డ్యాన్స్ పప్పా డ్యాన్స్….

  • కూతురు జీవాతో కలసి ధోనీ స్టెప్పులు
  • జీవా-ధోనీ తాజావీడియోకు లక్షల్లో లైకులు

జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు…వ్యక్తిగత జీవితంలోనూ ప్రతిక్షణాన్ని తనదైన శైలిలో ఆస్వాదిస్తుంటాడు. టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత… వన్డే,టీ-20 ఫార్మాట్లకే పరిమితమైన ధోనీ… ప్రస్తుతం దొరికిన విరామ సమయాన్ని పూర్తిస్థాయిలో ఫ్యామిలీ కోసమే కేటాయిస్తున్నాడు.

తన గారాలపట్టీ జీవాతో కలసి ఆడుతూ పాడుతూ..అల్లరి చేస్తూ…తానూ ఓ చిన్నపిల్లాడిలా మారిపోతున్నాడు. కూతురుతో కలసి పంచుకొన్న మధుర ఘట్టాలను…సోషల్ మీడియా ద్వారా…పంచుకోడం ఓ అలవాటుగా మార్చుకొన్నాడు.

తన కుమార్తె జీవాతో కలసి డ్యాన్స్ చేసిన ధోనీ…తాజా వీడియోను…సోషల్ మీడియా ద్వారా అభిమానుల ముందుంచాడు. ఇంకేముంది..అభిమానుల నుంచి అద్దిరిపోయే స్పందన వచ్చింది.

ఈ వీడియోను షేర్‌ చేసిన కొద్ది సమయంలోనే లక్షలకు లక్షలుగా లైకులొచ్చాయి. ఇప్పటి వరకూ ఈ వీడియోను అనూహ్యంగా 25 లక్షల 30వేల మందికి పైగా వీక్షించారు. లైకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ధోనీ తాజా వీడియోలో తన కుమార్తె జీవాతో కలసి స్టెప్పులేయడం అభిమానులను ఆకట్టుకొంది. చిన్నారి జీవా డ్యాన్స్ కు అనుగుణంగా స్టెప్పులేసి చూపిస్తే…ఆ తర్వాత ధోనీ తన కుమార్తెను అనుకరిస్తూ స్టెప్పులేసి మరీ మురిసిపోయాడు.

ఆ తర్వాత..ఓ ఆంగ్ల గీతానికి జీవా స్టెప్పులేసి… ధోనీని కూడా స్టెప్పులేయమంటూ చెప్పడం ఆకట్టుకుంటోంది. దీనిపై నెటిజన్లు వ్యాఖ్యల వర్షం కురిపిస్తున్నారు. ‘జీవా అప్పుడే కొరియోగ్రాఫర్‌ అవతారమెత్తింది’, అని, ‘డ్యాన్సర్‌గా ధోనీ కొత్త ఇన్నింగ్స్‌లోకి అడుగుపెట్టినందుకు శుభాకాంక్షలు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఏది చేసినా ధోనీ మాత్రమే చేయాలి అనడానికి ఇంతకు మించిన తాజా నిదర్శనం మరొకటి లేదు.