తిరుమలలో కొండను ఢీకొన్న బస్సు….

కర్ణాటకలో బస్సు ప్రమాదం మరిచిపోకముందే ఏపీలో మరో బస్సు ప్రమాదం సంభవించడం కలకలం రేపింది. అది కూడా తిరుమల ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డులో జరగడంతో భక్తులంతా హతాషులయ్యారు. ఆదివారం ఉదయం తిరుమల ఘాట్ రోడ్ పై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఓ కొండను వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టి అక్కడే ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

తిరుమల కొండపై మొదటి, రెండో ఘాట్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న లింక్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ మితిమీరిన వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బస్సులో ప్రయాణించిన భక్తులు పేర్కొన్నారు. బస్సును వేగంగా నడుపుతూ రోడ్డుపై ఉన్న ఒక మూల మలుపు వద్ద డ్రైవర్ వేగంగా బస్సును తిప్పడంతో అదుపుతప్పి కొండను ఢీకొట్టింది. బస్సులో ఎక్కువమంది టీటీడీ ఉద్యోగులున్నారు. వారు విధులకు వెళుతున్నారు. వీరితోపాటు 15మంది సాధారణ భక్తులకు గాయాలయ్యాయి.

గాయపడ్డ క్షతగాత్రులను టీటీడీ సిబ్బంది వేగంగా స్పందించి తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. వారందరికీ చికిత్స చేసిన అనంతరం ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలుపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కర్ణాటకలో బస్సు ప్రమాదం జరిగి 30 మంది చనిపోవడం…. నాలుగు రోజుల క్రితం ఒక బస్సు నదిలో పడిన ఘటనలో 12 మంది చనిపోవడం…. తాజాగా తిరుమలలో బస్సు ప్రమాదం జరగడంతో ఇలా వరుస బస్సు ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి.