ఉదయమే రిపోర్ట్ వచ్చింది…. జిల్లాలో మొత్తం సీట్లు టీఆర్‌ఎస్‌కే – కేసీఆర్

ఎన్నికల్లో ప్రజల అభీష్టమే గెలవాలన్నారు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌. పరిస్థితులను బేరీజు వేసుకుని ఓట్లేయాలన్నారు.

ఈ ఎన్నికల్లో 58 ఏళ్లు పాలించిన మహాకూటమి ఒకవైపు…పోరాడి తెలంగాణ సాధించి, నాలున్నరేళ్ల పాటు పాలించిన టీఆర్‌ఎస్ ఒకవైపు నిలబడ్డాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో కరెంట్ ఎలా ఉండేది…ఇప్పుడు ఎలా ఉందో సరిచూసుకోవాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత మే నెలలోనే నార్లు పోయాలన్నారు… తిరిగి గాలివాన రాకముందే కోతలు పూర్తి కావాలన్నారు. కేసీఆర్‌ ఉంటే తెలంగాణలో కరెంట్ పోదన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్‌ ఉండదు… 24 గంటలు కరెంట్‌ ఇవ్వడం నిజంగానే కాంగ్రెస్ వాళ్లకు చేతగాదన్నారు.

తిరిగి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తోందని అందులో అనుమానమే అక్కర్లేదన్నారు. బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డికి 73 శాతం ఓటింగ్‌ రాబోతోందని సర్వేలో తాజాగా తేలిందన్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం సీట్లను టీఆర్ఎస్సే గెలుస్తోందని…. ఉదయమే సర్వే రిపోర్టు వచ్చిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఫలితాలు టీఆర్‌ఎస్‌కే ఏకపక్షంగా రాబోతున్నాయన్నారు.

పోచారం శ్రీనివాసరెడ్డిని మళ్లీ గెలిపించుకుంటే బాన్సువాడకు, జిల్లాకే లాభమన్నారు. ఆయన మంత్రిగా మరోసారి కొనసాగుతారన్నారు. అధికారంలోకి వస్తే మరోసారి లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తామన్నారు. కేసీఆర్‌ బతికి ఉండగా రైతులు బ్యాంకు అప్పుల వల్ల కష్టాలు పడకూడదన్నారు.

30లక్షల మంది యాదవులున్నారని… వారిని ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే 4వేల కోట్లతో 70 లక్షల గొర్రెలు కొని తీసుకొచ్చామన్నారు. వాటికి కొత్తగా 40 లక్షల గొర్రెలు పుట్టాయన్నారు. సాయంత్రం గ్రామాల్లోకి వెళ్తే ఎక్కడ చూసినా అవే గొర్రెలు కనపడుతున్నాయని… తాను వెళ్లినప్పుడు కూడా రెండుమూడుసార్లు తన కార్లకే గొర్రెలు అడ్డువచ్చాయన్నారు. మీరిచ్చిన గొర్రెలే సర్‌ అడ్డువస్తున్నాయని గ్రామస్తులు చెప్పారని కేసీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు.