Telugu Global
NEWS

చంద్రబాబూ... నా తల్లి, నా చెల్లి పైనా నిందేశావ్‌... కానీ...

చంద్రబాబుకు సిగ్గుశరం లేవన్నారు వైఎస్‌ జగన్‌. రాజకీయంగా అడ్డు ఉన్నాడని ప్రతిపక్షనాయకుడిని కూడా చంపేందుకు దిగజారిన వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. ఏం తప్పు చేశానని… తనను మట్టుబెట్టేందుకు ప్రయత్నించారో చంద్రబాబు చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. తనపై ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం చంద్రబాబు కుట్రలో భాగంగా జరిగింది కాదా అని ప్రశ్నించారు. పాదయాత్ర ఏడాది పూర్తి అవుతున్న నెలలోనే తనను లేకుండా చేసేందుకు కుట్ర చేశారన్నారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఆపరేషన్ గరుడ అంటూ సినీ […]

చంద్రబాబూ... నా తల్లి, నా చెల్లి పైనా నిందేశావ్‌... కానీ...
X

చంద్రబాబుకు సిగ్గుశరం లేవన్నారు వైఎస్‌ జగన్‌. రాజకీయంగా అడ్డు ఉన్నాడని ప్రతిపక్షనాయకుడిని కూడా చంపేందుకు దిగజారిన వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. ఏం తప్పు చేశానని… తనను మట్టుబెట్టేందుకు ప్రయత్నించారో చంద్రబాబు చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు.

తనపై ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం చంద్రబాబు కుట్రలో భాగంగా జరిగింది కాదా అని ప్రశ్నించారు. పాదయాత్ర ఏడాది పూర్తి అవుతున్న నెలలోనే తనను లేకుండా చేసేందుకు కుట్ర చేశారన్నారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఆపరేషన్ గరుడ అంటూ సినీ నటుడిని తెరపైకి తెచ్చి… అతడిని ఒక టీవీ చానల్‌కు లింక్‌ చేశారన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను నటుడు మార్చి 2న మీడియా ముందు చెప్పారని జగన్‌ గుర్తు చేశారు.

కత్తి దాడిలో తాను చనిపోయి ఉంటే ఎయిర్‌పోర్టులో భద్రత రాష్ట్ర పరిధిలో ఉండదు కాబట్టి చంద్రబాబు మీదకు రాదన్న ఉద్దేశంతో ప్రణాళిక చేశారన్నారు. తాను ఎయిర్‌పోర్టులో చనిపోయి ఉంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసేందుకే ఎయిర్‌పోర్టును దాడికి చంద్రబాబు ఎంచుకున్నారన్నారు.

ఎయిర్‌పోర్టులోకి కత్తి వచ్చేలా చేసింది చంద్రబాబు మనిషి హర్షవర్ధన్‌ చౌదరి కాదా అని ప్రశ్నించారు. దాడి చేసిన వ్యక్తి ఇదే హర్షవర్థన్ చౌదరి క్యాంటీన్‌లో పనిచేయడం లేదా అని నిలదీశారు. దాడి జరిగిన గంటకే డీజీపీ మీడియా ముందుకొచ్చి చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదివి తప్పుడు ప్రకటన ఇచ్చారని జగన్ విమర్శించారు. అభిమాని అయితే జగన్‌ను ఎందుకు హత్య చేసేందుకు ప్రయత్నిస్తాడని ప్రశ్నించారు.

దాడి జరిగిన వెంటనే సీఐఎస్ఎఫ్‌ అధికారులు నిందితుడి వద్ద సోదా చేస్తే ఎలాంటి లేఖ దొరకలేదన్నారు. కానీ డీజీపీ మాత్రం 11 పేజీల లేఖ ఉందని చెప్పి… దాన్ని కూడా వెంటనే విడుదల చేయకుండా 10 గంటల తర్వాత విడుదల చేశారన్నారు. ఆ లేఖలోనూ ముగ్గురి చేతి రాతలు ఉన్నాయని… కనీసం ఆ లేఖకు మడతలు కూడా లేవన్నారు. ఇవన్నీ కుట్ర అని చెప్పడం లేదా అని ప్రశ్నించారు.

తన పాదయాత్ర విశాఖ జిల్లాలోకి ఎంటరవగానే ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు ఎందుకు ఆగిపోయాయని జగన్ ప్రశ్నించారు. హత్యకు కుట్ర పన్ని తిరిగి జగన్‌ తల్లి, చెల్లే కుట్ర చేశారని ప్రచారం చేసే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయాడని…. అసలు ఇతడు మనిషేనా అని జగన్ ప్రశ్నించారు.

దాడి జరిగిన వెంటనే తొందరపడి తాను ఎవరి మీదా నిందలు వేయలేదన్నారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి తాను నేరుగా ఆస్పత్రికి వెళ్తే చంద్రబాబు మాత్రం ప్రెస్‌మీట్‌ పెట్టి తాను ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్లానంటూ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేందుకు వెకిలి నవ్వులు నవ్వాడని జగన్ మండిపడ్డారు. ఒకవేళ చంద్రబాబుకు ఈ హత్యాయత్నంలో ప్రమేయం లేకుంటే ఎందుకు థర్డ్‌ పార్టీ విచారణకు ఒప్పుకోవడం లేదని జగన్‌ నిలదీశారు.

చంద్రబాబు లాంటి దుష్టశక్తులు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల కోసం తన పోరాటం ఆపే ప్రసక్తే లేదన్నారు. ప్రాణం ఉన్నంత వరకు ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తానన్నారు. డబ్బు సంపాదన కోసమే చంద్రబాబు సీఎం కూర్చీలో కూర్చున్నారని… కానీ తాను మాత్రం చనిపోయిన తర్వాత కూడా తన ఫోటో ప్రతి ఇంట్లో ఉండేలా ప్రజలకు పాలన అందించాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నానని జగన్‌ చెప్పారు.

First Published:  17 Nov 2018 8:34 AM GMT
Next Story