Telugu Global
Family

వామనుడు

పెద్ద పెద్ద పాదాలున్న వాళ్లని చూస్తే ‘వామన పాదం రా’ అని చెణుకులు విసరడం వింటుంటాం. అలాగే మొత్తం స్థలాన్ని ఆక్రమించే వాడిని ‘వాడిది వామనుడి మూడోపాదం’ అని కూడా పెద్ద వాళ్లు అంటుంటే వింటుంటాం. మరి ఈ వామనుడెవరో అతని కథేమిటో తెలుసా? సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే వామనుడిగా అవతార మెత్తాడని పురాణాలు చెబుతున్నాయి. అదితి కశ్యపులకు పుట్టిన బిడ్డ ఇతడు. చాలా పొట్టివాడు. చూడడానికి పిల్లవాడిలా ఉంటాడు. కశ్యపునకు ఇచ్చిన వరం ప్రకారమే విష్ణువు […]

పెద్ద పెద్ద పాదాలున్న వాళ్లని చూస్తే ‘వామన పాదం రా’ అని చెణుకులు విసరడం వింటుంటాం. అలాగే మొత్తం స్థలాన్ని ఆక్రమించే వాడిని ‘వాడిది వామనుడి మూడోపాదం’ అని కూడా పెద్ద వాళ్లు అంటుంటే వింటుంటాం. మరి ఈ వామనుడెవరో అతని కథేమిటో తెలుసా?

సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే వామనుడిగా అవతార మెత్తాడని పురాణాలు చెబుతున్నాయి. అదితి కశ్యపులకు పుట్టిన బిడ్డ ఇతడు. చాలా పొట్టివాడు. చూడడానికి పిల్లవాడిలా ఉంటాడు. కశ్యపునకు ఇచ్చిన వరం ప్రకారమే విష్ణువు వామనుడిగా జన్మించాడు.

వామనావతారానికి ఒక లోకావసరమున్నది. అవి బలి చక్రవర్తి పరిపాలిస్తున్న రోజులు. అతని ప్రభావము చేత దేవతల ప్రభావము తగ్గిపోయింది. దేవతల రాజైన ఇంద్రుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవతలు మొరపెట్టుకుంటే విష్ణుమూర్తి వామనుడిగా బలి చక్రవర్తి దగ్గరకు వెళ్లాడు. ఎలా వెళ్లాడో తెలుసా? భిక్షాటనము చేసే బ్రాహ్మణునిలా వెళ్లి అర్ధించాడు. ‘నీకు కావాల్సింది ఇస్తాను. కోరుకో’మన్నాడు బలి.

వామనుడు కేవలం మూడడుగుల నేలను మాత్రమే కోరుకున్నాడు.

దానవుల గురువు శుక్రుడు అది గమనించి వామనుడు బలిని అణచడానికే వచ్చాడని గ్రహించాడు. ‘వద్దు వద్దు దానమీయొద్దు’ అన్నాడు శుక్రుడు. ఎందుకంటే దానమిస్తే అది ఇచ్చిన బలికే ఆపద తెస్తుందని తెలుసు. అంచేత బలిని వారించాడు. బలి చక్రవర్తి వినలేదు. దానమిస్తూ ఉంటే ఆగలేని శుక్రుడు చిన్న కీటకమై అడ్డుపడ్డాడు. అప్పుడొక పుల్లతో వామనుడు పొడిస్తే శుక్రుని కన్నొకటి గుడ్డిదయింది.

అప్పుడు వామనుడు తన చిన్న శరీరాన్ని పెద్దగా ఆకాశం తలకు తగిలేంత ఎత్తుగా ఎదిగాడు. విస్తరించాడు. విజృంభించాడు. విశ్వరూపం ధరించాడు. ఒక పాదము భూమి మీద వేశాడు. రెండవ పాదము ఆకాశమ్మీద వేశాడు. మూడో పాదం ఎక్కడ వెయ్యాలని అడిగితే ఎక్కడా చోటులేక ‘నా నెత్తి మీద వెయ్యి’ అన్నాడు బలి.

వామనుడు తన మూడో పాదాన్ని బలి నెత్తి మీద వేసి అధ:పాతాళానికి తొక్కేశాడన్నమాట. ఇదే వామనుడి మూడో పాదం కథ!

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  22 Nov 2018 8:30 AM GMT
Next Story