Telugu Global
Others

ప్రపంచ యుద్ధ మహా విలయం      

ఏ యుద్ధంలోనైనా విజేతలూ అపారమైన విధ్వంసాన్ని భరించవలసి ఉంటుంది కనక వారూ పరాజితులే. ప్రపంచ చరిత్రగతిని మార్చిన మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా దేశాలతో కూడిన మిత్ర పక్షాలు విజయం సాధించాయి. జర్మనీ, ఆస్ట్రియా-హంగరీ, ఇటలీ దేశాలు ఓడిపోయాయి. కానీ విజేతలూ విపరీతమైన నష్టాన్నీ అనుభవించవలసి వచ్చింది. 1914 జులై 28న ప్రారంభమై 1918 నవంబర్ 11న ముగిసిన మొదటి ప్రపంచ యుద్ధం, 1939లో మొదలై 1945 వరకు సాగిన రెండో ప్రపంచ యుద్ధమూ […]

ప్రపంచ యుద్ధ మహా విలయం      
X

ఏ యుద్ధంలోనైనా విజేతలూ అపారమైన విధ్వంసాన్ని భరించవలసి ఉంటుంది కనక వారూ పరాజితులే. ప్రపంచ చరిత్రగతిని మార్చిన మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా దేశాలతో కూడిన మిత్ర పక్షాలు విజయం సాధించాయి. జర్మనీ, ఆస్ట్రియా-హంగరీ, ఇటలీ దేశాలు ఓడిపోయాయి. కానీ విజేతలూ విపరీతమైన నష్టాన్నీ అనుభవించవలసి వచ్చింది.

1914 జులై 28న ప్రారంభమై 1918 నవంబర్ 11న ముగిసిన మొదటి ప్రపంచ యుద్ధం, 1939లో మొదలై 1945 వరకు సాగిన రెండో ప్రపంచ యుద్ధమూ ప్రపంచ రాజకీయ చిత్రపటాన్ని సమూలంగా మార్చేశాయి. సకల యుద్ధాల అంతానికే మొదటి ప్రపంచ యుద్ధం అని చెప్పినా రెండో ప్రపంచ యుద్ధం అనివార్యమైంది. అయినా మౌలిక సమస్యలు పరిష్కారం కానేలేదు. రెండో ప్రపంచ యుద్ధానికి కావలసిన బీజాలు మొదటి ప్రపంచ యుద్ధంలోనే ఉన్నాయి.

మానవ జాతి చరిత్రలో ఎన్నడూ లేనంతటి శక్తిని ప్రపంచం సాధించింది. కానీ ఆ శక్తి వినాశనానికే ఉపకరించింది. అయితే “సహజీవనం సాగించడమో” కాకపోతే “ఉమ్మడిగా సర్వనాశనం కావడమో” తేల్చుకోవాలన్న వాస్తవం నుంచి మానవాళి ఇంకా గుణపాఠం నేర్చుకోకపోవడమే ప్రపంచ యుద్ధాలను మించిన విషాదం.

రెండో ప్రపంచ యుద్ధం నాటికి యూరప్ లో 25 సార్వభౌమాధికారంగల దేశాలున్నాయి. ఏ దేశం దారి ఆ దేశానిదే. మరో దేశం మాట వింటే లేదా జోక్యాన్ని అనుమతిస్తే అంతర్జాతీయంగా తమ ప్రతిష్ఠ దిగజారుతుందనుకునేవి. 1,565 రోజుల పాటు సాగిన మొదటి ప్రపంచ యుద్ధం కన్నా ముందు వివిధ దేశాల మధ్య యుద్ధాలు లేకపోలేదు. కాని మొదటి ప్రపంచ యుద్ధ బీభత్సం సకల దేశాలనూ కుదేలు చేసింది.

ఇది కేవలం సైన్యాల మధ్య పోరు కాదు. సంపూర్ణమైన యుద్ధం. సరిహద్దు తగాదాలు, జాతి వైషమ్యాలు యుద్ధాలకు మూలకారణంగా కనిపించినా అసలు లక్ష్యం ప్రజలను, వనరులను, ఆర్థిక వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకోవడమే సకల యుద్ధాల అసలు లక్ష్యం.

యుద్ధ కారణాలు

మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగిందో నిర్దిష్టమైన కారణాలు చెప్పడం సులభం కాదు. ఏ యుద్ధంలోనైనా మొదట బలయ్యేది సత్యం. ఈ యుద్ధంలోనూ అలాగే జరిగింది. ఆస్ట్రియా-హంగరీ యువరాజు ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ ను 1914 జూన్ లో బ్లాక్ హాండ్ అనే తీవ్రవాద ముఠా హతమార్చడంవల్లే యుద్ధం మొదలైంది అన్నది పైకి కనిపించే కారణం మాత్రమే. ఈ హత్య యుద్ధ జ్వాలలు రగిలించడానికి నిప్పుకణికగా ఉపకరించి ఉండవచ్చు.

ప్రపంచ యుద్ధానికి ముందు యూరప్ లో వివిధ దేశాల మధ్య సైనిక ఒప్పందాలు ఉండేవి. ఒక దేశం మీద దాడి జరిగితే రెండు పక్షాలకు చెందిన సైనిక కూటములు ప్రత్యర్థి పక్షాలపై యుద్ధం ప్రకటించేవి. ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీకి ఆస్ట్రియా-హంగరీకీ మధ్య; రష్యాకు ఫ్రాన్స్, సెర్బియాతో; బ్రిటన్ కు ఫ్రాన్స్, జపాన్, బెల్జియంతో సైనిక ఒప్పందాలు ఉండేవి.

ఫ్రాంజ్ ఫెర్డినాండ్ ను హతమార్చిన తర్వాత ఆస్ట్రియా-హంగరీ సెర్బియా మీద యుద్ధం ప్రకటించింది. సెర్బియాతో సైనిక ఒప్పందం ఉన్నందువల్ల రష్యా సైన్యాలను సమీకరించడంతో జర్మనీ రష్యాపై యుద్ధం ప్రకటించింది.

జర్మనీ, ఆస్ట్రియా-హంగరీకి వ్యతిరేకంగా ఫ్రాన్స్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. జర్మనీ బెల్జియం లోకి ప్రవేశించి ఫ్రాన్స్ మీద యుద్ధానికి దిగడంతో బ్రిటన్ సైతం యుద్ధంలో భాగస్వామి అయింది. ఆ తర్వాత జపాన్, ఇంకా తర్వాత ఇటలీ, అమెరికా మిత్ర రాజ్యాల పక్షం వహించాయి. 1870 నుంచి 1914 మధ్య ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ, రష్యా దేశాలలో రక్షణ వ్యయం విపరీతంగా పెరిగింది. జర్మనీలో రక్షణ వ్యయం 73 శాతం పెరిగితె రష్యాలో 39 శాతం పెరిగింది.

దురాక్రమణ కాంక్షే అన్ని యుద్ధాలకూ మూలం. ఇతర దేశాలను ఆక్రమించి అక్కడి వనరులను, సంపదను కొల్లగొట్టే దేశాలకు సామ్రాజ్య విస్తరణ కాంక్ష బలంగా ఉంటుంది. ఇదే సామ్రాజ్యవాదం. ఆక్రమించుకున్న దేశాలలో ఉన్న ముడి సరుకుల మీద ఆధిపత్యంకోసమే యుద్ధానికి దిగుతారు. ఇదే మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం.

అప్పుడప్పుడే చమురు వాడకం మొదలైంది. చమురు నిక్షేపాలున్న దేశాల మీద కన్నేసిన బ్రిటన్ ప్రపంచ యుద్ధానికి ఆజ్యం పోసింది. సామ్రాజ్య విస్తరణకు ప్రధానమైంది సైనికీకరణ.

మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యేనాటికి జర్మనీ అపారమైన సైనిక శక్తి సమకూర్చుకుంది. జర్మనీ, బ్రిటన్ దేశాల నౌకా దళాలు బలపడ్డాయి. జర్మనీ, జార్ చక్రవర్తుల పరిపాలనలోని రష్యాలో సైన్యాలు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసేవి. ఇదే యుద్ధానికి దారి తీసింది. జాతీయవాదం మరో ప్రబల కారణం.

బోస్నియా, హెర్జెగొవినాలోని స్లావిక్ ప్రజలు ఆస్ట్రియా-హంగరీ ఆధిపత్యంలో నలిగిపోకూడదని, తాము సెర్బియాతో కలిసి ఉండాలని అనుకున్నాయి. యూరప్ లోని అన్ని దేశాలు తమ జాతీయత గొప్పతనాన్ని పరిరక్షించుకునే క్రమంలో యుద్ధానికి చేరువయ్యాయి.

మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో యూరప్ లోని సామ్రాజ్యవాద దేశాలు ఇతర దేశాల మీద ఆధిపత్యం కోసం ఆ దేశాలను కేక్ కోసినట్టు కోశాయి అని లెనిన్ అన్నారు. ఉత్తర ఆఫ్రికా రాజకీయ చిత్రపటాన్ని ఇప్పుడు చూసినా సరిహద్దులు సరళ రేఖలో ఉండడం గమనిస్తే లెనిన్ వ్యాఖ్యలోని వాస్తవం బయట పడుతుంది. ఈ యుద్ధం జాతీయ స్వయం నిర్ణయాధికారానికి సంబంధించిందో, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికో, యుద్ధాలకు అంతం పలకడానికో, ఫెర్డినాండ్ ఫ్రాంజ్ హత్య కారణంగానో జరిగింది కాదు. ఇది సామ్రాజ్యవాదులు సంపదను కొల్లగొట్టడానికి ఉద్దేశించింది.

దోచుకునే సొత్తును పంచుకోవడంలో సామ్రాజ్యవాదుల మధ్య గొడవలే యుద్ధానికి దారి తీశాయి. బలం సంతరించుకున్న జర్మనీ ఈ దోపిడీలో అధిక వాటా కోసం ప్రయత్నించడమే అసలు కారణం. తన ఆధిపత్యాన్ని విడనాడడానికి బ్రిటన్ సిద్ధపడలేదు. పీకల దాకా ఆయుధ సంపత్తి పెంచుకున్న దేశాలు దోపిడీ సొత్తు కాజేయడానికే యుద్ధానికి దిగి మొత్తం ప్రపంచాన్ని అగ్ని కీలల్లోకి తోశాయి. ఇది దేశాలను పంచుకోవడానికి, వలసలు ఏర్పాటు చేసుకోవడానికి దారి తీసింది.

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ వలసవాదం విస్తరించడమే దీనికి నిదర్శనం. సిరియా మీద ఆధిపత్యం కోసం ఫ్రాన్స్ పాకులాడితే, మెసపుటోమియా మీద పెత్తనానికి బ్రిటన్ వెంపర్లాడితే రష్యాలోని జార్ ప్రభుత్వం కాన్స్టాంటినోపుల్ కోసం ప్రయత్నించింది.

మొదటి ప్రపంచ యుద్ధ దుష్పరిణామాలు ఎంత భయంకరమైనవి అయినా, ఆ తర్వాత కుదిరిన శాంతి ఒప్పందాలు ఎంత మహత్తరమైనవి అయినా అణగారిన వర్గాల వారు, మోసానికి గురైన వారు కళ్లు తెరవడానికి ఉపకరించిందన్నదీ వాస్తవమే. ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న క్రమంలోనే జార్ చక్రవర్తుల దుష్పరిపాలనకు మంగళం పాడి రష్యా సోవియట్ యూనియన్ గా అవతరించింది. మొట్ట మొదటి సారి అక్కడ శ్రామికవర్గ పాలన సాధ్యమైంది.

సామాజిక, రాజకీయ, సైనిక శక్తిని సమకూర్చుకున్న సామ్రాజ్యవాద శక్తులు తమలో తాము ఘర్షణ పడడంవల్లే అక్టోబర్ విప్లవ విజయానికి మార్గం సుగమం చేసింది. యుద్ధంలో రష్యా సైన్యం నిర్వీర్యం అయింది. అందుకే అక్టోబర్ విప్లవ ప్రభావం వల్ల మొట్ట మొదట యుద్ధం విరమించింది రాష్యానే. “రక్తంతో తడిసి ముద్ద అయిన మేం ఇక పోరాడలేం” అని రష్యా సైనికులు మొరపెట్టుకున్నారు. యుద్ధంలో దెబ్బ తిన్నవారికి గాయాల బాధ సహించే లక్షణం అబ్బుతుంది. ఇంతకన్నా పోయేదేమీ లేదనకున్న రష్యా సైన్యం విప్లవ క్రమంలో భాగం కావడానికి కారణం ఇదే.

మహా ప్రళయం

ఈ యుద్ధంలో ఏడు కోట్ల మంది పాల్గొన్నారు. అందులో ఆరు కోట్ల మంది యూరప్ సైనికులే. 90 లక్షల మంది సైనికులు, 70 లక్షల మంది పౌరులు బలయ్యారు. యుద్ధం ముగిసిన తర్వాత కూడా అనేక చోట్ల మారణ కాండ కొనసాగింది. దీనికి తోడు అంటువ్యాధులు ప్రబలాయి. ఈ రెండు కారణాలవల్ల ప్రపంచ వ్యాప్తంగా అయిదు నుంచి పది కోట్ల మంది మరణించారు.

బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా మిత్ర రాజ్యాలుగా; జర్మనీ, ఆస్ట్రియా-హంగరీ, ఇటలీ అక్ష రాజ్యాలుగా ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. ఇటలీ కొద్దిగా ఆలస్యంగా యుద్ధంలోకి దిగింది. అమెరికాకు చెందిన ఏడు వాణిజ్య నౌకలను జర్మనీ జలాంతర్గాములు ముంచేసే దాకా అమెరికా యుద్ధంలో భాగస్వామి కాలేదు. రెండో ప్రపంచ యుద్ధంలో కూడా పర్ల్ హార్బర్ మీద జపాన్ బాంబులు వేసే దాకా అమెరికా యుద్ధానికి దూరంగానే ఉంది. ప్రపంచంలోని ఏ జగడానికీ దూరంగా లేకపోయినా ఇంతవరకు తన గడ్డ మీద అమెరికా యుద్ధం చేసిన సందర్భమే లేదు.

మొదటి ప్రపంచ యుద్ధంవల్ల రష్యా, జర్మనీ, ఆస్ట్రియా-హంగరీ సామ్రాజ్యాలు, ఒట్టొమాన్ సామ్రాజ్యాలు పతనంతో ఈ అన్ని చోట్లా కొత్త రాజ్యవ్యవస్థలు ఏర్పడ్డాయి. రష్యా కొత్త దివిటీగా వెలిగితే మిగతా చోట్ల జాతియతావాద ప్రాతిపదికన రాజ్యాలు అవతరించాయి. యుద్ధం పర్యవసానంగా బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ పారిస్ లో 1919లో సమావేశమై శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయి. భవిష్యత్తులో యుద్ధ నివారణకు నానా జమితి సమితి ఏర్పాటు చేశాయి. కానీ నానా జాతి సమితి ఈ లక్ష్యాన్ని నెరవేర్చలేకపోయింది.

రెండు దశాబ్దాల తర్వాత రెండో ప్రపంచ యుద్ధం అనివార్యం అయింది. నానా జాతి సమితి స్థానంలో ఐక్య రాజ్య సమితి అవతరించింది. ఇదీ వివిధ దేశాల మధ్య యుద్ధాలను, అమెరికా సామ్రాజ్యవాదాన్ని నిలవరించలేకపోయింది.

కందక యుద్ధాలు

మొదటి ప్రపంచ యుద్ధం రణ తంత్రాలను సమూలంగా మార్చేసింది. అంతకు ముందు బాహాబాహీ పోరాటాలే ప్రధానం. కొత్త సాంకేతికత ఈ యుద్ధంలో ప్రధానపాత్ర నిర్వహించింది. అంతకు ముందు శత్రు సేనల పురోగమనాన్ని నిలవరించడానికి ముళ్లకంచెలు ఉండేవి. కాని ఈ యుద్ధంలో మర తుపాకులు వాడకంలోకి వచ్చాయి. శతఘ్నులు, రసాయనిక ఆయుధాలు వాడారు. పదాతి దళాలు కందకాలు తవ్వుకుంటూ ముందుకెళ్లేవి.

అయితే ఒక్కో మీటర్ భూభాగాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో వందలాది మంది సైనికులు కందకాల్లో శాశ్వతంగా మగ్గిపోవలసి వచ్చింది. ఈ కందకాల్లో ఉన్న సైనికులు శత్రువుల దాడివల్లే కాకుండా అనారోగ్య పీడితులై, ఇన్ ఫ్లు యెంజా లాంటి అంటువ్యాధుల బారిన పడి మరణించడమూ ఎక్కువే.

యుద్ధం మొదలైనప్పుడు జర్మన్ సామ్రాజ్య యుద్ధ నౌకలు ప్రపంచ వ్యాప్త సముద్ర జలాల్లో ఉండేవి. వీటి ద్వారా జర్మనీ మిత్ర రాజ్యాల వాణిజ్య నౌకలను ముంచేసేది. బ్రిటన్ నౌకా దళం జర్మనీ నౌకా దళాలను వెంటాడింది. యుద్ధం మొదలైన తర్వాత శక్తిమంతమైన బ్రిటన్ నౌకా దళం జర్మనీ నౌకా దళాలను దిగ్బంధం చేసింది. అయితే బ్రిటన్ బాహాటంగా యుద్ధ నియమాలను ఉల్లంఘించింది.

1916లో జుట్ లాండ్ యుద్ధ రంగంలో జర్మనీ, బ్రిటన్ నౌకా దళాలకు మధ్య జరిగిన యుద్ధం చరిత్రలోకెల్లా పెద్దది. ఇందులో బ్రిటన్ విజయం సాధించినా జర్మనీ నష్టాన్ని తగ్గించుకోగలిగింది. జర్మనీ ’యు’ పడవలు ఉత్తర అమెరికా నుంచి బ్రిటన్ కు సామాగ్రి సరఫరాను అడ్డుకోవడానికి ఉపకరించాయి. వాణిజ్య నౌకల మీద, ప్రయాణికుల నౌకల మీదా విచ్చలవిడి దాడులు జరగడంతో నిరసన వెల్లువెత్తింది. ఆ తర్వాత జర్మనీ మామూలు నౌకల మీద దాడి చేయబోమని హామీ ఇచ్చింది.

అమెరికా సైతం యుద్ధంలో దిగుతుందని భావించిన జర్మనీ యుద్ధ నీతిని విస్మరించింది. మొదటి ప్రపంచ యుద్ధంలోనే యుద్ధ విమానాలున్న నౌకలను వినియోగించారు. ఈ యుద్ధంలో రసాయనిక ఆయుధాలవల్ల 13 లక్షల మంది మరణించినట్టు అంచనా. బ్రిటన్ లో 1,80,000 మంది, అమెరికా మృతుల్లో మూడోవంతు మంది రసాయనిక ఆయుధాలవల్లే ప్రాణాలు కోల్పోయారు.

కాస్పియన్ సముద్ర తీరంలోని బకు చుట్టుపక్కల ఉన్న పెట్రోలియం నిలవలు బ్రిటన్ కు, రష్యాకు అందుబాటులో లేకుండా చేయడానికి ఒట్టమాన్ సామ్రాజ్యం 1914లో జర్మనీ సహాయంతో పర్షియా (ప్రస్తుత ఇరాన్) మీద దాడి చేసింది. పర్షియా నిజానికి తటస్థ దేశమైనా బ్రిటన్, రష్యాకు అనుకూలంగా వ్యవహరించేది. కుర్దులు, అజేరీ దళాలు, ఇరాన్ గిరిజనులు ఒట్టొమాన్ సామ్రాజ్యానికి, జర్మనీకి అండగా నిలిస్తే అర్మీనియా, అసీరియా దళాలు మిత్రపక్షాలకు సహాయపడ్డాయి.

1917లో రష్యా యుద్ధం నుంచి విరమించడంతో ఆర్మీనియా, అసీరియా కూడా రణరంగం నుంచి వైదొలగాయి. మరో వేపున అమెరికాకు వ్యతిరేకంగా మెక్సికోను యుద్ధంలో భాగస్వామిని చేయడానికి జర్మనీ ప్రయత్నించింది. టెక్సాస్, అరిజోనాను అమెరికా నుంచి విడిపించుకోవడానికి మెక్సికోకు అండగా నిలిచింది. కడకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఊడ్రో విల్సన్ అమెరికా కూడా యుద్ధంలో భాగస్వామి అవుతున్నట్టు ప్రకటించారు.

నిజానికి అమెరికా అధికారికంగా మిత్ర రాజ్యాల పక్షాన లేకపోయినా అనుబంధ రాజ్యంగా వ్యవహరించింది. అప్పటికి అమెరికా సైన్యం చిన్నది కాని 28 లక్షల మందిని సైన్యంలో చేర్చుకుని 1918 నాటికి రోజుకు 10 వేలమంది సైనికులను ఫ్రాన్స్ కు పంపే స్థాయికి చేరుకుంది. బ్రిటన్ కు మద్దతుగా తన యుద్ధ నౌకలను కూడా పంపింది. 1918లో ఆర్మీనియా, అజర్బైజాన్, జార్జియా కూడా యుద్ధంలోకి దిగాయి.

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి జర్మనీ, ఆస్ట్రియా-హంగరీ, ఒట్టొమాన్, రష్యా సామ్రాజ్యాలు పతనమైనాయి. ఒట్టొమాన్ సామ్రాజ్యం కుంచించుకుపోయి టర్కీ అవతరించింది. ఈ సామ్రాజ్య పతనంతోటే ఇస్లాంలో తీవ్రవాద ధోరణులు ప్రబలి పోయాయి. మరో వేపున 123 సంవత్సరాల తర్వాత పోలెండ్ స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. సెర్బియా, క్రొవేషియా, సొల్వేనియా కలిసి యుగొస్లావియాగా అవతరించింది. బొహిమియా రాజ్యంలోని కొంత భాగం, హంగరీలోని కొంత భాగం కలిసి జెకొస్లవేకియా ఏర్పడింది. రష్యా సోవియట్ యూనియన్ అయింది. అయితే ఈ యుద్ధం పర్యవసానంగా రష్యా ఫిన్లాండ్, ఎస్తోనియా, లిథువేనియా, లాట్వియా ప్రాంతాలను కోల్పోవలసి వచ్చింది. ఇవన్నీ స్వతంత్ర దేశాలైనాయి.

యుద్ధంలో వలస దేశాలు

1914లో బ్రిటన్ యుద్ధం ప్రకటించగానే బ్రిటన్ ఆధీనంలోని వలస రాజ్యాలను కూడా బలవంతంగా యుద్ధంలోకి దింపింది. అందుకే వర్సెల్స్ ఉప్పందంపై కెనడా, న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా కూడా సంతకాలు చేశాయి. ఇజ్రాయిల్ అవతరణకు, ఇజ్రాయిల్ కు పలస్తీనియన్లకు మధ్య ఘర్షణలకు, పశ్చిమాసియాలో జగడాలకు కూడా మొదటి ప్రపంచ యుద్ధమే బీజాలు వేసింది.

రోగ పీడుతులు

ఈ యుద్ధం సైనికుల ఆరోగ్యాన్ని విపరీతంగా దెబ్బ తీసింది. యూరప్ కు చెందిన ఆరు కోట్ల మంది సైనికుల్లో 80 లక్షల మంది మరణించారు. 70 లక్షల మంది శాశ్వతంగా వికలాంగులయ్యారు. కోటీ 50 లక్షల మంది గాయపడ్డారు. జర్మనీలోని 15.1 శాతం, ఆస్ట్రియా-హంగరీలోని 17.1 శాతం, ఫ్రాన్స్ లోని 10.5 శాతం జనాభా ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.

జర్మనీలో ఆహార ధాన్యాల కొరత, పోషకాహార లోపంవల్ల లక్షలాది మంది మరణించారు. యుద్ధం ముగిసే నాటికి ఒక్క లెబనాన్ లోనే లక్షమంది కరవుకు బలయ్యారు. రష్యా కరవు 50 లక్షల నుంచి కోటి మందిని కబళించింది. రష్యాలో 45 లక్షల మంది నిర్వాసితులయ్యారు. యుద్ధ సమయంలో రోగాలు ప్రబలిపోయాయి. 1914లో ఒక్క సెర్బియాలోనే టైఫాయిడ్ సోకి రెండు లక్షల మంది మరణించారు.

1918-1922 మధ్య రష్యాలో రెండున్నర కోట్ల మంది టైఫాయిడ్ బారిన పడి 30 లక్షల మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇన్ ఫ్లు యెంజా ప్రబలింది. 1918లో ఈ వ్యాధి సోకి కనీసం అయిదుకోట్ల మంది మరణించారు.

మొదటి ప్రపంచ యుద్ధంలో విపరిణామాలున్నట్టే సత్ఫలితాలూ ఉన్నాయి. యూరప్ లో రాచరికాలు అంతరించి ప్రజాస్వామ్యం పాదుకోవడానికి అవకాశం కలిగింది. అయితే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందన్న నమ్మకం ఇప్పటికీ లేదు.

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ, జర్మనీల్లో ఫాసిజం ప్రజాస్వామ్యాన్ని సవాలు చేసింది. ఫాసిజాన్ని ఓడించగలిగినా ఆ పోకడలు ఇంకా పొడసూపుతూనే ఉన్నాయి. సైనికపాలన బెడదలు అడపాదడపా కొన్ని దేశాల్లో ఎదురవుతూనే ఉన్నాయి. కార్మికోద్యమాలు పెరగడం ఈ యుద్ధ పర్యవసానమే.

సోషలిస్టు పార్టీల ప్రాధాన్యత పెరిగింది. పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించే దేశాలూ ప్రజాస్వామ్యానికి దోహదం చేస్తూ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతున్నాయి. నానా జాతి సమితి అధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్.ఒ.) అవతరించింది. ఇంకో వేపున జపాన్ బలపడి యూరప్ కు, అమెరికాకు సవాలు విసిరే స్థాయికి చేరుకుంది.

భారత్ పాత్ర

యుద్ధం మొదలయ్యే నాటికి భారత్ లో ఉన్న జాతీయభావాలను, ఇస్లాం మతస్తులను తనకు అనుకూలంగా మలచుకోవడానికి జర్మనీ విఫల యత్నం చేసింది. అఫ్గానిస్తాన్ ను రణరంగంలోకి ఈడ్వాలనుకుంది. విచిత్రం ఏమిటంటే జర్మనీ ప్రయత్నాలవల్ల భారత్ లో తిరుగుబాటు వస్తుందన్న బ్రిటన్ భయం నిరాధారమని తేలిపోయింది. కాంగ్రెస్, ఇతర రాజకీయ వర్గాలు యుద్ధంలో బ్రిటన్ ను సమర్థించాయి.

ఈ యుద్ధం వల్ల స్వయంపాలన సాధ్యం అవుతుందనుకోవడంవల్లే భారతీయులు సమర్థించారు. వాస్తవానికి యుద్ధం మొదలైనప్పుడు భారత్ లో ఉన్న బ్రిటిష్ సైన్యంకన్నా భారత సైన్యమే ఎక్కువ. 13 లక్షల మంది భారతీయులు యూరప్, ఆఫ్రికా, పశ్చిమాస్సియా యుద్ధ రంగాల్లో పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు సంస్థానాల అధిపతులు కూడా ఈ యుద్ధం కోసం ఆహార పదార్థాలు, డబ్బు, ఆయుధాలు సమకూర్చారు. 47, 746 మంది భారతీయ సైనికులు అమరులైతే 65, 126 మంది క్షతగాత్రులయ్యారు. కానీ భారత జవాన్ల త్యాగాన్ని విస్మరించారు.

భారతీయులను సంప్రదించకుండానే బ్రిటన్ భారత్ ను యుద్ధంలో భాగస్వామిని చేసింది. యుద్ధం ముగిసిన తర్వాత స్వయం పరిపాలన దక్కుతుందన్న ఆశలను వమ్ము చేసింది. ఈ నిరాశే పూర్ణ స్వరాజ్య కాంక్షకు ఊపిరిపోసింది. భారత సైన్యం మద్దతే లేకపోతే బ్రిటన్ రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ విజయం సాధించడం సాధ్యమయ్యేది కాదని 1942 లో భారత సైన్యాధిపతిగా ఉన్న ఫీల్డ్ మార్షల్ సర్ క్లాడ్ ఔచిన్లెక్ అన్నారు.

-అర్వీ రామారావ్

First Published:  11 Nov 2018 4:18 AM GMT
Next Story