Telugu Global
NEWS

ఓరుగల్లులో.... కూటమికి ఓటమి తప్పదా?

మహాకూటమిగా బరిలో నిలవాల్సిన చోట విపక్షాలు ఒకరిపై ఒకరు అలకపాన్పు ఎక్కి దిగిరానంటున్నారు. జట్టుగా ఉండాల్సిన సమయంలో కూటమిలో లుకలుకలు మొదలయ్యాయనే వాదనలు విన్పిస్తున్నాయి. పొత్తుల్లో భాగంగా సీట్లను దక్కించుకున్న అభ్యర్థులను కూటమిలోని టీడీపీ, ఇతర పార్టీల నేతలు పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మహాకూటమి అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపే పరిస్థితి కనబడుతుంది. నామినేషన్ల కార్యక్రమానికి, ప్రచార కార్యక్రమానికి కూడా మిత్రపక్షాల నాయకులను ఆహ్వనించక పోవడంతో ఆ పార్టీల నేతలు నిరుత్సాహానికి గురవుతున్నారు. […]

ఓరుగల్లులో.... కూటమికి ఓటమి తప్పదా?
X

మహాకూటమిగా బరిలో నిలవాల్సిన చోట విపక్షాలు ఒకరిపై ఒకరు అలకపాన్పు ఎక్కి దిగిరానంటున్నారు. జట్టుగా ఉండాల్సిన సమయంలో కూటమిలో లుకలుకలు మొదలయ్యాయనే వాదనలు విన్పిస్తున్నాయి. పొత్తుల్లో భాగంగా సీట్లను దక్కించుకున్న అభ్యర్థులను కూటమిలోని టీడీపీ, ఇతర పార్టీల నేతలు పట్టించుకోవడం లేదు.

ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మహాకూటమి అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపే పరిస్థితి కనబడుతుంది. నామినేషన్ల కార్యక్రమానికి, ప్రచార కార్యక్రమానికి కూడా మిత్రపక్షాల నాయకులను ఆహ్వనించక పోవడంతో ఆ పార్టీల నేతలు నిరుత్సాహానికి గురవుతున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూటమి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరికి వారే.. యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. నర్సంపేట నియోజక వర్గంలో కూటమి నుంచి సీటు దక్కించుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేపట్టారు. తీరా పొత్తులో భాగంగా ఆ సీటు ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి దక్కగా…. రేవూరికి వరంగల్ తూర్పు కేటాయించారు.

దీంతో దొంతి నామినేషన్ వేసే సమయంలో, ప్రచారానికి శ్రీకారం చుట్టే సమయంలో రేవూరిని గానీ ఆ పార్టీ నేతలను గానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పిలవకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. వరంగల్ తూర్పు నుంచి కూటమి తరఫున పోటీ చేస్తున్న ఆయనతో పనేముందని భావించి ఆయనను దొంతి కలవడానికి విముఖత చూపారనే వాదనలు విన్పిస్తున్నాయి.

కాగా వరంగల్ తూర్పులో రెబెల్ గా దిగిన కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి బరిలో నుంచి తప్పుకుంటేనే నర్సంపేటలో టీడీపీ నేతలు మాధవరెడ్డికి సహకరించాలని చూస్తున్నారు. అదేవిధంగా పరకాల నుంచి మహాకూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ పోటీ చేస్తున్నారు.

ఇక్కడి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి ఇనుగాల వెంకట్రాం రెడ్డి, అతని అనుచరులను నామినేషన్లు, ప్రచార సమయంలో ఆహ్వానించకపోవడంతో అసంతృప్తికి లోనైనట్లు సమాచారం.

అలాగే టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి గన్నోజు శ్రీనివాసా చారి, అతడి అనుచరులను కూడా ప్రచారానికి ఆహ్వనించకపోవడంతో ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఇలా మహాకూటమిలోని భాగస్వాములను కలుపుకోక పోవడంతో పరకాల కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు సులువు కాదన్న ప్రచారం సాగుతోంది.

వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి మహాకూటమి అభ్యర్థిగా టీజేఎస్ అభ్యర్థి దేవయ్య బరిలో ఉన్నారు. ఇక్కడి కాంగ్రెస్, టీడీపీ నేతలను టీజేఎస్ అభ్యర్థి కలుపుకొని ప్రచారం చేయకపోవడంతో టీజేఎస్ అభ్యర్థి గెలుపు ఎలా సాధ్యమవుతుందనే సందేహాలు కలుగుతున్నాయి.

ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఈ మూడు నియోజక వర్గాల పార్టీ అభ్యర్థులు మిత్రులను కలుపుకోక పోతే గెలుపు కష్టమని సొంత పార్టీ నాయకులే అభిప్రాయ పడుతున్నారు.

First Published:  22 Nov 2018 4:15 AM GMT
Next Story