మరో డేట్ ఫిక్స్ చేసిన జక్కన్న

నవంబర్ 11న సరిగ్గా ఉదయం 11 గంటలకు (11-11-11) తన భారీ మల్టీస్టారర్ సినిమాను లాంచ్ చేశాడు రాజమౌళి. అలా 11-11-11న సినిమాను ప్రారంభించిన జక్కన్న.. ఇప్పుడు 12-12-12పై కన్నేశాడు. అంటే డిసెంబర్ 12, మధ్యాహ్నం 12 గంటలని అర్థం. ఆ సమయానికి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్తను బయటపెడతాడట రాజమౌళి
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమాకు సంబంధించి ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్న ఆసక్తికర అంశాలు రెండే. వాటిలో ఒకటి టైటిల్ కాగా, రెండోది హీరోయిన్లు ఎవరనే అంశం. ఈ రెండింటిలో ఒక మేటర్ ను 12-12-12న బయటపెట్టే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఫస్ట్ షెడ్యూల్ లోనే ఎన్టీఆర్-చరణ్ మధ్య ఓ భారీ ఫైట్ సీన్ పెట్టాడు జక్కన్న. దాదాపు 13 కెమెరాలతో ఈ ఫైట్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఆ తర్వాత సెకెండ్ షెడ్యూల్ వివరాల్ని వెల్లడిస్తారు.