యాత్రపై అందరికీ అనుమానాలే!

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అప్పట్లో చేసిన చారిత్రక పాదయాత్ర నేపథ్యంలో యాత్ర అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మమ్ముట్టి కీలక పాత్రధారిగా మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాకీ పూర్తిచేసుకుంది. మమ్ముట్టికి సంబంధించిన పోర్షన్ మొత్తం కంప్లీట్ చేశారు. ఇప్పుడీ సినిమా విడుదల తేదీపై అనుమానాలు చెలరేగుతున్నాయి.
మొదట యాత్ర సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. స్వయంగా మేకర్స్ ఈ ప్రకటన చేశారు. తర్వాత సినిమాను డిసెంబర్ 21కి ప్రీ-పోన్ చేశారు. ఆ రోజు వైఎస్ జగన్ పుట్టినరోజు. కాబట్టి యాత్ర సినిమాను విడుదల చేయడానికి అదే మంచి సందర్భం అనుకున్నారు. కానీ ఇప్పుడు యూనిట్ ఆలోచనలో మళ్లీ మార్పు వచ్చింది.
కాస్త కష్టమైనా, పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ సంక్రాంతికే యాత్ర సినిమాను తీసుకురావాలని అనుకుంటున్నారట. సంక్రాంతి బరిలో ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ ఉంది. మరోవైపు వెంకీ-వరుణ్ నటిస్తున్న ఎఫ్-2 సినిమా ఉంది. వీటితో పాటు రామ్ చరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ ఉండనే ఉంది. ఈ 3 సినిమాలకు పోటీగా ఇప్పుడు యాత్ర కూడా వస్తోందన్నమాట.