Telugu Global
Others

కృశించిపోతున్న సి.బి.ఐ.

కేంద్ర నేర పరిశోధన సంస్థ (సి.బి.ఐ.)కి రోజులు దగ్గర పడ్డాయి. ఒకనాడు భారత  దేశంలో ‘ప్రధాన దర్యాప్తు సంస్థ’గా పేరొందిన సి.బి.ఐ ఇప్పుడు ఇంటా, బయటా…. చీలికలు, పీలికలుగా మారింది.  డైరెక్టర్ ఆలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ ఆర్.కె. అస్థానా  మధ్య స్పర్ధ  కారణంగా సంస్థ లోపల అసంతృప్తి రాజుకుంటోంది.  అడ్డు అదుపులేకుండా ఆరోపణలు, ప్రత్యరోపణలు బహిరంగమై ఇప్పుడు అసహ్యంగా తయారైంది. ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర మంత్రివర్గ సభ్యులు,  జాతీయ భద్రతా సలహాదారు పేరు సుప్రీంకోర్టుకు ఎక్కాయి. […]

కృశించిపోతున్న సి.బి.ఐ.
X

కేంద్ర నేర పరిశోధన సంస్థ (సి.బి.ఐ.)కి రోజులు దగ్గర పడ్డాయి. ఒకనాడు భారత దేశంలో ‘ప్రధాన దర్యాప్తు సంస్థ’గా పేరొందిన సి.బి.ఐ ఇప్పుడు ఇంటా, బయటా…. చీలికలు, పీలికలుగా మారింది. డైరెక్టర్ ఆలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ ఆర్.కె. అస్థానా మధ్య స్పర్ధ కారణంగా సంస్థ లోపల అసంతృప్తి రాజుకుంటోంది. అడ్డు అదుపులేకుండా ఆరోపణలు, ప్రత్యరోపణలు బహిరంగమై ఇప్పుడు అసహ్యంగా తయారైంది.

ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర మంత్రివర్గ సభ్యులు, జాతీయ భద్రతా సలహాదారు పేరు సుప్రీంకోర్టుకు ఎక్కాయి. ఎవరైనా తక్కువగా ఇష్టపడే (కొన్నిసార్లు అవసరం) సిబిఐ మొదలులో ఉన్న పుచ్చు ఇప్పుడు బయటపడి అందరి దృష్టికి వచ్చింది.

ఇప్పుడు సిబిఐలో నెలకొన్న అవ్యవస్థకు వర్మ, అస్థానా కుతంత్రాల వల్ల మాత్రమే కాక నరేంద్ర మోడీ ప్రభుత్వం తంత్రాలు కూడా కారణమవుతున్నాయి. 1946లో ఆమోదించిన శాసనం ఆధారంగా ఏర్పడిన ఈ సంస్థ పుట్టుక కూడా అధికార యంత్రాంగం అస్పష్టతకు అద్దం పడుతోంది (నవేంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, 2013 కేసులో గౌహతి హైకోర్టు ఇదే విషయాన్ని ప్రస్తావించింది).

ఆ తరువాత సంస్థ పనితీరులో జరిగిన సంస్కరణలన్నీ కోర్టులు జోక్యం చేసుకోవడం, అంకుశంతో పొడవడం, ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడం వల్ల జరిగినవే. ఆ విధంగా చేసిన ‘సంస్కరణలు’ కూడా అరకొరగా ఉన్నాయి. కొన్నిసార్లు చాటుమాటు దురుద్దేశంతో చేసినవి. ఎవరైనా ప్రభుత్వాధికారిపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలనే నిబంధన ఉంది. ఈ నిబంధనను చేర్చడం వల్ల, దానిని సాకుగా చూపి అనేకమంది ఉన్నతస్థాయి అధికారులను కాపాడేందుకు అనేకసార్లు ప్రయత్నాలు జరిగాయి. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కనీస దర్యాప్తుకు కూడా నోచుకోలేదు.

సిబిఐ పనిలో పక్షపాతం, రాజకీయ జోక్యం లేకుండా చేసేందుకు కోర్టులు అనేక సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాయి. కానీ ఫలితం అంతంత మాత్రమే. సిబిఐ పనితీరుపై పర్యవేక్షణాధికారాన్ని కేంద్ర నిఘా సంఘానికి అప్పగించడం లేక నియామక విధానంలో ఉభయపక్ష పద్ధతిని ప్రవేశపెట్టడం వంటి సూచనలు చేశాయి.

కోర్టులు సదుద్దేశంతో తీసుకున్న చర్యలను, సూచనలను వరుసగా అధికారంలోకి వచ్చిన పాలకులు పట్టించుకోకుండా పక్కన పెట్టారు. సిబిఐని ఒక దర్యాప్తు సంస్థగా కాక రాజకీయ కుట్రలకు ఆయుధంగా వాడుతున్నారు.

ఈ గందరగోళానికి అనేక ప్రభుత్వాలను తప్పుపట్టవలసి ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపార్టీ కేంద్ర ప్రభుత్వం సిబిఐని స్వప్రయోజనలకోసం వాడుకుంటోందని ఆరోపిస్తాయి. అధికారంలోకి వచ్చిన తరువాత సరిగ్గా అదే చేస్తాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు స్పష్టం చేస్తుంది. తమ అనుమతి లేకుండా రాష్ట్రంలో సిబిఐ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టరాదని ఈ నెల ఆరంభంలో ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంది.

జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డి ఏ)లో భాగస్వామిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నాయకులను వేధించడానికి తెలుగుదేశం పార్టీ సిబిఐని భేషుగ్గా వాడుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సరిపడనందువల్ల ఉన్నట్టుండి వారికి సిబిఐ దుర్వినియోగం సంగతి గుర్తుకు వచ్చి సిబిఐ కార్యకలాపాలకు సమ్మతి ఉపసంహరించుకున్నారు.

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేసిన పని గతంలో చాలా ప్రభుత్వాలు చేసాయి. ముఖ్యమంత్రులకు, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులకు సంబంధమున్న, ప్రత్యేకంగా రాజకీయంగా సున్నితమైన కేసుల్లో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అదే విధంగా సిబిఐ కార్యకలాపాలకు సమ్మతి ఉపసంహరించుకున్నాయి.

రాష్ట్ర నాయకులను తమ దారికి తెచ్చుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు పార్లమెంటులో తమకు పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు ఇటువంటి చర్యలకు పాల్పడటం కద్దు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర పోలీసు యంత్రాంగాలు సరిగా పనిచేయనందువల్లనే సిబిఐ పలుకుబడి పెరిగిందనే సంగతి కొన్నిసార్లు వెల్లడికాదు.

సిబిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నదని తరచుగా ఫిర్యాదు చేసే రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు తమలో తాము తరచి చూసుకోవాలి. ఉన్నతస్థాయి వ్యక్తుల కేసులను కోర్టులు సిబిఐకి, జాతీయ దర్యాప్తు సంస్థకు ఎందుకు అప్పగిస్తున్నాయో యోచించాలి.

దేశవ్యాప్తంగా పొలిసు దళాలు – సాధన సామగ్రి లేమి, సిబ్బంది కొరత, కొరవడిన స్వాతంత్ర్యం వంటి కారణాల వల్ల – సరిగా పనిచేయనందున ఇప్పుడు సిబిఐకి అప్పగించే కేసుల సంఖ్య పెరిగింది. సిబిఐకి సొంతంగా అధికారుల శ్రేణి లేదు. రాష్ట్ర శ్రేణికి చెందిన పొలీసు అధికారుల పైన సిబిఐ ఆధారపడుతుంది. వారిని డెప్యుటేషన్ మీద తెచ్చుకుంటారు. తమ దర్యాప్తుకు వచ్చే న్యాయసంబంధ వైద్యశాస్త్ర కేసుల పరిశోధనకు అవసరమైన సామర్ధ్యం దానికి ఇప్పటికీ లేదు.

ఇప్పుడు ఉన్నతస్థాయిలో జరిగే అవినీతిపై, ఉన్నతస్థాయి, అంతరాష్ట్ర , సీమాంతర లేక రాజకీయంగా సున్నితమైన కేసులను వివాదాలకు తావులేకుండా నిష్పాక్షిక దర్యాప్తు చేసేందుకు అంకితమైన సంస్థ అవసరం ఉంది. ఇటువంటి కేసుల్లో సిబిఐకి ఉన్న రికార్డ్ అసమగ్రంగా ఉందనే చెప్పాలి.

2జి కుంభకోణం కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించి విడిచిపెట్టడం చూసిన తరువాత తప్పు ఎక్కడ జరిగిందని ఆత్మ పరిశీలన, దర్యాప్తు జరిపి ఉండాల్సింది. ఎందుకంటే ఆ దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షించింది. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్నికల్లో పతనం కావడంలో ఈ కుంభకోణం ప్రభావం కూడా ఉంది. సిబిఐ అధికారుల వేధింపుల కారణంగా బన్సాల్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. దాంతో సంస్థ అధికారులలో ప్రమాద ఘంటికలు మోగి ఉండాల్సింది. అయినప్పటికీ పరిస్థితిని చక్కదిద్దడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో సిబిఐని “చక్కబెట్టలేము”. ఇటీవల కాలంలో దర్యాప్తులపై ప్రభావం చూపాడని ఆరోపణలు వచ్చిన డైరెక్టర్లలో అలోక్ వర్మ మూడవ వారు. వర్మను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడం న్యాయసమ్మతమేనా కాదా అని నిష్పాక్షికంగా, సమబుద్ధితో విచారించడానికి సుప్రీంకోర్టు చేస్తున్న ప్రయత్నాలన్నీ కేంద్ర ప్రభుత్వం పైన, దాని అధికారుల పైన వచ్చిన సంచలనాత్మక ఆరోపణలు, అదే సమయంలో మీడియాలో ఈ కేసు గురించి సమాంతరంగా వస్తున్న వ్యాఖ్యలతో పక్క దారిపట్టాయి.

వర్మ పిటీషన్ పై సుప్రీంకోర్టు నిర్ణయమేదైనా ప్రజావిశ్వాసాన్ని, సంస్థ లోపల అంతర్గత నైతిక స్థైర్యాన్ని పునరుద్ధరించలేదు. ఆశించిన రీతిలో సిబిఐ పనిచేయడానికి అవసరమైన సంస్కరణలు సూచించే సామర్ధ్యం కూడా దానికి లేదు.

ఈ సంక్షోభ సమయంలో ఒక మంచి దర్యాప్తు సంస్థను సృష్టించేందుకు అవకాశం ఉంది.

అది నమ్మదగినది, సమర్ధతతో రాజ్యాంగ విహితంగా వ్యవహరించేది; బలమైన శాసనం ద్వారా మాత్రమే ఏర్పాటై రాజకీయ జోక్యం లేకుండా పనిచేసేది; ఉన్నతస్థాయి నేరాలపై నిష్పాక్షికంగా నేరారోపణ చేసి దర్యాప్తు జరిపే సామర్ధ్యం ఉందని భరోసా ఇవ్వగలిగేది అయి ఉండాలి. ఇక రాజకీయ వర్గాలు ఈ అవకాశాన్ని జారవిడుచుకోబోవని మాత్రమే మనం ఆశించగలం.

(ఎకనామిక్ అండ్ పొలిటిచల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  25 Nov 2018 7:00 AM GMT
Next Story