పవన్‌ కల్యాణ్‌పై ఎమ్మెల్యే అనిల్ సంచలన వ్యాఖ్యలు

జగన్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా టీడీపీ, కాంగ్రెస్, జనసేన కలిసి పనిచేస్తున్నాయన్నారు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. వైసీపీ అధికారంలోకి వస్తే తమ పప్పులుడకవని చంద్రబాబు, పవన్‌ భావిస్తున్నారన్నారు.

తెలంగాణలో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు వైఎస్ ఫొటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని…. సండ్ర వెంకటవీరయ్య ఉదంతాన్ని గుర్తు చేశారు. పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ నటిస్తున్నారని విమర్శించారు అనిల్. ఎన్ని పార్టీలు ఏకమైనా జగన్‌ను ఏమీ చేయలేరన్నారు.

జగన్‌పై దాడిని కోడి కత్తి అంటూ మీటింగ్‌లో ఊగిపోతూ, నటిస్తూ పవన్ ఎద్దేవా చేశారని అనిల్ మండిపడ్డారు. కోడికత్తి అంటూ ఎద్దేవా చేస్తున్న పవన్ కల్యాణ్.. అదే కోడికత్తితో దాడి చేస్తే తట్టుకుంటారా? అని ప్రశ్నించారు. దాడి జరిగినా జగన్ ఎలాంటి రచ్చ చేయకుండా హుందాగా అక్కడి నుంచి వెళ్లిపోయారని అనిల్ కుమార్ చెప్పారు. అదే పవన్‌ అయి ఉంటే నన్ను పొడిచేశారు అంటూ నానా హంగామా చేసేవారని ఎద్దేవా చేశారు.

కంటికి ఆపరేషన్ చేస్తే 15 రోజులు కాలెత్తి ఇంట్లో పడుకున్న పవన్‌ కల్యాణ్‌ కూడా జగన్‌ను విమర్శించడం ఏమిటని వ్యాఖ్యానించారు. కాన్వాయ్‌ లో…. ఆఖరిలో వస్తున్న ఒక కారును ఇసుక లారీ ఢీకొడితే తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని… తన ఇంటి చుట్టూ మనుషులు తిరుగుతున్నారని ఇదే పవన్‌ కల్యాణ్ హంగామా చేయలేదా అని నిలదీశారు.

ధైర్యవంతుడెవడూ కూడా పదేపదే తాను ధైర్యవంతుడిని అని చెప్పుకోరని… పవన్‌ కల్యాణ్ మాత్రం ఎక్కడికి వెళ్లినా తాను ధైర్యవంతుడిని, ఎవరికీ భయపడను అంటూ పదేపదే చెబుతుంటారని… దీన్ని బట్టే పవన్‌ కల్యాణ్ లోలోన వణికిపోతున్నారని అర్థమవుతోందన్నారు.

టీడీపీ, జనసేన కార్యకర్తలు సైనికుల్లా కలిసి పనిచేసి తెలంగాణలో మహాకూటమిని గెలిపించాలని స్వయంగా చంద్రబాబే చెప్పారని…. దీన్ని బట్టే చంద్రబాబుకు, పవన్‌కు మధ్య సంబంధం ఏంటో తెలిసిపోతోందన్నారు. పవన్‌, టీడీపీ మధ్య బంధానికి చంద్రబాబు వ్యాఖ్యల కంటే ఇంకేం నిదర్శనం కావాలని ప్రశ్నించారు.