మళ్లీ సినిమాల్లోకి పవన్ కల్యాణ్?

పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారంటూ ఎప్పటికప్పుడు ఫీలర్లు వస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి ఈ ప్రచారం మరింత గట్టిగా జరుగుతోంది. దీనికి కారణం రామ్ తళ్లూరి. ఈ నిర్మాత పవన్ కల్యాణ్ కు బాగా క్లోజ్ అనే విషయం తెలిసిందే. ఇతడు కోరితే పవన్ కచ్చితంగా సినిమా చేస్తాడు. ఆ నిర్మాతే ఇప్పుడు పవన్ రీఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నాడట.

అయితే పవన్ సోలోగా ఈ సినిమా చేయడం లేదట. ఓ యంగ్ హీరో ఇందులో నటిస్తాడట. ఆ హీరో సినిమాలో 40 నిమిషాల పాటు పవన్ కల్యాణ్ కనిపిస్తాడనే ప్రచారం సాగుతోంది. పవన్ కల్యాణ్ కు చాలా విషయాల్లో ఫండింగ్ అందిస్తున్నాడు నిర్మాత రామ్ తళ్లూరి. అంతెందుకు.. ప్రస్తుతం పవన్ కోసం పనిచేస్తున్న శతఘ్ని సోషల్ మీడియా వింగ్ ఈ నిర్మాత కనుసన్నల్లోనే నడుస్తోంది.

వీళ్లిద్దరి మధ్య ఈ రేంజ్ లో అనుబంధం ఉంది కాబట్టే ఈసారి పవన్ రీఎంట్రీని కేవలం పుకారుగా కొట్టిపారేయలేమని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు మాత్రం పవన్ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాదు. ఆ తర్వాతే ఏదైనా అంటున్నారు.