Telugu Global
Cinema & Entertainment

"టాక్సీవాలా" సినిమా రివ్యూ

రివ్యూ: టాక్సీవాలా రేటింగ్‌: 2.5/5 తారాగణం: విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవిక నాయర్, ఉత్తేజ్‌ , రవి వర్మ, మధునందన్, సిజ్జు తదితరులు సంగీతం: జాక్స్‌ బెజోయ్‌ నిర్మాత: యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ దర్శకత్వం: రాహుల్ సంక్రిత్యాన్  టాలీవుడ్ లో తక్కువ టైంలో క్రేజ్ సంపాదించుకుని యూత్ లో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన టాక్సీవాలా చాలా పురిటి నొప్పులు పడుతూ థియేటర్లలో ఇవాళ అడుగు పెట్టింది. లీకేజ్ సమస్యతో పాటు చాలాసార్లు విడుదల వాయిదా పడటం నిర్మాతలను సైతం బాగా […]

టాక్సీవాలా సినిమా రివ్యూ
X

రివ్యూ: టాక్సీవాలా
రేటింగ్‌: 2.5/5
తారాగణం: విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవిక నాయర్, ఉత్తేజ్‌ , రవి వర్మ, మధునందన్, సిజ్జు తదితరులు
సంగీతం: జాక్స్‌ బెజోయ్‌
నిర్మాత: యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్
దర్శకత్వం: రాహుల్ సంక్రిత్యాన్

టాలీవుడ్ లో తక్కువ టైంలో క్రేజ్ సంపాదించుకుని యూత్ లో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన టాక్సీవాలా చాలా పురిటి నొప్పులు పడుతూ థియేటర్లలో ఇవాళ అడుగు పెట్టింది. లీకేజ్ సమస్యతో పాటు చాలాసార్లు విడుదల వాయిదా పడటం నిర్మాతలను సైతం బాగా ఇబ్బంది పెట్టింది. అభిమానులు మాత్రం దీని మీద అంచనాలు బాగా పెట్టుకున్నారు.

ఐదేళ్లు డిగ్రీ చేసిన తర్వాత శివ (విజయ్ దేవరకొండ) ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి తన స్నేహితుడు బాబాయ్ (మధునందన్) షెడ్ లో ఆశ్రయం పొందుతాడు. జాబులు సెట్ కావడం లేదని సొంతంగా ఓ కారు కొనుక్కుని క్యాబ్ డ్రైవర్ గా మారతాడు. కానీ అందులో ఓ దెయ్యం తిష్ట వేసుకుని ఉంటుంది. శివ ఎదురుగానే ఓ హత్య కూడా చేస్తుంది.

దీని అంతు చూద్దామని డిసైడ్ అయిన శివకు కారు అమ్మిన ఓనరు (సిజ్జు) ఇంట్లో బంధింపబడిన ఓ సైకియాట్రిస్ట్ (రవి వర్మ) ద్వారా నిజం తెలుస్తుంది. అందులో ఉన్న దెయ్యం శిశిర (మాళవిక నాయర్)దని తెలుసుకుంటాడు. అసలు శివకి దీనికి కనెక్షన్ ఎలా కుదిరింది, దీని వెనుక ఉన్న విలన్ లు ఎవరు అనేదే టాక్సీవాలా స్టోరీ.

విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే తనకు అవకాశం ఇచ్చిన సీన్లన్నీ పండించుకుంటూ యాక్టింగ్ పరంగా తనను ఇష్టపడే వాళ్ళు పూర్తి సంతృప్తి పడేలా చేసాడు. కానీ ఇంతకు ముందు సినిమాల్లోలాగా ఇందులో ఎక్కువ స్పాన్ దొరకలేదు. హారర్ మూవీ కావడంతో ఇతర అంశాలు కూడా సమాన స్థాయిలో చోటు దక్కించుకుని హీరోని జస్ట్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మార్చాయి తప్ప విజయ్ ఇమేజ్ కు తగ్గ స్టఫ్ ఇందులో లేదు.

అప్పుడెప్పుడో ఒప్పుకున్న సినిమా కాబట్టి తప్పలేదేమో. హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్ లుక్స్ మాత్రమే బాగున్నాయి. యాక్టింగ్ లో బేసిక్ స్టేజి లోనే ఉంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే మాళవిక నాయర్ చాలా బెటర్ గా చేసింది. సీనియర్ నటి యమున ఉన్నది కొన్ని సీన్లే అయినా ఉనికిని చాటుకుంది. విలన్ గా సిజ్జు, ఉత్తేజ్ లు జస్ట్ ఓకే. రవివర్మ బాగున్నాడు. రవి ప్రకాష్, కళ్యాణిలవి మొక్కుబడి పాత్రలే. మధునందన్ అసిస్టెంట్ గా చేసిన కుర్రాడు సరదాగా నవ్వించాడు.

దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఎక్కడి నుంచి స్ఫూర్తి తీసుకున్నాడో కానీ చాలా బిగుతుగా నడపాల్సిన హారర్ రివెంజ్ థ్రిల్లర్ ని జస్ట్ పాస్ మార్కులు మాత్రమే తెచ్చుకునే యావరేజ్ అవుట్ ఫుట్ ఇచ్చాడు. కారులో దెయ్యం అనే థీమ్ తో ఇంతకు ముందు డోరా అనే సినిమా వచ్చింది. రెండింటికి చాలా పోలికలు ఉన్నాయి. అయితే ఫ్లాష్ బ్యాక్ లో వేరియేషన్ వల్ల ఇది వేరుగా నిలుస్తుంది. ఇందులో ఊపిరి సలపలేనంత సస్పెన్స్ ఏమీ ఉండదు. మన ఊహలకు అనుగుణంగానే సన్నివేశాలు సాగుతాయి.

అక్కడక్కడా ట్విస్ట్ లతో ఝలక్ ఇచ్చినప్పటికీ వన్ అఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ అనిపించుకోవడంలో టాక్సీవాలా పూర్తిగా సక్సెస్ కాలేదు. అలా అని ఇది బాగాలేదు అని కాదు. ఊరించినంత విషయం ఇందులో లేదనే. అయితే టేకింగ్ తో పాటు స్క్రీన్ ప్లే ని బాగా రాసుకున్న రాహుల్ గొప్ప మలుపులు ఏమి లేకపోయినా ఎంగేజ్ చేయడంలో అతని టాలెంట్ బయటపడింది. ఇదే టాక్సీవాలాకు అతి పెద్ద ప్లస్ పాయింట్. ప్రేమ కథను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన రాహుల్ సెకండ్ హాఫ్ లో పూర్తిగా పక్కన పెట్టేసాడు.

మొత్తానికి రాహుల్ లో దర్శకుడు డామినేట్ చేయబట్టి టాక్సీవాలా ఓ మాదిరిగా ఓకే అనిపిస్తుంది కానీ రైటర్ గా మాత్రం ఇంకా మెరుగుపడాలి. జెక్స్ బెజోయ్ బీజీఎమ్ బాగుంది. మూడ్ ని బాగా క్యారీ చేసాడు. సుజిత్ కెమెరాకు మంచి మార్కులు పడతాయి. శ్రీజిత్ ఎడిటింగ్ కూడా ప్రశంసకు అర్హత దక్కించుకుంది. ప్రొడక్షన్ మరీ రిచ్ గా ఏమి లేదు. రీజనబుల్ గా చుట్టేశారు.

ఫైనల్ గా చెప్పాలి అంటే టాక్సీవాలా విజయ్ దేవరకొండ సినిమాగా కంటే ఒక డీసెంట్ యావరేజ్ హారర్ థ్రిల్లర్ గా నిలుస్తుంది. ప్రత్యేకంగా ఈ క్యాటగిరీలో సినిమాలను విపరీతంగా ఇష్టపడేవాళ్ళను ఓ రెండు పాళ్ళు ఎక్కువ మెప్పించవచ్చు కూడా. కాని చాలా అసాధారణ రీతిలో ఇందులో హారర్ ని ఊహించుకుంటే మాత్రం నిరాశ తప్పదు.

సింపుల్ గా చెప్పాలి అంటే తనను, తల్లిని చంపిన ఓ దెయ్యం ఇద్దరు విలన్ల మీద ప్రతీకారం తీర్చుకునేందుకు స్వంత కారుని ఆవహించి పని పూర్తి చేసుకునే కథ. ఇది ముందే చెప్పేస్తారు కాబట్టి ఫ్లాట్ గా చూసుకుంటూ పోతే అంచనాలు ఎక్కువ లేకుండా చూసుకోవచ్చు. అలా కాదని ఏదో ఎక్కువ ఆశించి థ్రిల్ లో ఉక్కిరిబిక్కిరి చేస్తాడు అని టాక్సీ ఎక్కితే మాత్రం మిడిల్ డ్రాప్ తప్పదు.

టాక్సీవాలా – ఓ మాదిరిగా భయపెట్టే జర్నీ

First Published:  17 Nov 2018 7:02 AM GMT
Next Story