Telugu Global
National

 వయసు 33..... ప్రపంచ టైటిల్స్ 20

2018 ప్రపంచ బిలియర్డ్స్ విజేత పంకజ్ అద్వానీ 31 జాతీయ టైటిల్స్ తో తిరుగులేని పంకజ్ అద్వానీ ఇండోర్ గేమ్స్ కే మకుటాయమాననంగా నిలిచే బిలియర్డ్స్ అండ్ స్నూకర్ లో 33 ఏళ్ల పంకజ్ అద్వానీ ప్రపంచ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ప్రపంచ టైటిల్స్ సాధించడంలో తనను మించిన మొనగాడు మరొకరు లేరని చెప్పకనే చెబుతున్నాడు. 33 ఏళ్ల వయసులోనే 20వ ప్రపంచ టైటిల్ సాధించి తనకు తానే సాటిగా నిలిచాడు. గత 22 సంవత్సరాలుగా క్యూస్పోర్టే జీవితంగా […]

 వయసు 33..... ప్రపంచ టైటిల్స్ 20
X
  • 2018 ప్రపంచ బిలియర్డ్స్ విజేత పంకజ్ అద్వానీ
  • 31 జాతీయ టైటిల్స్ తో తిరుగులేని పంకజ్ అద్వానీ

ఇండోర్ గేమ్స్ కే మకుటాయమాననంగా నిలిచే బిలియర్డ్స్ అండ్ స్నూకర్ లో 33 ఏళ్ల పంకజ్ అద్వానీ ప్రపంచ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ప్రపంచ టైటిల్స్ సాధించడంలో తనను మించిన మొనగాడు మరొకరు లేరని చెప్పకనే చెబుతున్నాడు. 33 ఏళ్ల వయసులోనే 20వ ప్రపంచ టైటిల్ సాధించి తనకు తానే సాటిగా నిలిచాడు.

గత 22 సంవత్సరాలుగా క్యూస్పోర్టే

జీవితంగా చేసుకొన్న పంకజ్ అద్వానీ ఇటు బిలియర్డ్స్ లో మాత్రమే కాదు…అటు స్నూకర్ గేమ్ లోనూ ప్రపంచ విజేతగా చరిత్ర సృష్టించాడు.

జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం భారత్ లో ఎన్నో రకాల క్రీడలున్నా…దేని ప్రత్యేకత దానిదే. జాతీయక్రీడ హాకీతో పాటు….కుస్తీ, విలువిద్య, క్రికెట్ , బ్యాడ్మింటన్, షూటింగ్, బాక్సింగ్ లాంటి ఎన్నో రకాల క్రీడలు ఉన్నా…..దేశానికి అత్యధిక ప్రపంచ టైటిల్స్, బంగారు పతకాలు అందించిన ఏకైక క్రీడ క్యూ స్పోర్ట్ ( బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ) మాత్రమే.

విశ్వవిజేతలకు చిరునామా భారత్….

ఇన్ డోర్ గేమ్స్ కే రాయల్ గేమ్ గా పేరుపొందిన బిలియర్డ్స్ అండ్ స్నూకర్ కు ప్రపంచ ప్రధాన క్రీడల్లో ఒకటిగా గుర్తింపు ఉంది. ఇంగ్లండ్, భారత్, సింగపూర్, చైనా, మాల్టా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, కెనడా,మియన్మార్, థాయ్ లాండ్ లాంటి దేశాలలో విశేష ఆదరణ పొందుతున్న ఈ క్యూ స్పోర్ట్ లో అత్యధిక ప్రపంచ టైటిల్స్ గెలుచుకొన్న దేశం భారత్ మాత్రమే.

ప్రపంచ వ్యాప్తంగా 90 దేశాలలో 10 కోట్ల 20 లక్షల మంది పురుషులు, మహిళలు బిలియర్డ్స్ , స్నూకర్ క్రీడలు ఆడుతుంటే….45 కోట్లమంది అభిమానులున్నారు.

స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే మనదేశంలో బిలియర్డ్స్ అండ్ స్నూకర్ క్రీడ తన ఉనికిని చాటుకోడమే కాదు..అత్యధిక ప్రపంచ టైటిల్స్ ను, విశ్వవిజేతలను అందించిన క్రీడగా గుర్తింపు తెచ్చుకొంది.

1920లో భారత క్రీడారంగంలోకి దూసుకొచ్చిన ఈ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ క్రీడల్లో….విల్సన్ జోన్స్, మైకేల్ పెరెరా, గీత్ సేథీ లాంటి పలువురు దిగ్గజ ఆటగాళ్లను అందించింది.

అశోక్ శాండిల్యా, సుభాష్ అగర్వాల్ లాంటి ఛాంపియన్ క్రీడాకారులు వచ్చినా….బెంగళూరు సంచలనం పంకజ్ అద్వానీని మించిన మొనగాడు మరొకరు లేరని అతని విజయాలు, రికార్డులే చెబుతున్నాయి.

పదిసంవత్సరాల చిరుప్రాయంలోనే క్యూస్పోర్ట్ లో ప్రవేశించిన పంకజ్ అద్వానీ ..12 ఏళ్ల వయసు నుంచే జాతీయ టైటిల్స్ సాధించడం ఓ ఆలవాటుగా మార్చుకొన్నాడు.

ఇంట గెలిచిన పంకజ్…

పంకజ్ అద్వానీ…ఇప్పటి వరకూ జాతీయ సీనియర్, జూనియర్ స్థాయిల్లో 31 టైటిల్స్ సాధించాడు. జూనియర్ స్థాయిలో ఏడు బిలియర్డ్స్, నాలుగు స్నూకర్, సీనియర్ విభాగంలో 9 బిలియర్డ్స్, 11 స్నూకర్ ట్రోఫీలు అందుకొన్నాడు. భారత బిలియర్డ్స్ అండ్ స్నూకర్ చరిత్రలోనే అత్యధిక జాతీయ టైటిల్స్ సాధించిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

2003లో తొలి ప్రపంచ టైటిల్…

చిన్నవయసు నుంచే బిలియర్డ్స్ అండ్ స్నూకర్ క్రీడల్లో పాల్గొంటూ వచ్చిన పంకజ్ అద్వానీ…2003లో ప్రపంచ స్నూకర్ టైటిల్ సాధించడం ద్వారా తన జైత్రయాత్రకు శ్రీకారం చుట్టాడు. 2003 నుంచి 2018 మధ్య 14 సంవత్సరాల కాలంలో మొత్తం 18 ప్రపంచ టైటిల్స్ సాధించి తనకు తానే సాటిగా నిలిచాడు.

భారత క్రీడాచరిత్రలోనే అత్యధిక ప్రపంచ టైటిల్స్ సాధించిన ఏకైక క్రీడాకారుడిగా రికార్డుల్లో చోటు సంపాదించాడు. బిలియర్డ్స్ 150 పాయింట్ల ఫార్మాట్ తో పాటు..టైమ్ ఫార్మాట్ విభాగాలలోనూ పంకజ్ అద్వానీ తిరుగులేని మొనగాడుగా గుర్తింపు పొందాడు.

2005, 2008, 2014, 2016, 2017 2018 సంవత్సరాలలో పంకజ్ అద్వానీ 150 పాయింట్ల ఫార్మాట్లో ప్రపంచ ఛాంపియన్ గా నిలవడమే కాదు…టైమ్ ఫార్మాట్లోనూ2005, 2007, 2008, 2009, 2012, 2014, 2015 సంవత్సరాలలో విశ్వవిజేతగా నిలిచాడు.

స్నూకర్ విభాగంలో 2003, 2015 సంవత్సరాలలో విశ్వవిజేతగా నిలిచిన పంకజ్..ప్రపంచ సిక్స్ రెడ్ స్నూకర్ టైటిల్స్ ను 2014, 2015 సంవత్సరాలలో నెగ్గడమే కాదు..2014లో ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ టైటిల్ ను సైతం భారత్ కు అందించాడు.

అంతేకాదు….2006 దోహా ఆసియా క్రీడలు, 2010 గాంగ్జు ఆసియాక్రీడల్లో బంగారు పతకాలు సాధించాడు. 23 సంవత్సరాల తన క్రీడాజీవితంలో పంకజ్ అద్వానీ 55 బంగారు పతకాలు,31 జాతీయ టైటిల్స్, 20 ప్రపంచ టైటిల్స్ సాధించి….భారత క్రీడాచరిత్ర లోనే మరే క్రీడాకారుడూ సాధించని ఘనతను సొంతం చేసుకొన్నాడు.

అవార్డులే అవార్డులు!

క్రికెట్టే పిచ్చిగా భావించే మనదేశంలో బిలియర్డ్స్ అండ్ స్నూకర్ క్రీడల ద్వారా పంకజ్ అద్వానీ పలురకాల క్రీడా, పౌర పురస్కారాలు అందుకొన్నాడు. 2004లో అర్జున అవార్డు, 2005- 06 లో దేశఅత్యున్నత క్రీడాపురస్కారం

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2007 లో ఏకలవ్య పురస్కారం, 2009లో పద్మశ్రీ పురస్కారం…ఒకదాని వెనుక ఒకటిగా వచ్చి పంకజ్ అద్వానీని వరించాయి.

భారత క్యూ స్పోర్ట్ చరిత్రలో మాత్రమే కాదు…ప్రపంచ బిలియర్డ్స్, స్నూకర్ క్రీడల చరిత్రలోనూ…పంకజ్ అద్వానీ ఓ అసాధారణ క్రీడాకారుడిగా మిగిలిపోతాడు.

First Published:  18 Nov 2018 2:02 AM GMT
Next Story