యూఎస్‌లో శివాజీ…. కొత్త జోస్యం చెప్పిన తమ్మారెడ్డి

ఆపరేషన్ గరుడ పేరుతో హడావుడి చేసి, ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందని చెప్పిన కమెడియన్ శివాజీ…. జగన్‌పై దాడి తర్వాత అమెరికాలోనే ఉన్నారు. ఆయన ఎప్పుడు ఇండియాకు వస్తారో తెలియడం లేదు. శివాజీని వెంటనే అరెస్ట్ చేసి ఆపరేషన్ గరుడ వెనుక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్ ఊపందుకోవడంతో ఆయన యూఎస్‌లోనే ఉన్నారు. దీంతో ఆపరేషన గరుడ పురాణం చెప్పే వారు లేకుండాపోయారు. అయితే దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్‌ తెరపైకి వచ్చారు.

ఆయన కూడా శివాజీ తరహాలోనే జోస్యం చెప్పారు. టీడీపీ నేతలపై అవినీతిపరులుగా ముద్ర వేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కుట్ర సిద్ధాంతం వివరించారు. త్వరలో ఆపరేషన్ ‘బీ’ ప్రారంభమవుతుందన్నారు. 15 రోజుల్లో టీడీపీ నేతల ఇళ్లపై ఈడీ దాడులు కూడా జరుగుతాయన్నారు. 30 మంది టీడీపీ ప్రజాప్రతినిధులు దాడుల లిస్ట్‌లో ఉన్నారని చెప్పారు.

వారి పేర్లను కూడా భరద్వాజ చెప్పడం విశేషం. టీడీపీ మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస్‌రావు, శిద్దారాఘవరావు, ఎంపీలు సీఎం రమేష్, మురళీమోహన్, ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్‌, వల్లభనేని వంశీ, బోడే ప్రసాద్, కేఎల్‌ వర్శిటీ అధినేత, గేట్‌వే హోటల్ అధినేతలు ఐటీ టార్గెట్‌లో ఉన్నారని తమ్మారెడ్డి లిస్ట్‌ కూడా చెప్పేశారు.

ఆ లిస్ట్‌ ఎక్కడి నుంచి వచ్చిందో మాత్రం చెప్పలేదు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన సీనియర్ నేతలపైనా ఐటీ దాడులు జరుగుతాయన్నారు. శివాజీ అమెరికాలో ఉండడంతో గరుడ పురాణంలో తర్వాత ఏం జరుగుతుందన్నది చాలా మందికి తెలిసే అవకాశం లేకుండా పోయింది.

ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్‌ తెరపైకి రావడంతో ఈ ఆపరేషన్ రచన తెలిసే అవకాశం ఉంది. మరోవైపు… కాంగ్రెస్‌-టీడీపీ పొత్తుపై మాజీ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కూడా తమ్మారెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్‌ వాళ్లను సన్నాసులు అనడాన్ని తప్పుపట్టారు. భాష హుందాగా ఉండాలని హితవు పలికారు.