తల్లిని, చెల్లిని మాట్లాడుతున్నారు…. నా కడుపు కొట్టవద్దు….

తన భర్త వైఎస్సార్ మరణం నుంచే తాము ఇంకా కోలుకోలేదని… దయచేసి తన కడుపు కూడా కొట్టే ప్రయత్నం చేయవద్దు అని వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. జగన్ పై దాడి నేపథ్యంలో విజయమ్మ మీడియా ముందుకు వచ్చారు. జగన్ పై దాడిని చిన్న ఘటనగా చూపేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఓ తల్లిపైనా, చెల్లి పైనా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని…. అన్నీ భరిస్తూ, సహిస్తూ వస్తున్నామని చెప్పారు. నియంత కాంగ్రెస్, వికృత టీడీపీ కలిసి తమపై బురద జల్లుతున్నారు అని ఆమె మండిపడ్డారు.

జనంలో జగన్ ను ఏమీ చేయలేమని తెలిసి ఎయిర్ పోర్టులో దాడి చేశారని ఆరోపించారు. మీడియా ప్రజలకు నిజాలు చూపాలని కోరారు. జగన్ ను కాపాడు కోవాల్సిందిగా ప్రజలను కోరారు.

వైఎస్‌ జగన్‌కు ఇది పునర్జన్మ. గొంతులో దిగాల్సిన కత్తి అదృష్టవశాత్తు భుజానికి తగిలింది. ప్రజల ప్రేమ, దీవెనెలతోనే ఈ ప్రమాదం నుంచి జగన్‌ తప్పించుకున్నారు. వైఎస్సార్‌సీపీ తొలి ప్లీనరిలోనే నా కొడుకును మీకు అప్పజెప్పుతున్నానని ప్రకటించా. అప్పటి నుంచి ఆయన ప్రజల మధ్యనే ఉన్నాడు. ఓదార్పు యాత్రలో మీరే ఆయనను ఓదార్చారు.

ప్రజా సమస్యలతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రత్యేకహోదా విషయంలో అనేక ఉద్యమాలు చేశారు. ఇడుపుల పాయ నుంచి మొదలైన పాదయాత్ర 11 జిల్లాల మీదుగా సుమారు 3,200 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. ఇది ప్రజాఆశీర్వాదం వల్లే సాధ్యమైంది అని వైఎస్ విజయమ్మ అన్నారు.

మౌనంగా సహిస్తున్నాం…. భరిస్తున్నాం….

ప్రతిపక్షనేతపై దాడి జరుగుతుందని ఒక పెద్దమనిషి అన్నారు. అప్పుడు నేనేం చేయలేదు. దేవుడిని మాత్రమే ప్రార్ధించాను. గోదావరి జిల్లాలో అంతం చేయాలని రెక్కీ జరిగిందని అక్కడ కుదరకపోవడంతో ఎయిర్‌పోర్ట్‌లో ఆ పని చేశారు. అక్కడైతే ఎవరూ అడ్డుకోరని ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నట్లు నేను అనుకుంటున్నా. తల్లి, భార్య, చెల్లెలిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. మౌనంగా సహిస్తున్నాం… భరిస్తున్నాం… అని విజయమ్మ అన్నారు.

రాజశేఖర్‌ రెడ్డి ఏ పార్టీకి అయితే 30 ఏళ్లు సేవ చేశాడో ఆపార్టీ ఆ మహానేతను దోషిని చేసింది. ఇప్పటికీ వేధిస్తుంది. ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని వైఎస్‌ జగన్‌పై అన్నిదాడులు చేయించి 16 నెలలు జైలులో పెట్టారు. దేశంలో ఏ నాయకుడు నాకు తెలిసి ఇన్ని వేధింపులు ఎదుర్కోలేదు…. అయినా జగన్‌ దేనికి చలించలేదు, అదరలేదని విజయమ్మ చెప్పారు.

అన్ని సమస్యలను పక్కన పెట్టి ప్రజల మధ్య ఉండి పోరాడుతున్నారు. జగన్‌పై హత్యాయత్నం జరిగి 17 రోజులవుతుంది. అయినా ఈ కేసులో పురోగతి లేకపోగా ఎక్కడేసిన గొంగళిలా అక్కడే ఉంది. గాయం ఎంత లోతు ఉందని, డీజీపీ, సీఎం, మంత్రులు మాట్లాడుతున్నారు…. విచారణ జరపకుండా రోజుకో మాటతో పబ్బం గడుపుతున్నారని విజయమ్మ మండిపడ్డారు.