ప్ర‌ణ‌య్ హ‌త్య త‌ర‌హాలో మ‌రో దారుణం

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు ప్రణయ్ హత్య కేసు మ‌రువ‌క‌ముందే అదే త‌ర‌హాలో మ‌రో దారుణం జ‌రిగింది. త‌మ‌ని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నార‌నే ఆగ్ర‌హంతో అమ్మాయి త‌రుపు కుటుంబ‌స‌భ్యులు అబ్బాయిని దారుణంగా హ‌త్య చేసి కెనాల్ లో ప‌డేశారు. త‌న ప‌ర‌ప‌తితో అబ్బాయిది హ‌త్య కాదు అని ప్ర‌మాద‌వ‌శాత్తూ నీటిలో ప‌డ్డార‌ని కేసు కొట్టేసేలా చేశారు. కానీ త‌న కుమారుడిని హ‌త్య చేశార‌ని అబ్బాయి త‌ల్లిదండ్రులు కోర్ట్ ను ఆశ్ర‌యించ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

కులం కూడు పెట్ట‌దు అంటారు పెద్ద‌లు. కానీ ఇప్పుడు అదే కులం కోసం విలువైన ప్రాణాల్ని గాలిలో క‌లుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతోనే అల్లుడు ప్రణయ్‌ని అమ్మాయి తండ్రి సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. ఇంత‌టి దారుణానికి తెగ‌బ‌డ‌డానికి కార‌ణం కులం కార్డ్.

యువతి అమృత వర్షిణి వైశ్య (కోమటి) కులానికి చెందినది. యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ ఎస్సీ (మాల) కులానికి చెందిన వ్యక్తి. వీళ్లిద్దరూ స్కూల్‌ రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయం వర్షిణి ఇంట్లో తెలియడంతో ఆమె తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమ్మాయిని వేధింపులకు గురిచేశాడు. చివ‌రికి అల్లుడిని హ‌త్య చేయించి క‌ట‌క‌టాల పాల‌య్యాడు.

ఆ దారుణం గురించి మ‌రిచిపోక‌ముందే కేరళలోని కొట్టాయంకు చెందిన నీనూ(21), జోసెఫ్(23) అనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. జోసెఫ్ బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వారు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి త‌రుపు త‌ల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో పెద్దలను ఎదిరించి నీనూ జోసెఫ్‌లు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన యువతి కుటుంబం జోసెఫ్‌ను కిడ్నాప్ చేయించి, హత్య చేయించి అతని శవం చాలియెక్కర కెనాల్‌లో పడేసింది. హ‌త్య‌ను ప్ర‌మాదంగా సృష్టించి కేసు మ‌రుగున ప‌డేలా చేశారు. కానీ, మృతుని కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీన్ని పరువు హత్యగా నిర్ధారించిన కొట్టాయం అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు విచార‌ణ‌కు ఆదేశించింది.