మరోసారి ఇళయరాజా హెచ్చరిక

తాను కంపోజ్ చేసిన పాటలను గాయకులు ఇష్టానికి పాడేస్తుండడంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. అనుమతి లేకుండా పలు వేదికలపై తన పాటలు పాడుతున్నారంటూ ఇది వరకే గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు లీగల్ నోటీసులు పంపిన ఇళయరాజా ఇప్పుడు మిగిలిన గాయకులకు వార్నింగ్ ఇచ్చారు.

తన పాటలు పాడవద్దు అని తాను చెప్పడం లేదని.. కానీ అనుమతి లేకుండా పాటలు పాడడాన్ని మాత్రం సహించబోనన్నారు. తాను కంపోజ్‌ చేసిన పాటలను అనుమతి లేకుండా పాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
సోషల్ మీడియా వేదికగా గాయకులకు ఇళయరాజా హెచ్చరిక జారీ చేశారు.

”నా అనుమతి లేకుండా నేను కంపోజ్‌ చేసిన పాటలను పాడుతున్న గాయకులందరకీ ఇదే నా విన్నపం. నా పాటలు పాడొద్దు అని చెప్పడం లేదు. పాడే ముందు నా అనుమతి తీసుకోండి. నిబంధనలను పాటించండి. అలా చేయకపోవడం నేరం. నా అనుమతి లేకుండా నా పాటలు పాడితే మ్యుజీషియన్స్‌తో పాటు బ్యాండ్‌ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది” అని హెచ్చరించారు.

”మీరంతా పాటలు పాడటానికి డబ్బులు తీసుకుంటారు కదా? ఉచితంగా పాడటంలేదు కదా? మరి నా పాటలు పాడుతూ మీరు డబ్బులు తీసుకోవడం సరైనదేనా? నాకూ వాటా రావాల్సిన పనిలేదా? నేను అడుగుతున్నది కొంత నగదు మాత్రమే” అని ఇళయరాజా నిలదీశారు.