కేజ్రీవాల్ దగ్గరకు ‘బుల్లెట్’తో వ్యక్తి

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇటీవలే అనిల్ కుమార్ అనే వ్యక్తి సీఎం కేజ్రీవాల్ పై కారంపొడితో వచ్చి దాడి చేసిన సంగతి తెలిసిందే.. సచివాలయంలో జనతా దర్బార్ లో అందరూ చూస్తుండగానే ఈ ఘాతుకానికి పాల్పడడం సంచలనం రేపింది. ఈ ఘటనలో కేజ్రీవాల్ కళ్లజోడు కూడా పగిలిపోయింది. దీంతో ఢిల్లీ సెక్రెటేరియట్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేజ్రీవాల్ ను కలిసే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

ఓ 39 ఏళ్ల ఇమ్రాన్ అనే వ్యక్తి తాజాగా సీఎం కేజ్రీవాల్ ను కలిసేందుకు వచ్చాడు. వక్ఫ్ బోర్డ్ తమకు జీతాలు పెంచేలా చూడాలని కోరుతూ ముస్లిం మతాధికారులతో ఆయన రాగా.. పోలీసులు తనిఖీలు చేశారు. ఇందులో అతడి జేబులో తుపాకీలో పెట్టి కాల్చే బుల్లెట్ ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే ఇమ్రాన్ ను పట్టుకొని అరెస్ట్ చేసి విచారించారు.

ఇమ్రాన్ విచారణలో దాటవేసే సమాధానాలు చెప్పాడని తెలిసింది. తాను పనిచేసే మసీదులో విరాళాల డబ్బాలో ఈ బుల్లెట్ దొరికిందని.. దాన్ని మరిచిపోయి జేబులో వేసుకొని వచ్చానని పోలీసులకు తెలిపాడట.. తనీఖీలు చేసేంతవరకు అది నా జేబులో ఉందని గుర్తులేదని వివరించాడు. అయితే పోలీసులు మాత్రం దీనిపై కుట్రకోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు.

తనపై కారం పొడి దాడి తర్వాత ఇదంతా బీజేపీ చేసిన కుట్ర అని కేజ్రీవాల్ ఆరోపించారు. తాను ఢిల్లీలో మంచి పరిపాలన, ప్రజల మనసు చూరగొంటున్నాననే ఇలా చేస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ సీఎంకు రక్షణ కల్పించలేని ప్రధాని నరేంద్రమోడీ రాజీనామా చేయాలని సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.