Telugu Global
NEWS

అంత నమ్మకం ఉంటే బాబు కూడా ఏపీ పోలీసుల భద్రతనే తీసుకోవాలి....

ఏపీలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు నీరు గార్చిన తీరును చూసిన తర్వాతే తాము థర్డ్ పార్టీ విచారణను కోరుతున్నామన్నారు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేని జగన్‌…. పాదయాత్ర ఎలా చేస్తారని మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించడం పైనా ఆమె మండిపడ్డారు. మంత్రి కాలువ విమర్శలు చూస్తుంటే టీడీపీ నేతల కడుపు మంటంతా జగన్‌ పాదయాత్రపైనే ఉందన్న విషయం అర్థమవుతోందన్నారు. ఏపీ పోలీసులపై నమ్మకం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు మరి 15 […]

అంత నమ్మకం ఉంటే బాబు కూడా ఏపీ పోలీసుల భద్రతనే తీసుకోవాలి....
X

ఏపీలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు నీరు గార్చిన తీరును చూసిన తర్వాతే తాము థర్డ్ పార్టీ విచారణను కోరుతున్నామన్నారు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ.

రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేని జగన్‌…. పాదయాత్ర ఎలా చేస్తారని మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించడం పైనా ఆమె మండిపడ్డారు. మంత్రి కాలువ విమర్శలు చూస్తుంటే టీడీపీ నేతల కడుపు మంటంతా జగన్‌ పాదయాత్రపైనే ఉందన్న విషయం అర్థమవుతోందన్నారు.

ఏపీ పోలీసులపై నమ్మకం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు మరి 15 ఏళ్లుగా బ్లాక్‌ క్యాట్ కమాండోల భద్రతలో ఎందుకున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న తొమ్మిదేళ్ల సంగతి వదిలేసినా అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో కూడా ఎందుకు కేంద్రం పరిధిలోని జెడ్‌ ప్లస్ కేటగిరిలో చంద్రబాబు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏపీ పోలీసులపై చంద్రబాబుకు అంత నమ్మకమే ఉంటే బ్లాక్‌ క్యాట్ కమాండోలను వదిలేసి ఏపీ పోలీసులను భద్రతకు ఉంచుకోవాలని సూచించారు.

ఏపీ పోలీసుల మీద చంద్రబాబుకే తొలి నుంచి నమ్మకం లేదన్నారు. పరిటాల రవి హత్య జరిగినప్పుడు సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు కోరింది నిజం కాదా… అప్పుడు ఏపీ పోలీసుల మీద నమ్మకం ఉంటే సీబీఐ విచారణకు చంద్రబాబు ఎందుకు డిమాండ్ చేశారని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.

నాలుగున్నరేళ్లలో ఆరు అంశాలపై సిట్ విచారణకు ఆదేశించారని…. కానీ ఏ ఒక్క దాంట్లో కూడా నిజాలు బయటకు రాలేదన్నారు. సిట్‌ అంటే కేసును క్లోజ్ చేయడమేనని ఆమె విమర్శించారు.

విశాఖ భూకుంభకోణంలో తన ప్రమేయం లేదని సిట్‌ తేల్చిందంటూ…. అందుకు చంద్రబాబుకు గంటా శ్రీనివాసరావు కృతజ్ఞతలు చెప్పడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఫోన్‌ ట్యాపింగ్‌పై వేసిన సిట్ దర్యాప్తు ఏమైందని ప్రశ్నించారు.

శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలను కాల్చి చంపిన అంశంపై వేసిన సిట్‌ ఏమైందని నిలదీశారు. బోండా ఉమా భూదందాలపై వేసిన సిట్‌ దర్యాప్తు ఏమైందని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. కాల్‌ మనీ సెక్స్ రాకెట్‌పై వేసిన సిట్‌ దర్యాప్తు ఎక్కడికి పోయిందో చెప్పాలన్నారు.

చంద్రబాబు జరిపించే విచారణలు ఎలా ఉంటాయో గోదావరి పుష్కరాలపై వచ్చిన జస్టిస్ సోమయాజుల కమిషన్‌ రిపోర్టే ఒక ఉదాహరణ అని విమర్శించారు. సిట్‌ అంటే టీడీపీ నేతలకు ఒక రక్షణ కవచం అన్న విషయం ప్రజలకు అర్థమైపోయిందన్నారు.

ఏపీ పోలీసుల విశ్వసనీయతను నాశనం చేసింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. నాలుగున్నరేళ్ల కాలంలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు నాశనం చేసిన తీరును చూసిన తర్వాతే తాము థర్డ్ పార్టీ విచారణను కోరుతున్నామన్నారు.

జగన్‌పై హత్యాయత్నం కేసులో అసలు దోషులు బయట పడకుండా ఉండేందుకే సిట్ వేసి …. ఘటన తీవ్రతను తగ్గించేందుకు కోడికత్తి కేసు అంటూ ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

రాజధానిలో భూములివ్వని రైతుల పంటలు తగలబెట్టించి దాన్ని కూడా ప్రతిపక్షంపైకి నెట్టి వేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. పంటల దహనం కేసులో నిజాలు రాబట్టేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఐపీఎస్‌లను వెంటనే బదిలీ చేసింది నిజం కాదా అని నిలదీశారు.

దర్యాప్తు మొదలవకముందే చంద్రబాబు… వైసీపీపైనే తిరిగి ఆరోపణలు చేస్తూ విచారణ నివేదిక ఎలా ఉండాలో పోలీసులకు దిశానిర్దేశం చేస్తున్నారని.. అప్పుడు నిష్పక్షపాతంగా విచారణ ఎలా జరుగుతుందని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.

First Published:  10 Nov 2018 5:50 AM GMT
Next Story