హరీష్‌రావు ప్రైవేట్ నెంబర్‌ నుంచి ఫోన్ చేశారు….

ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించాల్సిందిగా హరీష్‌రావు తనకు సూచించారని వెల్లడించిన కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి మరిన్ని విషయాలు చెప్పారు. కేసీఆర్‌ను ఓడించాల్సిందిగా హరీష్‌రావు తనకు చెప్పింది ముమ్మాటికీ నిజం అని అన్నారు.

ఈ విషయంపై చర్చించేందుకు హైదరాబాద్‌లో హరీష్‌రావు, తాను రెండు సార్లు కలిసి కూర్చుని చర్చించామని వెల్లడించారు. కానీ హరీష్‌ రావు చెప్పిన దానికి కట్టుబడి ఉండలేదని అందుకే తాను ఈ విషయాన్ని బయటపెట్టాల్సి వస్తోందన్నారు. ఒక ప్రైవేట్‌ నెంబర్‌ నుంచి తనకు హరీష్‌రావు ఫోన్‌ కూడా చేశారన్నారు. వాటికి సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయన్నారు.

సమయం వచ్చినప్పుడు వాటిని బయటపెడుతానన్నారు. మామ కేసీఆర్‌, బామ్మర్ది కేటీఆర్‌ తనను పక్కనపెట్టారన్న భావన హరీష్‌రావుకు ఉందన్నారు. హరీష్‌రావు చాలాకాలంగా కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని ఒంటేరు చెప్పారు. కేసీఆర్‌ను ఓడించాలని తనతో హరీష్‌రావు చెప్పారో లేదో ఆయన మనసాక్షికి కూడా తెలుసన్నారు.

టీఆర్‌ఎస్‌లో హరీష్‌రావు చాలా అసంతృప్తితో ఉన్నారని వివరించారు. నాలుగేళ్లుగా హరీష్‌రావు తనకు టచ్‌లో ఉన్నట్టు ప్రతాప్ రెడ్డి వివరించారు.