వారం తర్వాత నన్ను తీసేస్తారనుకున్నాను

టాక్సీవాలా ప్రమోషన్లు ఊపందుకున్నాయి. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ తో ఈ సినిమాకు ఓ ఊపొచ్చింది. మరీ ముఖ్యంగా ఆ వేడుకకు బన్నీ రావడం సినిమాకు ప్లస్ అయింది. ఇక అదే ఊపులో ప్రమోషన్లు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ మీడియాతో మాట్లాడింది. తనకు ఇదే తొలి సినిమా. అయినప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా మాట్లాడ్డమే కాకుండా, యూనిట్ పై తనపై జోకులు కూడా వేసుకుంది.

“ఒక రకంగా చెప్పాలంటే దర్శకుడు రాహుల్ ను నేను హింసించాను. నా బాధ భరించలేక నన్ను వారం రోజులకే సినిమా నుంచి తీసేస్తారనుకున్నాను. అంతలా వాళ్లను ఇబ్బంది పెట్టాను. నన్ను వారం రోజుల తర్వాత తీసేస్తారని మెంటల్లీ ఫిక్స్ అయిపోయి, టాక్సీవాలాలో సెలక్ట్ అయిన విషయాన్ని కూడా ఇంట్లో చెప్పలేదు.”

ఇలా తన తొలి సినిమా అనుభవాల్ని మీడియాతో పంచుకుంది ప్రియాంక. తీరా సినిమా ఓకే అయి, ఇంట్లో అందరికీ చెప్పిన తర్వాత ఏడాదిన్నర గ్యాప్ రావడంతో చాలా భయపడ్డానని చెప్పుకొచ్చింది. అసలు సినిమా విడుదలవుతుందా అవ్వదా అనే తెగ టెన్షన్ పడ్డానని, పైగా టాక్సీవాలా రిలీజ్ అయ్యేంతవరకు మరో మూవీ ఒప్పుకోకూడదని తనకుతాను నియమం పెట్టుకోవడం తన కెరీర్ కు మరింత ఇబ్బందిగా మారిందంటోంది ఈ బ్యూటీ.