ఎంపీ మాగుంట టీడీపీలోనే ఉంటారా?

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. టీడీపీ అధినాయకత్వం వ్యవహరిస్తున్న తీరుతో ప్రధాన నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇటువంటి వారి వరుసలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా చేరిపోయారు. క్షేత్ర స్థాయిలో పార్టీ టిక్కెట్లు ఫలానా వారికి ఇస్తే గెలుపు సునాయాసమని చెబుతున్నా ఆయన మాటలను, చంద్రబాబు ఆచరణలో పెడుతారనే భరోసా లేకపోవడం ఆయనను కలిచి వేస్తుంది.

ప్రతి విషయంలోనూ ఎంపీ మాగుంటను పక్కన పెడుతున్నారట పార్టీ నేతలు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో మాగుంటకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయట. ఈ విషయాన్ని అధిష్ఠానం పరిగణనలోకి తీసుకునే అవకాశాలు చాలా తక్కువగానే ఉండవచ్చు అని అంటున్నారు.

ఉదాహరణకు కొండెపి నియోజకవర్గం విషయానికి వస్తే.. ఇక్కడ పార్టీ అభ్యర్థిని నిర్ణయించేది ‘ దామరచర్ల’ కుటుంబమే. వీరికి సత్య అనే వ్యక్తి అడ్డుతగులుతున్నాడు. ఓ వర్గానికి టిక్కెట్ ఇస్తే, మరో వర్గం సహకరించదు. పార్టీ నష్టపోయే అవకాశం ఉంది. ఇదే పరిస్థితి మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో ఉందని మాగుంట అభిప్రాయపడుతున్నారు.

మాగుంట సూచించిన వ్యక్తులకు టిక్కెట్లు చివరి నిమిషం వరకూ లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయనడంలో సందేహం లేదు. దీంతో ఆయన వైసీపీలోకి చేరేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకుంటే, తాను అనుకున్న వ్యక్తులకు ప్రాధాన్యం లభిస్తే గెలుపు సనాయాసమవుతుందన్న భావనలో ఉన్నట్లు మాగుంట వర్గం అభిప్రాయపడుతుంది. చంద్రబాబు ఆయనను వెనుకకు లాగేందుకు ప్రయత్నం చేస్తున్నా, ఆయన మాత్రం త్వరలో పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.