గవర్నర్‌ భుజాలపై నుంచి ఫిరాయింపు దారుల పైకి బాబు గురి

ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో చంద్రబాబుకు తెలిసినంతగా మరొకరికి తెలియదనే అభిప్రాయం బలంగా ఉంది. అవసరానికి గవర్నర్‌ను తిట్టడం, తనకు అవసరం వచ్చినప్పుడు అదే గవర్నర్ పేరు చెప్పి గట్టెక్కడం బాబుకు వెన్నతోపెట్టిన విద్య అని చాలాసార్లు నిరూపితం అయింది. తాజాగా 11న జరగనున్న మంత్రి వర్గ విస్తరణలో మైనార్టీ కోటా, గిరిజన కోటాను భర్తీ చేసేందుకు బాబు సిద్దమయ్యారు.

గిరిజన కోటాలో ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ముస్లిం కోటాలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు చాంద్ బాషా, జలీల్ ఖాన్‌ కోటి ఆశలతో ఎదురుచూశారు. కానీ వారి ఆశలు దాదాపు అడియాశలేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరి ముగ్గురికి మంత్రి పదవి ఎగొట్టాలని భావిస్తున్న చంద్రబాబు…. తెలివిగా గవర్నర్ అంశాన్ని ప్రచారం చేయిస్తున్నారు.

ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో ఫిరాయింపుదారుల చేత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించేందుకు గవర్నర్ అంగీకరించరని టీడీపీ నేతలు …. ఫిరాయింపుదారులకు వినిపించేలా ప్రచారం చేస్తున్నారు. దాంతో మంత్రి పదవి ఆశిస్తున్న ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆవేదన చెందుతున్నారు.

కదిరి ఫిరాయింపు ఎమ్మెల్యే చాంద్‌ బాష మరో అడుగు ముందుకేసి తన బాధ బయటపెట్టారు. కేబినెట్ విస్తరణలో తనకు పదవి ఇవ్వాల్సిందిగా చంద్రబాబును కోరుతానన్నారు. తనతో పాటు పార్టీ ఫిరాయించిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి తన పట్ల మాత్రం వివక్ష చూపడం సరికాదన్నారు.

కేంద్రంతో విభేదాల నేపథ్యంలో తనను మంత్రివర్గంలో చేర్చుకునేందుకు గవర్నర్‌ అభ్యంతరం తెలుపుతారనే ప్రచారం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు విషయం చంద్రబాబుకే తెలియాలన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు బాషా.