Telugu Global
NEWS

కోడెల ఇంట్లో బాంబుల కేసే నిదర్శనం " అంబటి

నిష్ఫక్షపాతమైన విచారణ జరిగితే తాను బయటపడలేనన్న భయం చంద్రబాబులో ఏర్పడిందని అందుకే సీబీఐపై ఏపీలో నిషేధం విధించారని వైసీపీ నేత అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. ఏపీలోని అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న చంద్రబాబు… బయటి నుంచి ఇతర వ్యవస్థ ద్వారా నిజాలు బయటకు రాకుండా ఉండేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు మిత్రుడు రాహుల్‌ గాంధీ రాఫెల్ కుంభకోణంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుంటే… చంద్రబాబు మాత్రం ఏకంగా సీబీఐనే నిషేధించడం ఏమిటని ప్రశ్నించారు. కేవలం […]

కోడెల ఇంట్లో బాంబుల కేసే నిదర్శనం  అంబటి
X

నిష్ఫక్షపాతమైన విచారణ జరిగితే తాను బయటపడలేనన్న భయం చంద్రబాబులో ఏర్పడిందని అందుకే సీబీఐపై ఏపీలో నిషేధం విధించారని వైసీపీ నేత అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. ఏపీలోని అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న చంద్రబాబు… బయటి నుంచి ఇతర వ్యవస్థ ద్వారా నిజాలు బయటకు రాకుండా ఉండేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు.

చంద్రబాబు మిత్రుడు రాహుల్‌ గాంధీ రాఫెల్ కుంభకోణంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుంటే… చంద్రబాబు మాత్రం ఏకంగా సీబీఐనే నిషేధించడం ఏమిటని ప్రశ్నించారు. కేవలం జగన్‌ మీద జరిగిన హత్యాయత్నం కేసులో సీబీఐ విచారణ జరిగితే నిజాలు బయటకు వస్తాయనే చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఆపరేషన్ గరుడ పురాణం చెప్పిన శివాజీని తీసుకొచ్చి ఎందుకు విచారించడం లేదని ప్రవ్నించారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చి లింగమనేని ఎస్టేట్‌లో దాక్కున్న పిరికి వ్యక్తి చంద్రబాబు అన్నారు. పైకి మాత్రం ధైర్యవంతుడిగా చెప్పుకుని తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు తాను చేసిన నేరాల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వాన్ని వలయంగా పెట్టుకుంటున్నారని అంబటి ఫైర్ అయ్యారు. సీబీఐలో లుకలుకలు ఉండవచ్చని.. కానీ దాన్ని సాకుగా చూపి ఏకంగా రాష్ట్రంలోకి అడుగు పెట్టకూడదనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఇటీవల సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల మధ్య విభేదాలు వస్తే న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చారని.. అలా అని సుప్రీం కోర్టు తమపై విచారణ జరపకూడదని చెప్పగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేసే సామర్థ్యం మాత్రమే ఉన్న ఒక పిరికి పంద అని అంబటి వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుంటున్నారా లేక తానో రాజునని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

భారత రాజకీయాల్లో ఏపీలో ఉన్నంతగా ఎన్నికల ఖర్చు ఏ రాష్ట్రంలోనూ లేదని… ఈ పరిస్థితికి చంద్రబాబే కారణమన్నారు. ప్రజల డబ్బు వేల కోట్ల దోచుకుని ఓటుకు వేల రూపాయలు ఇచ్చి గెలవచ్చు అనుకునే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.

గతంలో కోడెల శివప్రసాదరావు ఇంట్లో బాంబులు పేలితే దానిపై కాసు కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించగా సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. కానీ ఎక్స్‌పోజివ్ యాక్ట్‌ ప్రకారం విచారణకు కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమైందన్నారు.

అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా అనుమతి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందన్నారు. ఆ సమయంలో కేంద్రంలో తాను సమర్ధిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఉండడంతో… చంద్రబాబు, వెంకయ్యనాయుడు, కోడెల శివప్రసాదరావులు వెళ్లి బీజేపీ నేతల కాళ్ళు పట్టుకుని సీబీఐ విచారణ ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు.

వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు అంతటి నీచాతినీచుడు ఎవరూ ఉండదరన్న దానికి కోడెల ఇంట్లో బాంబు పేలుళ్ల కేసును నీరుగార్చిన వ్యవహారమే నిదర్శనమన్నారు.

First Published:  16 Nov 2018 4:09 AM GMT
Next Story