మిథాలీ టీ-20 కెరియర్ కు బీసీసీఐ తెర?

  • ఇక వన్డేలకే పరిమితం కానున్న మిథాలీ
  • 35 ఏళ్ల వయసులో మిథాలీకి చేదు అనుభవం

కరీబియన్ ద్వీపాలు వేదికగా ముగిసిన 2018 టీ-20 మహిళా ప్రపంచకప్ లో… భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కు ఎదురైన అవమానం పై… బీసీీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ఆస్ట్రేలియాతో ముగిసిన గ్రూప్ లీగ్ ఆఖరి రౌండ్, ఇంగ్లండ్ తో జరిగిన సెమీఫైనల్స్ లో పాల్గొన్న భారత తుదిజట్టులో మిథాలీకి చోటివ్వకుండా…డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితం చేయటం వివాదాస్పదంగా మారింది.

అయితే …టీమ్ మేనేజ్ మెంట్ మాత్రం… మిథాలీ స్ట్రయిక్ రేట్ తక్కువగా ఉన్న కారణంగానే విన్నింగ్ కాంబినేషన్ ను కొనసాగించినట్లు ప్రకటించింది. బీసీసీఐ సైతం… సెలెక్షన్ కమిటీ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించింది.

బీసీసీఐ సమీక్ష…

కరీబియన్ ద్వీపాల నుంచి స్వదేశానికి చేరిన భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ లతో… బీసీసీఐ సీఈవో, ఇతర సభ్యులు పలు అంశాలపై సవివరంగా చర్చించారు.

35  ఏళ్ల వెటరన్ మిథాలీ రాజ్ ను…ఇక వన్డే క్రికెట్ కు మాత్రమే పరిమితం చేయాలన్న ఆలోచన బీసీసీఐ పెద్దల్లో కనిపిస్తోంది. దీంతో ఇక మిథాలీ టీ-20 క్రికెట్ కెరియర్ ముగిసినట్లేనని…. విశ్లేషకులు భావిస్తున్నారు.

రెండు హాఫ్ సెంచరీలు సాధించినా….

ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ లో మిథాలీ ఆడిన రెండుకు రెండుమ్యాచ్ ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించింది. అయితే…బంతికో పరుగు సాధించడం ద్వారా మిథాలీ విమర్శలను ఎదుర్కొంది. 50 పరుగులను 50 బంతుల్లో సాధించడం పట్ల టీమ్ మేనేజ్ మెంట్ అసంతృప్తితో ఉంది.

85 టీ-20ల్లో 2వేల283 పరుగులు

టీ-20 అంటే కుర్రకారు ఆట. మిథాలీరాజ్ లాంటి 35 ఏళ్ల వెటరన్ ప్లేయర్ల ఆట ఏమాత్రం కాదని…మహిళా సెలెక్షన్ కమిటీ భావిస్తోంది. టీ-20 నుంచి మిథాలీ తనకు తానుగా తప్పుకొంటే…. మేలని సలహా ఇచ్చింది.

ఇటీవలి ప్రపంచకప్ లో ఐర్లాండ్  తో ముగిసిన మ్యాచ్ వరకూ ఆడిన మొత్తం 85 మ్యాచ్ ల్లో 80 ఇన్నింగ్స్ ఆడిన మిథాలీ రాజ్ 2వేల 83 పరుగులు సాధించింది. ఇందులో 17 హాఫ్ సెంచరీలతో సహా…. 97 పరుగుల అత్యధిక స్కోరును సైతం నమోదు చేసిింది.

2006లో టీ-20 అరంగేట్రం….

2006లో ఇంగ్లండ్ ప్రత్యర్థిగా టీ-20 అరంగేట్రం చేసిన మిథాలీ… గత 12 సంవత్సరాలుగా… భారత టీ-20 జట్టులో సభ్యురాలిగా ఉంటూ వస్తోంది. బీసీసీఐ ఒత్తిడితో మిథాలీ ఒకవేళ టీ-20 ఫార్మాట్ నుంచి… తప్పుకొంటే… ప్రస్తుత ప్రపంచకప్… ఆఖరి ప్రపంచకప్ అనుకోక తప్పదు.

అయితే అపార అనుభవం ఉన్న మిథాలీ…. 50 ఓవర్ల వన్డే క్రికెట్ తో పాటు…. టెస్ట్ క్రికెట్ లో సైతం తన కెరియర్ ను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.

కేవలం క్రికెట్ కెరియర్ కోసమే వివాహాన్ని వాయిదా వేసుకొంటూ వచ్చిన 35 ఏళ్ల 358 రోజుల వయసున్న మిథాలీ…. ఆట కోసం వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేయటం గొప్ప విషయమే మరి.