భారత మహిళా క్రికెట్ లో కిష్కింధకాండ

  • కెప్టెన్ల చెలగాటం… కోచ్ లకు పదవీ సంకటం
  • వివాదంలో పాలకమండలి సభ్యురాలు డయానా

దశాబ్దాలుగా వివాదరహితంగా ఉంటూ వస్తున్న భారత మహిళా క్రికెట్లో వివాదాలు తారాస్థాయికి చేరాయి. కెప్టెన్ల దెబ్బతో కోచ్ లు, కోచ్ ల దెబ్బతో మాజీ కెప్టెన్లు ఎగిరిపోడం సాధారణ విషయంగా మారింది.

వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ నుంచి… బీసీసీఐ పాలకమండలిలో ఏకైక మహిళా సభ్యురాలు డయానా ఎడుల్జీ వరకూ వివాదాలలో చిక్కి ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

భారత మహిళా క్రికెట్లో ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది. క్రికెటర్లు…శిక్షకుల మధ్య ఓవైపు, బీసీసీఐ పాలకమండలి సభ్యురాలితో మాజీ కెప్టెన్ లడాయి మరోవైపు…. భారత మహిళా క్రికెట్ ప్రతిష్ఠను మసకబార్చాయి. స్పాన్సర్లు, నిధుల కొరతతో అల్లాడిన సమయంలో వివాదాలకు దూరంగా ఉన్న మహిళా క్రికెట్… బీసీసీఐ అండదండలు పుష్కలంగా లభిస్తున్న తరుణంలో వివాదాలకు కేంద్రబిందువుగా మారటం చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగింది?

భారత్ లో పురుషుల క్రికెట్ మాత్రమే కాదు…మహిళా క్రికెట్ సైతం వివాదాలకు అతీతం కాదని తేలిపోయింది. ఐసీసీ నిబంధనల మేరకు బీసీసీఐలో ఓ భాగంగా మారిన తర్వాత నుంచి…. మహిళా క్రికెటర్లకు మెరుగైన శిక్షణ సదుపాయాలు, మ్యాచ్ ఫీజులు, కాంట్రాక్టు మనీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన సమయంలో…. వివాదాల కుంపటి రాజుకొంది. ఇటు ప్లేయర్లు, అటు శిక్షకులకు ఆటకంటే తామే గొప్పవారమనే భావన రావడంతోనే అసలు కథ ప్రారంభమయ్యింది.

కోచ్ ల వేట, ఆతర్వాత వేటు…

బీసీసీఐ పరిథిలోకి రాకముందు వరకూ…భారత మహిళా క్రికెట్ సరైన శిక్షకులు, శిక్షణ సదుపాయాలు, మ్యాచ్ ఫీజులు లేక సతమతమవుతూ ఉండేది. మాజీ క్రికెటర్లనే శిక్షకులుగా ఎంచుకొని అంతర్జాతీయ టోర్నీలు, విదేశీ సిరీస్ ల్లో పాల్గొంటూ ఉండేది.

భారత మాజీ క్రికెటర్ పూర్ణిమారావు కోచ్ గా…. భారత మహిళా క్రికెట్ గణనీయమైన ప్రగతి, పురోగతి సాధించిన సమయంలోనే…. అమర్యాదకరమైన రీతిలో పూర్ణిమను తొలగించి రంజీ మాజీ క్రిెకెటర్ తుషార్ ఆరోతీని శిక్షకునిగా నియమించారు.

తుషార్ కోచ్ గా భారత మహిళా క్రికెట్ దూకుడుగా ఆడటం మొదలుపెట్టింది. తొలిసారిగా ఓ పురుషుడు శిక్షకుడుగా ఉండటంతో శిక్షణ, వ్యూహాలు, ఆలోచనా విధానం సమూలంగా మారిపోయాయి.

వన్డే జట్టుకు మిథాలీ రాజ్ ను, టీ-20 జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ ను కెప్టెన్లుగా నియమించడం ద్వారా మహిళా క్రికెట్ గాడిలో పడినట్లే కనిపించింది. అయితే…కౌలాలంపూర్ వేదికగా ముగిసిన టీ-20 ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ కంగుతిని రన్నరప్ స్థానంలో నిలవడం…ఫైనల్లో ఆడిన తుదిజట్టు నుంచి పేస్ బౌలర్ వస్త్రార్ కర్ ను తప్పించడం, దానికి తోడు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో విభేదాల తో కోచ్ తుషార్ పై వేటు పడింది.

తుషార్ పోయే…. పొవార్ వచ్చే….

తుషార్ ఆరోతీ స్థానంలో కోచ్ గా భారత మాజీ క్రికెటర్ రమేశ్ పోవార్ పగ్గాలు చేపట్టాడు. కరీబియన్ ద్వీపాలు వేదికగా ముగిసిన 2018 టీ-20 ప్రపంచకప్ లో భారతజట్టు పాల్గొనటమే కాదు… గ్రూప్ లీగ్ లో నాలుగుకు నాలుగుమ్యాచ్ లూ నెగ్గి ..గ్రూప్ టాపర్ గా సెమీస్ బెర్త్ సంపాదించింది.

తొలి రౌండ్లో రెండో ర్యాంకర్ న్యూజిలాండ్, ఆఖరిరౌండ్లో టాప్ ర్యాంకర్ ఆస్ట్రేలియా జట్లపై భారతజట్టు సాధించిన సంచలన విజయాలు, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సాధించిన మెరుపు సెంచరీతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

లీగ్ దశలో పాక్, ఐర్లాండ్ జట్లతో జరిగిన మ్యాచ్ లు మాత్రమే ఆడిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్…రెండు హాఫ్ సెంచరీలు సాధించినా… బంతికో పరుగు మాత్రమే సాధించడం ద్వారా… టీమ్ మేనేజ్ మెంట్ ను నిరాశకు గురి చేసింది.

దీంతో…ఇంగ్లండ్ తో జరిగిన సెమీఫైనల్లో …వెటరన్ మిథాలీని పక్కన పెట్టి…స్ట్రయిక్ రేట్ ఎక్కువగా ఉన్న యువ ప్లేయర్ తాన్యాకు తుదిజట్టులో చోటు కల్పించారు. అయితే…సెమీఫైనల్లో భారతజట్టు ఆట అన్ని విభాగాలలోనూ విఫలమై 8 వికెట్ల ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో విమర్శలు వెల్లువెత్తాయి.

అపార అనుభవం ఉన్న మిథాలీని పక్కనపెట్టి భారత్ భారీమూల్యం చెల్లించదంటూ మిథాలీ మేనేజర్ ట్విట్టర్ ద్వారా ఆరోపణలు గుప్పించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, కోచ్ రమేశ్ పోవార్లను విమర్శించింది.

ఇంగ్లండ్ తో ముగిసిన సెమీఫైనల్లో పోటీకి దిగిన భారత తుదిజట్టును కెప్టెన్, వైస్ కెప్టెన్, కోచ్, సెలెక్టర్లతో కూడిన టీమ్ మేనేజ్ మెంట్ ఎంపిక చేసిందని…. మిథాలీ స్ట్రయిక్ రేట్ తక్కువగా ఉన్న కారణంగానే విన్నింగ్ కాంబినేషన్ ను కొనసాగించినట్లు ప్రకటించింది. బీసీసీఐ పాలకమండలి సభ్యురాలు డయానా ఎడుల్జీ సైతం…సెలెక్షన్ కమిటీ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించింది.

మిథాలీ గరంగరం….

ప్రపంచకప్ లో తాను నిలకడగా రాణించినా…తనను పక్కనపెట్టి అవమానించారంటూ…సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ ఆందోళన వ్యక్తం చేసింది. కోచ్ రమేశ్ పొవార్, పాలకమండలి సభ్యురాలు డయానా ఎడుల్జీ..తన కెరియర్ ను అంతం చేయటానికి కుట్రపన్నారంటూ మండిపడింది. క్రికెట్ కోసం 20 ఏళ్లుగా తన జీవితాన్ని అంకితం చేస్తే…చివరకూ ఇలా అవమానిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

మరోవైపు..డయానా మూడునెలలకు ఓసారి మాటమారుస్తారా అంటూ మాజీ కోచ్ తుషార్ నిలదీశారు. ఆసియాకప్ టీ-20 ఫైనల్లో తుదిజట్టు ఎంపిక వివాదంలో తనను బలిపశువుగా చేసి.. పదవి నుంచి తప్పించారని…ప్రస్తుతం ప్రపంచకప్ లో మాత్రం తుదిజట్టు ఎంపిక టీమ్ మేనేజ్ మెంట్ దే నంటూ డయానా ఏవిధంగా సమర్థించగలరని తుషార్ ప్రశ్నించారు.

రమేశ్ పోవార్ కు సెగ….

మిథాలీ రాజ్ ఓ బ్లాక్ మెయిలర్, జట్టుప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమంటూ మిథాలీరాజ్ పై…కోచ్ రమేశ్ పొవార్… బీసీసీఐకి సమర్పించిన తన 10 పేజీల నివేదికలో ఆరోపించారు. మిథాలీ అనుచిత ప్రవర్తన పైనే ఐదు పేజీలు ఉండటం విశేషం.

మరోవైపు..మిథాలీ పై ఆరోపణలు చేసి ఇబ్బందులు కొనితెచ్చుకొన్న రమేశ్ పొవార్ సైతం…పదవీ కాలం పూర్తికాకుండానే పదవికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొత్తం మీద  ప్రస్తుత వివాదానికి …పాలకమండలి ఏకైక మహిళా సభ్యురాలు డయానా ఎడుల్జీ కేంద్రబిందువుగా నిలవడం…భారత మహిళా క్రికెట్ పరువుప్రతిష్టలను మరింత దిగజార్చింది.

గాడితప్పిన భారత మహిళా క్రికెట్ ను తిరిగి గాడిలో పెట్టడానికి, వివాదరహితంగా ఉంచడానికి బీసీసీఐ పాలకమండలి సభ్యులు ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

మిథాలీ టీ-20 కథ ముగిసినట్లేనా?

 ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ లో మిథాలీ ఆడిన రెండుకు రెండుమ్యాచ్ ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించింది. అయితే…బంతికో పరుగు సాధించడం ద్వారా మిథాలీ విమర్శలను ఎదుర్కొంది. 50 పరుగులను 50 బంతుల్లో సాధించడం పట్ల టీమ్ మేనేజ్ మెంట్ అసంతృప్తితో ఉంది.

85 టీ-20ల్లో 2వేల283 పరుగులు

టీ-20 అంటే కుర్రకారు ఆట. మిథాలీరాజ్ లాంటి 35 ఏళ్ల వెటరన్ ప్లేయర్ల ఆట ఏమాత్రం కాదని…మహిళా సెలెక్షన్ కమిటీ భావిస్తోంది. టీ-20 నుంచి మిథాలీ తనకుతానుగా తప్పుకొంటే.. మేలని సలహా ఇచ్చింది.

ఇటీవలి ప్రపంచకప్ లో ఐర్లాండ్  తో ముగిసిన మ్యాచ్ వరకూ ఆడిన మొత్తం 85 మ్యాచ్ ల్లో 80 ఇన్నింగ్స్ ఆడిన మిథాలీ రాజ్ 2వేల 83 పరుగులు సాధించింది.ఇందులో 17 హాఫ్ సెంచరీలతో సహా…. 97 పరుగుల అత్యధిక స్కోరును సైతం నమోదు చేసిింది.

2006లో టీ-20 అరంగేట్రం…

2006లో ఇంగ్లండ్ ప్రత్యర్థిగా టీ-20 అరంగేట్రం చేసిన మిథాలీ…గత 12 సంవత్సరాలుగా…భారత టీ-20 జట్టులో సభ్యురాలిగా ఉంటూ వస్తోంది. బీసీసీఐ ఒత్తిడితో మిథాలీ ఒకవేళ టీ-20 ఫార్మాట్ నుంచి.. తప్పుకొంటే…ప్రస్తుత ప్రపంచకప్…ఆఖరి ప్రపంచకప్ అనుకోక తప్పదు. అయితే అపారఅనుభవం ఉన్న మిథాలీ..50 ఓవర్ల వన్డే క్రికెట్ తో పాటు..టెస్ట్ క్రికెట్ లో సైతం తన కెరియర్ ను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.

కేవలం క్రికెట్ కెరియర్ కోసమే వివాహాన్ని వాయిదా వేసుకొంటూ వచ్చిన 35 ఏళ్ల 358 రోజుల వయసున్న మిథాలీ…ఆట కోసం వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేయటం గొప్పవిషయమే మరి.