మరోవైపు జనసేన, టీడీపీ ల మధ్యన ఫ్లెక్సీ వార్ తీవ్ర స్థాయికి చేరింది. జనసేనను హెచ్చరిస్తూ టీడీపీ, టీడీపీని ఎద్దేవా చేస్తూ జనసేన పరస్పరం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.