Telugu Global
NEWS

హాకీ ప్రపంచకప్ టైటిల్ కు భారత్ ఎంతెంత దూరం?

1975 ప్రపంచకప్ విజేత భారత్ ప్రపంచ టైటిల్ కోసం 43 ఏళ్లుగా నిరీక్షణ భారత జాతీయక్రీడ హాకీ. ఒలింపిక్స్ చరిత్రలోనే అత్యధికంగా ఎనిమిది బంగారు పతకాలు గెలుచుకొన్న ఏకైక దేశం భారత్ మాత్రమే. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్, సుర్జిత్ సింగ్, పర్గత్ సింగ్, గోవింద, మెర్పిన్ ఫెర్నాండేజ్, ముకేశ్ కుమార్, ధన్ రాజ్ పిళ్లై లాంటి ఎందరో గొప్పగొప్ప ఆటగాళ్లను అందించిన ఘనత భారత హాకీకి ఉంది. అయితే…నాలుగున్నర దశాబ్దాల ప్రపంచకప్ హాకీ చరిత్రలో భారత్ […]

హాకీ ప్రపంచకప్ టైటిల్ కు భారత్ ఎంతెంత దూరం?
X
  • 1975 ప్రపంచకప్ విజేత భారత్
  • ప్రపంచ టైటిల్ కోసం 43 ఏళ్లుగా నిరీక్షణ

భారత జాతీయక్రీడ హాకీ. ఒలింపిక్స్ చరిత్రలోనే అత్యధికంగా ఎనిమిది బంగారు పతకాలు గెలుచుకొన్న ఏకైక దేశం భారత్ మాత్రమే. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్, సుర్జిత్ సింగ్, పర్గత్ సింగ్, గోవింద, మెర్పిన్ ఫెర్నాండేజ్, ముకేశ్ కుమార్, ధన్ రాజ్ పిళ్లై లాంటి ఎందరో గొప్పగొప్ప ఆటగాళ్లను అందించిన ఘనత భారత హాకీకి ఉంది.

అయితే…నాలుగున్నర దశాబ్దాల ప్రపంచకప్ హాకీ చరిత్రలో భారత్ కు అంతంత మాత్రం స్థానమే ఉంది. మలేసియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగిన 1975 ప్రపంచకప్ లో మాత్రమే భారత్ విజేతగా నిలువగలిగింది.

1971లో తొలి ప్రపంచకప్….

హాకీ పురుషుల విభాగంలో 1971 నుంచే ప్రపంచకప్ పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రారంభ ప్రపంచకప్ హాకీలో కాంస్య పతకం మాత్రమే సాధించిన భారత్…. ఆ తర్వాత రెండేళ్లకు 1973లో నిర్వహించిన రెండో ప్రపంచకప్ లో రన్నరప్ స్థానంతో సరిపెట్టుకొంది.

1975లో మలేసియా వేదికగా ముగిసిన మూడో ప్రపంచకప్ హాకీ టోర్నీలో…భారత్ తొలిసారిగా ట్రోఫీ అందుకొంది. అజిత్ పాల్ సింగ్ నాయకత్వంలోని భారతజట్టు విజేతగా నిలిచింది.

ఆ తర్వాత 1978 నుంచి 2014 వరకూ జరిగిన పది ప్రపంచకప్ టోర్నీల్లోనూ..భారత్ కు ఘోర పరాజయాలే ఎదురయ్యాయి.

నాలుగుజట్ల అరుదైన రికార్డు….

1971 నుంచి 2014 వరకూ జరిగిన మొత్తం 13 ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్న ఘనతను భారత్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్ జట్లు మాత్రమే దక్కించుకోగలిగాయి. ఓవరాల్ గా చూస్తే మాత్రం.. ఇప్పటి వరకూ 25 దేశాలజట్లు మాత్రమే ప్రపంచకప్ బరిలోకి దిగగలిగాయి.

1978 ప్రపంచకప్ లో ఆరో స్థానానికి పడిపోయిన భారత్..1982లో ఐదు, 1986 ప్రపంచకప్ లో 12 స్థానాలకే పరిమితమయ్యింది. 1990 ప్రపంచకప్ లో 10వ స్థానం సంపాదించిన భారత్…. 1994 ప్రపంచకప్ లో పుంజుకొని 5వ స్థానానికి ఎకబాక గలిగింది.

1998 ప్రపంచకప్ లో నాలుగు, 2002 ప్రపంచకప్ లో 10, 2006 ప్రపంచకప్ లో 11 స్థానాలు సాధించిన భారత హాకీ…2010 టోర్నీలో ఎనిమిది, 2014 ప్రపంచకప్ లో 9 స్థానాలలో నిలువగలిగింది.

భారత్ కు గోల్డెన్ ఛాన్స్….

గత రెండుసంవత్సరాల కాలంలో నిలకడగా రాణిస్తూ వస్తున్న భారత హాకీ జట్టు…ఆతిథ్య దేశం హోదాలో..2018 హాకీ ప్రపంచకప్ బరిలోకి దిగుతోంది. ప్రపంచ హాకీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం.. 5వ స్థానంలో ఉన్న భారత్…ప్రపంచ హాకీ పతకం కోసం గత 43 ఏళ్లుగా ఎదురుచూస్తూ వస్తోంది.

అయితే..మిడి ఫీల్డర్ మన్ దీప్ సింగ్ కెప్టెన్ గా, హరేంద్ర సింగ్ ప్రధాన శిక్షకుడిగా…భారత్ టైటిల్ వేటకు దిగుతోంది.

భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 వరకూ జరిగే ఈ టోర్నీలో మొత్తం 16 దేశాల జట్లు ఢీ కొనబోతున్నాయి. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి..గ్రూప్ లీగ్ కమ్ నాకౌట్ తరహాలో పోటీలు నిర్వహిస్తున్నారు.

గ్రూప్ – సీ లీగ్ లో భారత్ పోటీ….

గ్రూప్- సీ లీగ్ లో ఆతిథ్య భారత్ తో పాటు… బెల్జియం, సౌతాఫ్రికా, కెనడా జట్లు సమరానికి సై అంటున్నాయి. అంతర్జాతీయ హాకీ ర్యాంకింగ్స్ ప్రకారం…భారత్ 5వ ర్యాంకులో ఉంటే..బెల్జియం 3వ ర్యాంక్ జట్టుగా ఉంది.

కెనడా 11, సౌతాఫ్రికా 15 ర్యాంకుల్లో ఉన్నా…భారత్ కు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

భారతజట్టు… నవంబర్ 28న దక్షిణాఫ్రికాతో ప్రారంభ గ్రూప్ మ్యాచ్ ఆడుతుంది. డిసెంబర్ 2న బెల్జియం, డిసెంబర్ 8న కెనడా జట్లతో తలపడుతుంది. డిసెంబర్ 12, 13 తేదీలలో క్వార్టర్ ఫైనల్స్, డిసెంబర్ 15న సెమీఫైనల్స్, డిసెంబర్ 16న ఫైనల్స్ జరుగుతాయి.

అరుదైన రికార్డులు….

1971 నుంచి 2014 వరకూ మొత్తం 13సార్లు ప్రపంచకప్ పోటీలు నిర్వహిస్తే…అత్యధికంగా పాకిస్తాన్ జట్టు నాలుగుసార్లు విజేతగా నిలిచింది.

ప్రపంచకప్ లో భాగంగా మొత్తం 569 మ్యాచ్ లు జరిగితే…2వేల 276 గోల్స్ నమోదయ్యాయి. సగటున మ్యాచ్ కు నాలుగు గోల్స్ నమోదు కావడం విశేషం.

అత్యధికంగా నెదర్లాండ్స్ జట్టు 93 మ్యాచ్ లు ఆడితే…అత్యధిక విజయాలు సాధించిన జట్టు ఘనతను ఆస్ట్రేలియా సొంతం చేసుకొంది. కంగారూజట్టు 63 విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా జట్టు 276 గోల్స్ సాధించడం ద్వారా ప్రపంచ నంబర్ వన్ జట్టుగా రికార్డుల్లో చేరింది.

ప్రస్తుత ప్రపంచకప్ లో….ఆస్ట్రేలియా, బెల్జియం, ఇంగ్లండ్, స్పెయిన్, అర్జెంటీనా, నెదర్లాండ్స్, జర్మనీ, భారత జట్లు అత్యంత పటిష్టమైన జట్లుగా కనిపిస్తున్నాయి.

లీగ్ దశలో డ్రా..భారత్ కు అనుకూలంగా ఉన్నా…క్వార్టర్ ఫైనల్స్ నుంచి నిలకడగా…స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగితేనే మెడల్ రౌండ్ చేరుకొనే అవకాశాలు ఉంటాయి. ఒరిస్సా ప్రభుత్వం ప్రధాన స్పాన్సర్ గా…హాకీ ఇండియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈటోర్నీలో భారత్ కనీసం కాంస్య పతకం సాధించినా…అది గొప్పవిజయమే అవుతుంది.

భారత హాకీ అభిమానులంతా…చక్ దే భారత్ అంటూ ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారు. లక్ దే భారత్…చక్ దే భారత్.

First Published:  27 Nov 2018 9:00 AM GMT
Next Story