విరాట్ కొహ్లీకి బీసీసీఐ పాలకమండలి సుద్దులు

  • హుందాగా ప్రపర్తించమంటూ హితవు
  • ఆస్ట్రేలియా టూర్ లో మర్యాదగా మెలగమంటూ సలహా

ఆస్ట్రేలియాలో 64 రోజుల భారతజట్టు పర్యటనకు ముందే….టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీని…. హుందాగా వ్యవహరించమంటూ బీసీసీఐ పాలకమండలి ఆదేశించింది.

గ్రౌండ్ లోపల దూకుడుగా ఉన్నా….గ్రౌండ్ వెలుపల మాత్రం మర్యాదగా, ఓపికగా, హుందాగా వ్యవహరించాలని బీసీసీఐ తరపున పాలకమండలి సభ్యుడు ఒకరు సలహా ఇచ్చారు.

నవంబర్ 21 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ తో టీమిండియా…తన రెండుమాసాల పర్యటన ప్రారంభించనుంది.

వివాదాల విరాట్ కొహ్లీ….

టీమిండియా కెప్టెన్ గా, ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ గా విరాట్ కొహ్లీ..ఫీల్డ్ లో మంచిపేరు సంపాదించినా…ఫీల్డ్ వెలుపల మాత్రం..దూకుడుగా వ్యవహరిస్తూ తరచూ విమర్శలు కొని తెచ్చుకొంటున్నాడు.

తన ఆటతీరులో ఏలాంటి ప్రత్యేకతా లేదంటూ ఇటీవలే ఓ అభిమాని….ట్విట్టర్ ద్వారా చెబితే…కొహ్లీ తీవ్రంగా స్పందించాడు. తన ఆట నచ్చకపోతే…వేరేదేశానికి పొమ్మంటూ మండిపడటం ద్వారా లేనిపోని ఇబ్బందులు కొనితెచ్చుకొన్నాడు.

మీడియాతో, తన విమర్శకులతో..కఠువుగా మాట్లాడటం…హుందాగా వ్యవహరించకపోడం విరాట్ కొహ్లీకి ఇదే మొదటిసారి కాదు. విదేశీ పర్యటనల సమయంలో…ప్రధానంగా ఇంగ్లండ్, సౌతాఫ్రికా టూర్లలో మీడియా ప్రతినిధులతో…కొహ్లీ తలబిరుసుగా ప్రవర్తించడం అప్పట్లో చర్చనీయాంశమయ్యింది. 

విరాట్ కు ముందస్తు హెచ్చరిక…

అయితే…గత అనుభవాలను పరిగణనలోకి తీసుకొన్న బీసీసీఐ…ఆస్ట్రేలియా పర్యటన సమయంలో హుందాగా వ్యవహరించమంటూ కొహ్లీని ముందస్తుగానే హెచ్చరించింది.

టీమిండియా కెప్టెన్ గా…భారత ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత కొహ్లీ పైనే ఉందని… క్రికెట్ ఫీల్డ్ లో దూకుడుగా ఉన్నా… మీడియా సమావేశాలలోను, అభిమానులతోనూ మర్యాదగా మెలగాలంటూ… బీసీసీఐ పాలక మండలి సభ్యుడు ఒకరు…వాట్సాప్ సందేశం ద్వారాను…ఆ తర్వాత ఫోను ద్వారాను…కొహ్లీకి చెప్పినట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

ఏదిఏమైనా….వివాదాలకు ఆస్కారమున్న ఆస్ట్రేలియా టూర్ లో…కంగారూ మీడియాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మెలగాల్సిన బాధ్యత విరాట్ కొహ్లీ అండ్ కో పైన ఎంతైనా ఉంది.

భారత జట్టు తన పర్యటన కాలంలో నాలుగు మ్యాచ్ ల టెస్ట్, మూడుమ్యాచ్ ల టీ-20, వన్డే సిరీస్ ల్లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది.